స్టార్ హీరోయిన్ కోసం అగ్ర హీరో చెంప ప‌గ‌లగొట్టాల‌నుకున్న మేటి న‌టి

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్, ప్రతిభ ఎంత వేగంగా గుర్తింపు తెస్తాయో.. అంతే వేగంగా వివాదాలు, వ్యక్తిగత విభేదాలు కెరీర్‌లను మలుపు తిప్పుతాయి.

Update: 2026-05-23 04:14 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్, ప్రతిభ ఎంత వేగంగా గుర్తింపు తెస్తాయో.. అంతే వేగంగా వివాదాలు, వ్యక్తిగత విభేదాలు కెరీర్‌లను మలుపు తిప్పుతాయి. బాలీవుడ్‌లో ఒకప్పుడు అందాల నటి ఐశ్వర్యా రాయ్ ఎదుర్కొన్న కొన్ని నాటకీయ పరిణామాలు త‌న‌ వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు .. ప్రపంచ సుందరి క్రేజ్ ఆ తర్వాతి కాలంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌తో వచ్చిన తీవ్రమైన విభేదాల కారణంగా పెద్ద ఎత్తున హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఒకానొక దశలో ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే.. బచ్చన్ కుటుంబానికి చెందిన సీనియర్ నటి జయా బచ్చన్ స్వయంగా షారూఖ్‌ను కొట్టాలనేంత కోపానికి గురయ్యారు.

సినీ ప్రస్థానంలో ఐశ్వర్యా రాయ్, షారూఖ్ ఖాన్ కాంబినేషన్‌కు ఒకప్పుడు వెండితెరపై తిరుగులేని క్రేజ్ ఉండేది. జోష్, మొహబ్బతీన్, దేవదాస్ వంటి చిత్రాలలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ విజయాల తర్వాత ఐశ్వర్యను బాలీవుడ్‌లో అగ్ర నటిగా చూసారు. అయితే 2000 కాలం ప్రారంభంలో సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్యకు ఉన్న వ్యక్తిగత సంబంధాలు ఆ కారణంగా షూటింగ్ సెట్స్‌పై జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు షారూఖ్ ఖాన్‌తో త‌న‌ వృత్తిగత బంధాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. చల్తే చల్తే సినిమా సెట్స్‌పై జరిగిన ఒక పెద్ద గొడవ తర్వాత వీరిద్దరి మధ్య మాటలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఈ విభేదాల ప్రభావం ఐశ్వర్యా రాయ్ కెరీర్‌పై చాలా ఘోరంగా పడింది. ఎందుకంటే ఆ వివాదం అనంత‌రం ఐష్ ను షారూఖ్ ఖాన్ దాదాపు ఐదు ప్రతిష్టాత్మక పెద్ద బ్యానర్ చిత్రాల నుండి ఉన్నపళంగా తొలగించారు. ఇందులో బ్లాక్‌బస్టర్ హిట్‌లుగా నిలిచిన చల్తే చల్తే, వీర్ జారా వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు సిమి గరేవాల్ టాక్ షోలో ఐశ్వర్య దీనిపై స్పందిస్తూ.. తనను ఎందుకు సినిమాల నుండి తొలగించారో తాను ఎవరినీ అడగలేదని.. తన ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని చాలా హుందాగా సమాధానమిచ్చింది. అయితే తన సహనటిని అలా తొలగించడంపై షారూఖ్ ఖాన్ తర్వాతి కాలంలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు.

ఈ వివాదం కేవలం ఆ ఇద్దరు నటీనటుల మధ్యే ఆగకుండా.. కాలక్రమేణా బచ్చన్ కుటుంబం వరకు పాకింది. ముఖ్యంగా అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య వివాహం జరిగిన తర్వాత ఆమె అత్తగారు జయా బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో షారూఖ్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఐశ్వర్యపై షారూఖ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. షారూఖ్ గనుక ఆ సమయంలో నా ఇంట్లో ఉండి ఉంటే నా స్వంత కొడుకును కొట్టినట్లే అతడిని కూడా లాగి ఒకటి కొట్టేదాన్ని! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా తనకు షారూఖ్ అంటే ఒక బలహీనత ఉందని.. అతడితో ఆత్మీయ అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతల వల్లే 2007లో జరిగిన అభిషేక్-ఐశ్వర్యల పెళ్లికి కూడా షారూఖ్ హాజరు కాలేదు.

కాలం గాయాల్ని మాన్పుతుంది. స‌మ‌యం గడిచేకొద్దీ ఈ ఇద్దరు స్టార్ల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయాయి. షారూఖ్ ఖాన్ త‌న సీనియ‌ర్ అయిన‌ బచ్చన్ కుటుంబంతో మళ్లీ పాత సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ఐశ్వర్యతో కలిసి కరణ్ జోహార్ చిత్రం `యే దిల్ హై ముష్కిల్`లో ఒక చిన్న సీన్‌లో కూడా నటించారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉంటూ స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ.. ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా క్రమంగా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలకు దూరమై కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే పరిమితమైన ఐశ్వర్యా రాయ్ జీవిత ప్రస్థానం.. సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగత సమీకరణాలు ఒక నటి కెరీర్‌ను ఎలా శాసిస్తాయో చెప్పడానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది.

Tags:    

Similar News