ద‌ళ‌ప‌తి (X) జేస‌న్: అంత పెద్ద హీరో కొడుకు ద‌ర్శ‌కుడ‌వుతానంటే ఇదీ రియాక్ష‌న్!

కోలీవుడ్ స్టార్ హీరో, విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిలాగే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తే ఎంతటి పెద్ద స్టార్ అయినా కాగలడు.

Update: 2026-08-10 03:59 GMT

కోలీవుడ్ స్టార్ హీరో, విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిలాగే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తే ఎంతటి పెద్ద స్టార్ అయినా కాగలడు. కానీ గొప్ప‌ నట వారసత్వాన్ని పక్కనపెట్టి దర్శకుడిగా మారాలని నిర్ణయించుకోవడం విజయ్ అభిమానులను, సగటు ప్రేక్షకులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా స్టార్ కిడ్స్ హీరోలుగానే ప్రయాణం ప్రారంభించడానికి ఇష్టపడతారు. అయితే ప్రతి ఒక్కరి గమ్యం విధిపై ఆధారపడి ఉంటుందని నమ్మిన విజయ్, కొడుకు నిర్ణయాన్ని ఏమాత్రం వ్యతిరేకించకుండా అత‌డి ఆసక్తిని కలలను నిరాశ‌ప‌ర‌చ‌కుండా పూర్తిస్థాయిలో ప్రోత్సహించారు.

ప్రస్తుతం జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషన్లలో జేసన్ తన ఫిల్మ్ మేకింగ్ ప్రయాణం, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే షూటింగ్ సెట్స్‌కి వెళ్లడం వల్ల సినిమా వాతావరణం తనకు చాలా సాధారణంగా అనిపించేదని తెలిపారు. తన స్నేహితులు సినిమాలను కేవలం వినోదం కోసమే చూస్తే.. తను మాత్రం తన తండ్రిని ఆ వృత్తిలో చూస్తూ చిన్నతనం నుంచే ఫిల్మ్ మేకింగ్‌పై ప్రత్యేక ఆసక్తిని పెంచుకున్నానని వెల్లడించారు.

తను విదేశాలకు వెళ్లి స్వతంత్రంగా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చదువుకుంటానని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం సంకోచించలేదని జేసన్ గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న విజయ్.. ఈ రంగంలో కోర్సులు చేయడంలోని ప్రాముఖ్యతను త్వరగానే గుర్తించి కొడుకు ప్రతిపాదనకు మొదటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించి ఎన్నో అధునాత‌న‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని.. వాటిని నేర్చుకోవడం వల్ల ఈ రంగంపై పూర్తి స్పష్టత వస్తుందని విజయ్ తన కుమారుడికి ధైర్యం చెప్పారు. స్వయంగా నేర్చుకుంటేనే ఏది సెట్ అవుతుందో అర్థమవుతుందని కొడుకుని ఎంతగానో ప్రోత్సహించారు.

ఈ క్రమంలోనే `లియో` చిత్ర పూజా కార్యక్రమం సమయంలో ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను కలిసినప్పటి అనుభవాన్ని జేసన్ షేర్ చేసారు. ఆ సమయంలో లోకేష్ కనగరాజ్ సరదాగా స్పందిస్తూ.. ''మా వారందరికీ (విజయ్ గారికి) నువ్వంటే చాలా ఇష్టం, నీపై జోకులు వేస్తే నువ్వు వెళ్ళి బయట చెప్పేస్తావులే'' అని హాస్యంగా అన్నారని తెలిపారు. ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండి కూడా లోకేష్ కనగరాజ్ అంతటి సింప్లిసిటీతో తనతో వచ్చి మాట్లాడటం చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని.. ఆ క్షణాలు తనకు ఎంతో ప్రత్యేకమైనవని జేసన్ పేర్కొన్నారు.

మొత్తానికి తండ్రిలా నటుడిగా కాకుండా... కెమెరా వెనుక ఉండి కథలను నడిపించే దర్శకుడి పాత్రను ఎంచుకున్న జేసన్ సంజయ్ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నతనం నుంచే సినీ వాతావరణంలో పెరగడం.. విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేయడం... అలాగే తండ్రి విజయ్ అందించిన సంపూర్ణ మద్దతుతో ఆయన దర్శకుడిగా ఒక బలమైన పునాది వేసుకున్నారు. సందీప్ కిషన్‌తో తెరకెక్కించిన ఈ తొలి చిత్రంతో జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారోనని సినీ వర్గాలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సందీప్ కిష‌న్ హీరోగా జేస‌న్ సంజయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి సినిమా `సిగ్మా` యాక్ష‌న్ అడ్వంచ‌ర్- కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఈ సినిమా ఈనెల‌లో విడుద‌ల కానుంది.

Tags:    

Similar News