రావిపూడి కొత్త టైటిల్.. ఈసారి ఇంకెలా సర్ప్రైజ్ చేస్తారో..

టాలీవుడ్‌ లో సినిమా ప్రమోషన్స్ అంటే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు అనేవి కామన్. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం ఆ పద్ధతికి భిన్నంగా ఆలోచిస్తుంటారు.

Update: 2026-06-15 03:34 GMT

టాలీవుడ్‌ లో సినిమా ప్రమోషన్స్ అంటే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు అనేవి కామన్. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం ఆ పద్ధతికి భిన్నంగా ఆలోచిస్తుంటారు. సినిమా సెట్స్‌ పైకి వెళ్లకముందే ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యేలా చేయడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న కొత్త మల్టీస్టారర్ విషయంలో కూడా అదే ప్లాన్ ఫాలో అవుతున్నారు.

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఆ చిత్రం జూన్ 18న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం టైటిల్. ఆ చిత్రానికి 'జనవరి 13 విడుదల' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారైందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అదే టైటిల్‌ ను నేరుగా ప్రకటించకుండా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్పెషల్ ప్లాన్ తో రివీల్ చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు టైటిల్ అదేనా? లేక మరో సర్ప్రైజ్ దాగి ఉందా? అనే ఆసక్తి మరింత పెరిగింది.

సాధారణంగా సినిమా ప్రారంభమైన తర్వాత ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ అనిల్ రావిపూడి మాత్రం షూటింగ్‌ కు ముందే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇటీవల సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, రైటర్ అనంత శ్రీరామ్‌ లతో రూపొందించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖ బీచ్ ఇసుకలో వారిని మెడ వరకు కప్పేసి, జంధ్యాల మార్క్ కామెడీ గుర్తు చేసేలా రూపొందించిన ఆ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇది అనిల్ రావిపూడికి కొత్తేమీ కాదు. గతంలో ప్రమోషన్స్‌ కు దూరంగా ఉండే నయనతారతో ప్రత్యేక వీడియో చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా విడుదలకు ముందే చర్చలోకి తీసుకురావడం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కంటెంట్ ప్లాన్ చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. అందుకే ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడిని మించిన వారు లేరంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇక ఆ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, వెంకటేష్ జోడీగా కీర్తి సురేష్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఆ చిత్రానికి సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో సినిమా తెరకెక్కనుంది.

సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి కలిసొచ్చింది. వెంకటేష్‌ తో ఆయన కాంబినేషన్ ఇప్పటికే సక్సెస్ అయింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేరడంతో ఆ మల్టీస్టారర్‌ పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే అందరి దృష్టి మాత్రం ఒకే విషయంపై నిలిచింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న టైటిల్‌ నే ప్రకటిస్తారా? లేక అనిల్ రావిపూడి మార్క్‌ లో మరో కొత్త సర్ప్రైజ్ ఇస్తారా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News