శేఖర్ మాస్టర్ తో గొడవపై జానీ మాస్టర్ క్లారిటీ.. అసలేం చెప్పారంటే?
తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, బయట ప్రచారం జరుగుతున్నట్లుగా పరిస్థితి లేదని స్పష్టం చేశారు. డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఏకంగా వార్ జరుగుతోందన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు.
టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ వార్తలపై జానీ మాస్టర్ తాజాగా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, బయట ప్రచారం జరుగుతున్నట్లుగా పరిస్థితి లేదని స్పష్టం చేశారు. డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఏకంగా వార్ జరుగుతోందన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు.
డ్యాన్సర్స్ యూనియన్ కు సంబంధించిన కొన్ని విషయాలపై మాత్రమే చర్చలు జరిగాయని, వాటిని వ్యక్తిగత విభేదాలుగా అనుకోవడం సరైనది కాదని జానీ మాస్టర్ అన్నారు. ప్రతి సంస్థలో కూడా అభిప్రాయ భేదాలు సహజమేనని, వాటిని పెద్ద వివాదాలుగా చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. యూనియన్ సంక్షేమం, డ్యాన్సర్ల ప్రయోజనాల కోసమే అందరూ కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే విషయానికి ఉదాహరణగా శేఖర్ మాస్టర్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయాన్ని జానీ మాస్టర్ ప్రస్తావించారు.
చిరంజీవితో కలిసి భోజనం చేశామని, సినిమాలు, పాటలు, డ్యాన్స్ స్టెప్పుల గురించి ఎంతో క్లోజ్ గా మాట్లాడుకున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో కూడా చూపిస్తూ, తామిద్దరం ఎప్పటిలాగే ఫ్రెండ్లీగా ఉన్నామని వివరించారు. చిరంజీవి ఎప్పుడూ డ్యాన్స్ మాస్టర్లకు అండగా నిలుస్తారని జానీ మాస్టర్ అన్నారు. ఇండస్ట్రీలో డ్యాన్స్ కు, డ్యాన్స్ మాస్టర్లకు ప్రత్యేక గుర్తింపు రావడంలో చిరంజీవి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
ఆయనతో పాటు సినీ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు కూడా కొరియోగ్రాఫర్ల టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అందుకు వారందరికీ థ్యాంక్స్ తెలిపారు. ఇటీవల డ్యాన్సర్స్ అసోసియేషన్ కు సంబంధించిన కొన్ని పరిణామాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. యూనియన్ లో మెంబర్ షిప్స్, ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై అభిప్రాయ భేదాలు వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ పరిస్థితిని యూనియన్ పెద్దలు చర్చల ద్వారా క్లియర్ చేసినట్లు సమాచారం. ఆ ప్రచారాలన్నింటికీ చెక్ పెడుతూ జానీ మాస్టర్.. తమ మధ్య గొడవ అనే మాటే లేదని మరోసారి స్పష్టం చేశారు. తామంతా ఒకే ఫ్యామిలీలా కలిసి పనిచేస్తామని, డ్యాన్స్ ను డెవలప్ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రావడం ప్రతి కుటుంబంలో జరిగేదేనని, వాటిని గొడవలుగా చూడొద్దని కోరారు.
అయితే ప్రస్తుతం శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరూ టాలీవుడ్‌లో అత్యంత బిజీ కొరియోగ్రాఫర్లుగా దూసుకుపోతున్నారు. టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇలాంటి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి జానీ మాస్టర్ ఇచ్చిన క్లారిటీతో కొంతవరకు చెక్ పడినట్టే కనిపిస్తోంది. యూనియన్ కు సంబంధించిన అంశాలను వ్యక్తిగత వివాదాలతో లింక్ చేయకుండా చూడాలని ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.