లెనిన్ సీన్.. బాలయ్య సినిమా నుంచి కాపీ?
‘లెనిన్’లో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆమె మీద కక్ష గట్టిన విలన్.. కుట్ర చేసి ఆమెకు కత్తిపోటు దిగేలా చేస్తాడు.
మన సినిమాల్లో సన్నివేశాలు చూసి ప్రతిదీ ఒరిజినల్ అనుకుంటే పొరపాటే. ఏదో సినిమా నుంచి స్ఫూర్తి పొందడం పెద్ద పెద్ద దర్శకులకూ అలవాటే. ఎక్కువగా హాలీవుడ్ సహా విదేశీ భాషా చిత్రాల నుంచి ఇన్‌స్పైర్ అవడం మామూలే. ఐతే కొన్నిసార్లు మన పాత సినిమాల్లోని సన్నివేశాలనే మక్కీకి మక్కీ దించేస్తుంటారు ఫిలిం మేకర్స్.
కానీ ఒకప్పుడైతే చెల్లిపోయేది కానీ.. ఈ ఇంటర్నెట్ యుగంలో ఎక్కడి నుంచి ఓ సన్నివేశాన్ని కాపీ కొట్టినా.. ఇన్‌స్పైర్ అయి ఓ సీన్ తీసినా.. ఇట్టే పట్టేస్తారు జనం. గత వీకెండ్లో మంచి అంచనాల మధ్య రిలీజైన చక్కటి వసూళ్లతో సాగిపోతున్న ‘లెనిన్’ సినిమాలోనూ ఒక కీలక సన్నివేశానికి ఓ పాత చిత్రం స్ఫూర్తిగా నిలిచింది. ఆ చిత్రమే.. నందమూరి బాలకృష్ణ నటించిన కృష్ణబాబు. మీనా బాలయ్యకు జోడీగా నటించిన ఆ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య రూపొందించారు.
‘లెనిన్’లో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆమె మీద కక్ష గట్టిన విలన్.. కుట్ర చేసి ఆమెకు కత్తిపోటు దిగేలా చేస్తాడు. ఆ కత్తి పోటు ఎవరు దింపారన్నది చెబితే స్పాయిలర్ అవుతుంది. అదేంటో తెర మీదే చూసి తెలుసుకోవాలి. ఐతే ఈ సన్నివేశాన్ని బాలయ్య మూవీ ‘కృష్ణబాబు’ నుంచి తీసుకోవడం విశేషం. అందులో విలన్ కూడా ఇదే ట్రిక్ ప్లే చేస్తాడు. ‘లెనిన్’ రిలీజవ్వడం ఆలస్యం నెటిజన్లు ‘కృష్ణబాబు’ సినిమాలోని ఆ సన్నివేశం తాలూకు వీడియోను పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేశారు.
ఆ సన్నివేశం చూస్తే.. ‘లెనిన్’ సినిమాలో కీలక సన్నివేశం బాలయ్య చిత్రం నుంచి తీసుకున్నదే అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది కోయిన్సిడెన్స్ అని కవర్ చేయడానికి కూడా వీల్లేనట్లుగా ఉంది ఆ సన్నివేశం. బాలయ్యతో నాగార్జునకు అంత మంచి సంబంధాలు లేకపోయినా.. కొడుక్కి హిట్ చాలా అవసరమైన టైంలో నందమూరి హీరో సినిమా నుంచే ఓ కీలక సన్నివేశాన్ని తీసుకున్నారంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు.