జక్కన్న గైడెన్స్ సరే కార్తికేయ సొంత మార్క్ వేయడమెలా?
ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌తో కార్తికేయ నిర్మిస్తున్న`డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` సినిమా ఓకే అవ్వడానికి చాలా సమయం పట్టిందని తెలుస్తోంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలకు బ్యాక్ బోన్‌లా ఉంటూ.. `బాహుబలి`, `ఆర్.ఆర్.ఆర్` వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలకు ప్రీ-ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్- ప్రమోషన్స్ వరకు అన్ని వ్యవహారాలను సమర్థంగా నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ గా ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయకు సుదీర్ఘ అనుభవం ఉంది. రాజమౌళి సినిమాలన్నిటికీ తెరవెనక కీలక వ్యక్తిగా కార్తికేయ గురించి చెబుతుంటారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి వరుస చిత్రాలతో టాలీవుడ్‌లో షైన్ అవుతున్నారు. అయితే కార్తికేయ సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నా.. కంటెంట్ పరంగా జక్కన్న స్టాంప్ పడనిదే ఆయన అడుగు ముందుకు వేయలేరా? ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వారణాసి పనుల్లో బిజీగా ఉన్నా.. తన కుమారుడి నిర్మాణంలో వస్తున్న సినిమాల స్క్రిప్టులు, అవుట్‌పుట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారట.
ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌తో కార్తికేయ నిర్మిస్తున్న`డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` సినిమా ఓకే అవ్వడానికి చాలా సమయం పట్టిందని తెలుస్తోంది. రాజమౌళి గారు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి.. ఆయన స్టాంప్ పడ్డ తర్వాతే ఈ చిత్ర స్క్రిప్ట్ ఫైనల్‌గా లాక్ అయింది. కేవలం స్క్రిప్ట్ దశలోనే కాకుండా.. మూవీ షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత కూడా ప్రతి రష్‌ను జక్కన్నకు చూపించి.. ఆయన ఇచ్చే తుది సలహాల ఆధారంగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. నేటి మారుతున్న ట్రెండ్‌లో సినిమాలు ఎలా తీయాలో.. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఎలాంటి కంటెంట్‌ను ఎంచుకోవాలో నిరూపించిన రాజమౌళి `మాస్టర్ క్లాస్` గురించి నేటితరం ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సినిమా మేకింగ్‌లోను, కథల ఎంపికలోను రాజమౌళి అనుసరించే పక్కా ప్లానింగ్- జడ్జిమెంట్‌ను కార్తికేయ సైతం పూర్తిగా అందిపుచ్చుకుంటున్నారు.
అయితే ఒక ప్రాక్టికల్ కోణంలో పరిశీలిస్తే జక్కన్న మార్గదర్శకత్వం కార్తికేయకు ఒక బలమైన రక్షణ కవచంలా నిలుస్తుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న ఏకైక దర్శకుడు రాజమౌళి కావడంతో ఆయన ఒక స్క్రిప్టును చూసి ఓకే అన్నారంటే ఆ కథలో కనీస గ్యారెంటీ ఉంటుందని అర్థం. నేటి లీగల్ -డిజిటల్ యుగంలో కోట్లాది రూపాయల బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు ఒక్క చిన్న తప్పు జరిగినా నిర్మాత రోడ్డున పడే ప్రమాదం ఉంది. అలాంటి తరుణంలో ఈ గైడెన్స్ కార్తికేయకు ఒక పెద్ద సేఫ్టీ నెట్ లా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు కోట్లు నష్టపోయి నేర్చుకునే పాఠాలను, కార్తికేయ తన మార్గదర్శి పర్యవేక్షణలో ఉంటూ రూపాయి నష్టం లేకుండా నేర్చుకునే అద్భుతమైన అవకాశం లభించింది.
కానీ నాణేనికి మరో ప్రతికూల కోణం కూడా ఉంది. ప్రతి చిన్న విషయానికి .. స్క్రిప్ట్ లాకింగ్‌కు రాజమౌళి `స్టాంప్` కోసమే వేచి చూడటం వల్ల.. ఒక స్వతంత్ర నిర్మాతగా కార్తికేయకు తన సొంత గుర్తింపు.. శైలి లోపించే ప్రమాదం ఉంది. ఒక కథను ఓకే చేసేటప్పుడు లేదా రష్ చూసేటప్పుడు ప్రతిదానికీ రాజమౌళి గారి జడ్జిమెంట్‌పైనే ఆధారపడితే... కార్తికేయకు ఉండాల్సిన `కథను జడ్జ్ చేసే సొంత నైపుణ్యం` కాలక్రమేణా కష్టంగా మారుతుంది. దీనివల్ల రేపు సినిమా హిట్టయినా ఆ క్రెడిట్ `రాజమౌళి గారు వెనకుండి చూసుకున్నారు కాబట్టే హిట్ అయింది` అనే కోణంలోనే వెళ్తుంది తప్ప.. కార్తికేయ సొంత ప్రతిభకు దక్కాల్సిన గుర్తింపు తగ్గుతుంది. అలాగే రాజమౌళి టేస్ట్ వేరు, నేటి జనరేషన్ టేస్ట్ వేరు కాబట్టి... ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తే జక్కన్న ఇమేజ్ ముందు కార్తికేయ ఆలోచనలు వెనకబడిపోయే అవకాశం ఉంది.
కార్తికేయ ప్రస్తుతం తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి.. ప్రస్తుతానికి రాజమౌళి బ్రాండ్ - స్టాంప్ ఆయనకు బిజినెస్ పరంగా.. క్వాలిటీ పరంగా వంద శాతం అవసరం. అయితే లాంగ్ రన్‌లో ఒక `సాలిడ్ ప్రొడ్యూసర్`గా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవాలంటే మాత్రం... కార్తికేయ కొన్ని సినిమాల తర్వాత జక్కన్న నీడ నుండి బయటకు వచ్చి.. తన సొంత నిర్ణయాలతో రిస్క్ తీసుకుని సినిమాలు తీయాల్సి ఉంటుంది. అప్పుడే యువనిర్మాతకు ఒక స్వతంత్ర నిర్మాతగా పూర్తి స్థాయి గుర్తింపు .. ఇండస్ట్రీలో తన సొంత నిర్ణయాత్మక శక్తిని నిరూపించుకునే అవకాశం లభిస్తుంది.