తమిళ్ డెబ్యూ: చియాన్ వారసుడితో జూ.అతిలోక సుందరి!
ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ తొలిసారి జంటగా నటిస్తుండటంతో సౌత్ సినీ ప్రేమికుల్లో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారతీయ చలనచిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపిన దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఆపై టాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు అధికారికంగా తమిళ చిత్రసీమలోకి (కోలీవుడ్) అడుగుపెట్టబోతోందన్న వార్త ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. విలక్షణ నటుడు, చియాన్ విక్రమ్ కుమారుడైన యువ హీరో ధ్రువ్ విక్రమ్ సరసన యంగ్ బ్యూటీ తన తొలి తమిళ చిత్రంలో నటించనున్నారు. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ తొలిసారి జంటగా నటిస్తుండటంతో సౌత్ సినీ ప్రేమికుల్లో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే కోలీవుడ్ అగ్ర దర్శకుడు మారి సెల్వరాజ్ వంటి వైవిధ్యమైన దర్శకుడితో ఒక భారీ సినిమాను పూర్తి చేసిన ధ్రువ్ విక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను మరో క్రేజీ దర్శకుడితో లైన్‌లో పెట్టారు. కవిన్ హీరోగా ఘనవిజయం సాధించిన `దాదా` చిత్ర దర్శకుడు గణేష్ కె. బాబు ఈ సరికొత్త రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారు. ఈ తరం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ఒక అందమైన యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా సరికొత్త కోణంలో సాగే కథాంశంతో దర్శకుడు ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అతిలోక సుందరి శ్రీదేవికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులో ఉన్న క్రేజ్.. భారీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నేళ్ల తర్వాత తన నటవారసురాలు జాన్వీ కపూర్ నేరుగా తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ గా మారనుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను వెండితెరపై అత్యంత గ్రాండ్‌గా ఆవిష్కరించేందుకు కోలీవుడ్‌లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. ఎక్కడా బడ్జెట్ పరిమితులు లేకుండా.. విజువల్స్ పరంగా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ల వేట దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. చిత్ర యూనిట్ లీక్ చేసిన సమాచారం ప్రకారం... అతి త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. ఈ యూత్‌ఫుల్ యాక్షన్ డ్రామా కోసం కోలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఒక టాప్ సంగీత దర్శకుడిని ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సంగీతానికి ఈ కథలో చాలా ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది.
ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్ స్టైల్‌కు జాన్వీ కపూర్‌కు ఉత్తరాది- దక్షిణాదిలో ఉన్న గ్లామర్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని కేవలం తమిళానికే పరిమితం చేయడం లేదు. మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్ ప్లానింగ్‌తో తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ వ్యూహాలు రచిస్తున్నారు. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ కిడ్స్ జత కడుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.