రీజినల్ టాప్ 5లోకి ‘ఇరుముడి’ వెళ్లాలంటే ఇంకా ఎంత కావాలి?
‘ఇరుముడి’ 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.186.50 కోట్ల గ్రాస్‌కు చేరింది. ఇప్పుడు రూ.200 కోట్ల మార్క్ చాలా దగ్గరలో ఉంది.
‘ఇరుముడి’ 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.186.50 కోట్ల గ్రాస్‌కు చేరింది. ఇప్పుడు రూ.200 కోట్ల మార్క్ చాలా దగ్గరలో ఉంది. అయితే తెలుగు వరకే ప్రధానంగా రిలీజ్ అయ్యి, ఒకేసారి ఇతర ఇండస్ట్రీల మార్కెట్‌ను టార్గెట్ చేయని సినిమాల లెక్క తీసుకుంటే టాప్ 5లోకి రావడానికి ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న సినిమా రూ.213 కోట్లకు పైగా చేసింది. అంటే ‘ఇరుముడి’కి రూ.200 కోట్లు వచ్చిన వెంటనే టాప్ 5 మాత్రం దక్కదు.
ఈ రీజినల్ లిస్టులో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ముందుంది. బాక్సాఫీస్ ఆంధ్ర లెక్క ప్రకారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300.15 కోట్ల గ్రాస్ చేసింది. పాన్ ఇండియా రిలీజ్ లేకుండానే రూ.300 కోట్ల మార్క్ అందుకోవడం రీజినల్ మార్కెట్‌కు కొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి సంక్రాంతి కంటెంట్, చిరంజీవి స్టార్ పవర్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం వలన మంచి కలెక్షన్స్ వచ్చాయి.
రెండో స్థానంలో ‘అల వైకుంఠపురములో’ రూ.260.35 కోట్లతో ఉంది. దాని తర్వాత వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.252.65 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ రెండు సినిమాలూ భారీ యాక్షన్ స్కేల్ మీద కాకుండా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే భారీ వసూళ్లు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిస్తే రీజినల్ సినిమాకు ఎంత పెద్ద బిజినెస్ రావచ్చో ఈ రెండు సినిమాలు ముందే చూపించాయి.
నాలుగో స్థానంలో రంగస్థలం ఉండగా, ఐదో స్థానంలో సరిలేరు నీకెవ్వరు ఉంది. ప్రస్తుతం టాప్ 5లో ఉండాలంటే కనీసం రూ.214 కోట్ల దగ్గరకు వెళ్లాల్సిందే. ‘ఇరుముడి’ ఇప్పటి టోటల్‌తో చూస్తే ఐదో స్థానానికి దాదాపు రూ.27 కోట్ల దూరంలో ఉంది.
టాప్ 5 తెలుగు రీజినల్ బాక్సాఫీస్ కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు: రూ.300.15 కోట్లు
అల వైకుంఠపురములో: రూ.260.35 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం: రూ.252.65 కోట్లు
రంగస్థలం: రూ.216.90 కోట్లు
సరిలేరు నీకెవ్వరు: రూ.213.70 కోట్లు
‘ఇరుముడి’కి ఇప్పుడు మొదటి టార్గెట్ రూ.200 కోట్లే. అది దాటిన తర్వాత మరో రూ.14 కోట్ల వరకు వస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ను చేరుకునే అవకాశం ఉంటుంది. రెండో వారంలో కూడా సినిమా రోజువారీ వసూళ్లు పెరుగుతుండడంతో ఈ రికార్డు అందుకునే అవకాశం ఎంతో దూరంలో లేదు. కానీ రూ.214 కోట్లు దాటితేనే రీజినల్ టాప్ 5లో చోటు దక్కుతుంది. ఇక రానున్న రోజుల్లో ‘ఇరుముడి’కి స్క్రీన్స్ కూడా అదే రేంజ్ లో కాపాడుకోవాలి. ‘టాక్సిక్’ రిలీజ్ తర్వాత కొన్ని థియేటర్లలో షోలు తగ్గిన పరిస్థితి వచ్చింది. అయినా రెండో వీకెండ్‌లో సినిమా మళ్లీ జంప్ చూపించింది. ఇప్పుడు రోజుకు ఎంత గ్రాస్ వస్తుందో చూడాలి.