'యుద్ధంలో అమెరికా చేరితే'.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. పశ్చిమాసియా మొత్తం రగిలిపోతుంది.;

Update: 2025-06-21 12:20 GMT

గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. పశ్చిమాసియా మొత్తం రగిలిపోతుంది. మరోవైపు.. ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఉండబోతుందని అంటున్నారు. త్వరలో అమెరికా కూడా ఇరాన్ పై సైనిక చర్యకు దిగొచ్చని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో ఇరాన్ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఇరాన్‌ పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు కథనాలొస్తున్నాయి. ఈ అంశంపై రెండు వారాల్లోగా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని వైట్‌ హౌస్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ తో అమెరికా జట్టు కడితే ఇరాన్ తో పాటు ప్రతీ ఒక్కరీ ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అన్నారు. ఈ యుద్ధంలో అమెరికా సైనిక ప్రమేయం గురించి ట్రంప్ యోచిస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన దౌత్యపరమైన నిర్ణయాలపై యూరోపియన్ విదేశాంగ మంత్రులతో అరాఘ్చీ చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... త్వరలో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అమెరికా ఓ వైపు ఇరాన్ పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులకు రహస్యంగా మద్దతునిస్తూ.. మరోవైపు అణు ఒప్పంద చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని అన్నారు. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.

కాగా... ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనే లక్ష్యంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు నైతిక మద్దతు ఇస్తున్న అమెరికా.. త్వరలో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుందని, ఇరాన్ పై దాడులు చేయనుందని అంటున్నారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన వైట్ హౌస్... ఇరాన్‌ పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లోగా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని ప్రకటించింది. దీంతో అమెరికా ఈ యుద్ధంలో పాల్గొంటే పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఫలితంగా.. ఈ యుద్ధం మరింత విస్తరిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News