కామెడీ షోలు ఇప్పుడు బిగ్ బిజినెస్.. విదేశాల్లో భారీ డిమాండ్!
ఒకప్పుడు కేవలం నవ్వులు పూయించడానికే పరిమితమైన స్టాండ్-అప్ కామెడీ, ఇప్పుడు భారతదేశంలో వందల కోట్ల బిజినెస్‌గా మారిపోయింది.
ఒకప్పుడు కేవలం నవ్వులు పూయించడానికే పరిమితమైన స్టాండ్-అప్ కామెడీ, ఇప్పుడు భారతదేశంలో వందల కోట్ల బిజినెస్‌గా మారిపోయింది. కేవలం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లకే పరిమితం కాకుండా, లైవ్ షోలు, అంతర్జాతీయ టూర్లతో కమెడియన్లు కాసుల వర్షం కురిపిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ఇన్‌ఫ్లుయెన్సర్ ఎకానమీని శాసిస్తూ, గ్లోబల్ లెవెల్‌లో మన కమెడియన్లు సృష్టిస్తున్న హవా, మారుతున్న వారి బిజినెస్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న క్లబ్‌ల నుండి పెద్ద అరీనా షోల వైపు:
గడిచిన ఐదేళ్లలో కామెడీ బిజినెస్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు చిన్న చిన్న కాఫీ షాపులు, క్లబ్‌లలో మాత్రమే జరిగే స్టాండ్-అప్ షోలు.. ఇప్పుడు భారీ అరీనా షోలుగా రూపాంతరం చెందాయి. ఇక వేలాది మంది ప్రేక్షకులు ఒకేచోట చేరి లైవ్ కామెడీని ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఫలితంగా కమెడియన్లు కేవలం సోషల్ మీడియా వ్యూస్ మీదే ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
విదేశాల్లో విపరీతమైన క్రేజ్.. ఎన్నారైల ఆదరణ:
భారతీయ స్టాండ్-అప్ కమెడియన్లకు ఇప్పుడు దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఉండే ఎన్నారైలు మన కమెడియన్ల షోల కోసం ఎగబడుతున్నారు. ఇక ఈ గ్లోబల్ టూర్ల వల్ల క్రియేటర్లకు భారీగా లాభాలు వస్తున్నాయి. ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే, పెద్ద పెద్ద అంతర్జాతీయ టూర్ల ప్లానింగ్ దాదాపు ఏడాది ముందే జరిగిపోతుండటం విశేషం.
సమయ్ రైనా రికార్డ్ బ్రేకింగ్ సంపాదన:
ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక కమర్షియల్ వాల్యూ ఉన్న కామెడీ క్రియేటర్‌గా సమయ్ రైనా నిలిచారు. ఈయన క్రేజ్ చూసి బోల్డ్ కేర్, కేఎఫ్‌సీ, ఫ్లిప్‌కార్ట్, టిండర్, బోట్ వంటి అగ్రశ్రేణి గ్లోబల్ బ్రాండ్స్ లైన్ కడుతున్నాయి. ఇక సమయ్ రైనా ఒక్క బ్రాండెడ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయడానికి ఏకంగా రూ. 70 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఒక సాధారణ ఇన్‌స్టా స్టోరీకి రూ. 20 లక్షలకు పైగా, స్టాటిక్ పోస్ట్ కోసం రూ. 25 లక్షల నుండి రూ. 35 లక్షల వరకు వసూలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
గ్లోబల్ రికార్డులు:
సమయ్ రైనా చేసిన ‘స్టిల్ అలైవ్’ స్టాండ్-అప్ స్పెషల్‌కు ఏకంగా 63 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒకే అప్‌లోడ్‌పై ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన ఫుల్ లెంగ్త్ స్టాండ్ అప్ కామెడీ స్పెషల్‌గా ఇది వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇక ఈ జోరు కేవలం జాతీయ స్థాయిలోనే కాదు, ప్రాంతీయ భాషల్లోనూ కనిపిస్తోంది. మరాఠీ కమెడియన్ ప్రణిత్ మోరే ఒక్క రీల్‌కు రూ. 13-14 లక్షలు తీసుకుంటూ టాప్ రీజినల్ క్రియేటర్‌గా దూసుకుపోతున్నారు. వీరితో పాటు అభిషేక్ ఉపమన్యు, అనుభవ్ సింగ్ బస్సీ, డానిష్ సైత్ లాంటి వారు కూడా రేసులో ముందంజలో ఉన్నారు.
చివరగా చెప్పాలంటే.. నవ్వించడం అనేది ఒక భోగం అయితే, దాన్నే నమ్ముకుని వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడం ఒక అద్భుతం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి, గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా స్టాండ్-అప్ కామెడీ ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న బిగ్గెస్ట్ బిజినెస్ ఎకానమీగా అవతరించింది. భవిష్యత్తులో ఈ రంగం మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.