డైరెక్టర్ ఆలోచనే మార్చేసిన హీరో!
బాలీవుడ్‌లో వైవిథ్యమైన ప్రేమకథలు, భావోద్వేగభరిత చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ శైలి ప్రత్యేకమైనది.
బాలీవుడ్‌లో వైవిథ్యమైన ప్రేమకథలు, భావోద్వేగభరిత చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ శైలి ప్రత్యేకమైనది. ఆయన సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఇంతియాజ్ అలీకి చిత్ర పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన అలవాటు ఉండేదని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకే నటుడితో మళ్లీ మళ్లీ పనిచేయడానికి ఇంతియాజ్ సాధారణంగా ఇష్టపడరని, ప్రతి సినిమాకు కొత్త నటీనటులను ఎంచుకోవడానికే మొగ్గు చూపుతారని రణ్‌బీర్ పేర్కొన్నారు.
రణ్‌బీర్ కపూర్- ఇంతియాజ్ అలీ కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `రాక్‌స్టార్`, `తమాషా` చిత్రాలు ఎలాంటి క్లాసిక్స్ గా నిలిచాయో తెలిసిందే. ఇంతియాజ్ అలీ ఒక నటుడితో ఒక సినిమా చేసిన తర్వాత ఆ పాత్రకు సంబంధించిన కథ అక్కడితో ముగిసిందని భావిస్తారట. కొత్త కథను రాసుకునేటప్పుడు పాత నటుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. కానీ ఓ అసాధారణ నటుడు ఇంతియాజ్ అలీలోని ఈ ఆలోచనా సరళిని పూర్తిగా మార్చేశాడని రణ్‌బీర్ స్పష్టం చేశారు. ఆ రూల్‌ను బ్రేక్ చేసిన నటుడు ఎవరో కాదు. పంజాబీ రాక్‌స్టార్ దోసాంజ్.
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో దిల్జిత్ నటించిన `అమర్ సింగ్ చమ్కీలా` ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో దిల్జిత్ నటనకు, అంకితభావానికి ఇంతియాజ్ అలీ ఎంతగానో ఫిదా అయ్యారు. సాధారణంగా ఒక నటుడితో పనిచేసిన తర్వాత `మళ్లీ కలిసి పనిచేద్దాం` అని అంత త్వరగా చెప్పని ఇంతియాజ్ దిల్జిత్ విషయంలో మాత్రం తన నిబంధనను పక్కనబెట్టక తప్పలేదు. `అమర్ సింగ్ చమ్కీలా` షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంతియాజ్ అలీ స్వయంగా దిల్జిత్‌తో `మై వాపస్ ఆవుంగా` (నేను మళ్లీ నీ దగ్గరకు వస్తాను) అని అన్నట్లు రణ్‌బీర్ గుర్తుచేశారు.
దర్శకుడు నటుడి ప్రతిభకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా దీన్ని భావించొచ్చు. దిల్జిత్ సహజసిద్ధమైన నటనతో, పాత్రలో లీనమైపోయే తత్వంతో ఇంతియాజ్ అలీ హృదయాన్ని గెలుచుకున్నారని అందుకే ఆయనతో మరోసారి పనిచేయడానికి ఇంతియాజ్ ఆసక్తిగా ఉన్నారని రణబీర్ కపూర్ వ్యాఖ్యలతో అర్దమవుతుంది. సినిమా రంగంలో దర్శకుడికి, నటుడికి మధ్య ఉండే ట్యూనింగ్ కీలకం. ఇంతియాజ్ అలీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్లు పాత్రలకు ప్రాణం పోసే నటుల కోసం అన్వేషిస్తుంటారు. దిల్జిత్ దోసాంజ్ నటుడిగానే కాకుండా, గాయకుడిగా కూడా చమ్కీలా పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు.
నటుడిలోని ఆ ప్రతిభే దర్శకుడిని తన పాత నిబంధనలను, అలవాట్లను బద్దలు కొట్టుకుని సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టేలా ప్రేరేపిస్తుందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఇలా కొన్ఇన కాంబినేషన్లు సెట్ అవ్వడం వల్ల ఆసినిమాపై అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే వార్త బయటకు రావడంతో? దిల్జీత్-ఇంతియాజ్ మళ్లీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారా? అన్న చర్చ నెట్టింట మొదలైపోయింది.