బిగ్ న్యూస్‌: తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఐమాక్స్ థియేట‌ర్ ఎక్క‌డో తెలుసా?

ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ అర్థాంత‌రంగా మాయ‌మ‌య్యాక వినోద‌ప్రియులు తీవ్రంగా క‌ల‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ హైద‌రాబాద్ లో ఐమ్యాక్స్ ప్రారంభ‌మ‌య్యేది ఎప్పుడో ఎక్కడో అర్థం కాక ఇంత‌కాలంగా ఎదురు చూపులు చూసారు

Update: 2026-06-01 13:24 GMT

ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ అర్థాంత‌రంగా మాయ‌మ‌య్యాక వినోద‌ప్రియులు తీవ్రంగా క‌ల‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ హైద‌రాబాద్ లో ఐమ్యాక్స్ ప్రారంభ‌మ‌య్యేది ఎప్పుడో ఎక్కడో అర్థం కాక ఇంత‌కాలంగా ఎదురు చూపులు చూసారు. అయితే అలాంటి వారంద‌రికీ గుడ్ న్యూస్ అందించింది ఏఎంబి సినిమాస్ యాజ‌మాన్యం. ఎట్ట‌కేల‌కు ఐమ్యాక్స్ స్క్రీన్ ని ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...




దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఏఎంబి మాల్స్`ను హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్రారంభం కానున్న‌ సరికొత్త ప్రాపర్టీ `AMB క్లాసిక్ విక్టరీ`లో సరికొత్త ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌ను పరిచయం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. ప్రపంచ స్థాయి సినిమా సాంకేతికతలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఏఎంబీ సినిమాస్ ఈ సరికొత్త స్క్రీన్‌తో థియేట్రికల్ అనుభవాన్ని అత్యున్న‌త శిఖ‌రాల‌కు తీసుకెళ్లనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు - సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌ల నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ `ఏషియన్ గ్రూప్` సంయుక్త భాగస్వామ్యంలో `ఏఎంబీ సినిమాస్` ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తోంది. గతంలో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి `డాల్బీ సినిమా`ను లాంచ్ చేసిన ఘ‌న‌త ఈ సంస్థ‌కే చెందుతుంది. హైదరాబాద్‌లోనే మొట్టమొదటి హెచ్‌డిఆర్ బై బార్కో స్క్రీన్‌లను పరిచయం చేసి ఈ బ్రాండ్ సినిమా ఎగ్జిబిష‌న్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రదర్శన రంగంలో తమదైన ముద్రను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

త‌మ‌ లెగసీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏషియన్ గ్రూప్ మ‌రో పెద్ద అడుగు వేస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు టాలీవుడ్ ప్రముఖ హీరోలు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటిలతో చేతులు కలిపింది. ఈ భారీ కలయిక ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే (ఆంధ్రప్రదేశ్- తెలంగాణ) ఏకైక ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌ను హైదరాబాద్‌లోని `ఏఎంబీ క్లాసిక్ విక్టరీ` కి తీసుకువస్తున్నారు.

ఈ సరికొత్త మల్టీప్లెక్స్ హైదరాబాద్ సినీ చరిత్రలో ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన `సుదర్శన్ 70ఎమ్ఎమ్` థియేటర్ ప్రాంగణంలో నిర్మితమవుతోంది. దశాబ్దాలుగా తెలుగు సినిమా వేడుకలకు, భారీ బ్లాక్‌బస్టర్ల సెలబ్రేషన్స్‌కు సుదర్శన్ 70ఎమ్ఎమ్ థియేటర్ ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు అదే చారిత్రాత్మక వేదికపై ఐమ్యాక్స్ స్క్రీన్ తో సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. ఆ ప్రాంతపు చారిత్రక ప్రాధాన్యతకు సరికొత్త సినిమాటిక్ టెక్నాల‌జీని జత చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో సినిమా ప్రేమికులకు ఒక అత్యుత్తమమైన, ప్రీమియం మూవీ వీక్షణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా `ఏఎంబీ క్లాసిక్ విక్టరీ` శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ అతి త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమాక్స్ స్క్రీన్ తో హాలీవుడ్ స్థాయిలో లార్జ్-ఫార్మాట్ సినిమాలను అసలైన క్వాలిటీతో చూడాలనుకునే ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది. క్రాస్ రోడ్స్ ఇక‌పై హైదరాబాద్‌లోనే అత్యంత ఆకర్షణీయమైన- ప్రధానమైన సినీ డెస్టినేషన్‌గా మారడానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని తెలుస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ముగ్గురు అగ్ర హీరోల భాగస్వామ్యంతో వస్తున్న ఈ థియేటర్.... ప్రేక్షకులకు కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌తో సరికొత్త అనుభూతిని అందించ‌నుంది.

Tags:    

Similar News