పూటకో మాట.. పొంతనలేని జవాబులు.. ఐబొమ్మ రవి తీరు

కోర్టు ఆదేశాలతో మూడు కేసులకు సంబంధించి ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులకు ఐబొమ్మ రవి తీరు చికాకు తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.;

Update: 2025-12-20 06:01 GMT

కోర్టు ఆదేశాలతో మూడు కేసులకు సంబంధించి ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులకు ఐబొమ్మ రవి తీరు చికాకు తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. పొంతనలేని మాటలు.. పూటకో సమాధానంతో అతి తెలివి ప్రదర్శిస్తున్న అతడి వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతడి తీరుకు ఉదాహరణగా ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. విదేశాల్లోని గేమింగ్ కంపెనీల నిర్వాహకులు.. వెబ్ పోర్టల్స్ నిర్వహిస్తున్న సిబ్బంది గురించి గుర్తు లేదని చెబుతున్న అతను.. ఐబొమ్మతో తనకు సంబంధమే లేదని వాదిస్తున్నాడు.

ఒకవేళ అతడి మాటలే నిజమని భావిస్తే.. ఐబొమ్మకు సంబంధించి క్లౌడ్ లో భద్రపరిచిన డేటాను తీసేయటం.. ఎలా చేశావు? ఐబొమ్మతో నీకు సంబంధం లేదంటే దాని పాస్ వర్డ్స్ నీకెలా తెలుసు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో జరిపిన విచారణలో తాను ఒక్కడినే పైరసీకి పాల్పడినట్లుగా ఐబొమ్మ రవి అంగీకరించగా.. తాజా విచారణలో మాత్రం అందుకు పొంతన లేని మాటల్ని చెబుతున్నట్లుగా సమాచారం.

అతడి డబుల్ టోన్ తీరును గుర్తించిన పోలీసులు.. గతంలో జరిపిన విచారణ సమయంలో చెప్పిన మాటలకు సంబంధించిన ఆధారాల్ని తాజా విచారణ వేళ చూపిస్తుంటే.. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా జరుపుతున్న విచారణలో ప్రహ్లాద్ అంటూ ఎవరూ లేరని.. అదంతా ఐబొమ్మరవి క్రియేషన్ గా పోలీసులు భావిస్తున్నారు. తన ఆనవాళ్లు ఎక్కడా లేకుండా ఉండేందుకు తన పేరుకు బదులుగా ప్రహ్లాద్ కుమార్ పేరుతో ఒకరిని క్రియేట్ చేసి.. అతడి పేరుతో పాన్ కార్డ్.. వెబ్ పోర్టల్స్ కొనుగోలు చేసినట్లుగా భావిస్తున్నారు. తన స్నేహితుడు ప్రసాద్ డిజిటల్ సంతకంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించినట్లుగా తెలుస్తోంది.

ఎప్పుడైనా పోలీసులకు చిక్కితే తన పాత్ర పరిమితమని.. తనకు ఐబొమ్మకు సంబంధం లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ముదర తెలివిని ప్రదర్శించేలా ప్లానింగ్ చేసినట్లుగా భావిస్తున్నారు. తాజా విచారణలో తాను అమాయకుడినని.. తాను డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో బిజినెస్ చేయాలని భావించానని.. పైరసీలో అయితే పోటీ లేదన్న ఉద్దేశంతో ఈ రంగాన్ని తాను ఎంపిక చేసుకున్నట్లుగా పొంతన లేని మాటలు చెబుతున్నట్లుగా సమాచారం. మొత్తానికి పోలీసుల సహనానికి పరీక్ష పెట్టేలా ఐబొమ్మ రవి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవిని తమకు అవసరమైన సమాచారాన్ని ఎలా బయటకు తీస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News