ఐబొమ్మ రవి కస్టడీ క్లైమాక్స్.. ఏం చెబుతున్నాడంటే..
ఒక హైటెక్ దొంగను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. అతడి నుంచి నిజాలు రాబట్టడం మరొక ఎత్తు.;
ఒక హైటెక్ దొంగను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. అతడి నుంచి నిజాలు రాబట్టడం మరొక ఎత్తు. గత నాలుగు రోజులుగా ఐబొమ్మ విచారణ జరుగుతున్నా, అధికారులకు మాత్రం ఆశించిన సమాధానాలు దొరకడం లేదు. సైబర్ క్రైమ్ పోలీసులకే చెమటలు పట్టిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గడువు ముగుస్తున్న వేళ, అసలు లోపల ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా దొంగలు దొరికితే భయపడతారు, లేదా నిజం ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అడిగిన ప్రతి ప్రశ్నకూ రవి నుంచి సంబంధం లేని సమాధానాలు వస్తున్నాయని తెలుస్తోంది. సాక్ష్యాలు కళ్ల ముందు పెట్టినా, అబ్బే నాకేం తెలియదు అన్నట్లుగా వ్యవహరించడం చూస్తుంటే.. ఇదంతా ఒక పక్కా ప్రీ ప్లాన్డ్ స్కెచ్‌లా అనిపిస్తోంది. అధికారులు ఎంత ప్రయత్నించినా ఆ కీలకమైన 'లాజిక్' మాత్రం దొరకడం లేదు.
ఐబొమ్మ రవి కస్టడీ విచారణ నేటితో ఐదో రోజుకు చేరుకుంది. యూకే, కరేబియన్ దీవుల్లోని సర్వర్లు, అక్కడి సిబ్బంది గురించి పోలీసులు గట్టిగానే నిలదీశారు. కానీ రవి మాత్రం డేటా అంతా విదేశాల్లో ఉందని, తనకు ఎవరూ సహాయం చేయలేదని బుకాయిస్తున్నాడు. విచారణలో అధికారులను తప్పుదారి పట్టించేందుకే రవి ఇలా చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. అరెస్ట్‌కు ముందే రవి చాలా జాగ్రత్తపడ్డాడు. హార్డ్ డిస్కుల్లోని సినిమా ఫైళ్లు తప్ప, కీలకమైన డేటా మొత్తాన్ని ముందే డిలీట్ చేసినట్లు విచారణలో తేలింది. నేను ఒక్కడినే చేశా.. పైరసీ సినిమాలు చూడటం అలవాటై ఇలా మారాను అని చెబుతున్నా, పోలీసులు మాత్రం దీన్ని నమ్మడం లేదు. ఎందుకంటే వెనుక ఉన్న నెట్‌వర్క్ అంత చిన్నది కాదు.
అయితే రవి ఎంత తెలివైనవాడైనా, పోలీసులు అంతకంటే తెలివిగా వ్యవహరించారు. సుమారు మూడు నెలల పాటు అతడి కదలికలపై నిఘా ఉంచి, చివరకు ఈ మెయిల్ లింక్‌ల ద్వారానే అసలు ట్రాక్ ను పట్టుకున్నారు. 'ఈ ఆర్ ఇన్ఫోటెక్' పేరుతో ఉన్న డొమైన్లు, బ్యాంక్ లావాదేవీల చిట్టాను బయటకు తీస్తున్నారు. దీనికోసం ఇప్పటికే బ్యాంకులకు లేఖలు కూడా వెళ్లాయి.
ప్రస్తుతం రవి చెప్తున్న సమాధానాల్లో పొంతన లేకపోవడంతో, పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. డిలీట్ అయిన డేటాను రికవరీ చేయడం, విదేశీ లింకులు బయటకు తీయడం ఇప్పుడు పోలీసుల ముందున్న పెద్ద సవాల్. చూడాలి మరి, ఈ సైబర్ క్రైమ్ ఎపిసోడ్ లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.