ఐబొమ్మ కేసు: 50లక్షల మంది డేటా చోరీ.. ఉదాసీనతే కారణమా?
వ్యక్తుల ఆధార్, పాన్ కార్డ్ డేటాతో పాటు ఏవైనా పిన్ లు పాస్ వర్డ్ వివరాలను కనుగొనేందుకు, ప్రజల్ని చాలా తెలివిగా బురిడీ కొట్టించే కేటుగాళ్లకు కొదవేమీ లేదు.;
ఇటీవలి కాలంలో సైబర్ మోసాలకు అడ్డూ ఆపూ లేదు. వ్యక్తుల ఆధార్, పాన్ కార్డ్ డేటాతో పాటు ఏవైనా పిన్ లు పాస్ వర్డ్ వివరాలను కనుగొనేందుకు, ప్రజల్ని చాలా తెలివిగా బురిడీ కొట్టించే కేటుగాళ్లకు కొదవేమీ లేదు. దేశం నిండా క్రైమ్ పుష్కలంగా ఉంది. ఇటీవల ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు రవి కేసు పెద్ద మేల్కొలుపు. అతడు పైరసీ సినిమాలతో నాశనం చేసిన దానికి మించి, 50 లక్షల మంది డేటాను చోరీ చేసినందున సృష్టించబోయే విలయం చాలా పెద్దది అని పోలీసులు, సినీ ప్రముఖులు కూడా విశ్లేషిస్తున్నారు.
ఐబొమ్మ రవిని, పైరసీని ప్రజలు ఎంకరేజ్ చేయడానికి కారణం సినిమా టికెట్ ధరలు పెరడగడమేనట! అంటూ అగ్ర నిర్మాత డి సురేష్ బాబు ఆవేదనను కనబరిచినా, ఆయన దానిని తప్పు పట్టలేదు.. రవి ఏకంగా ప్రజల డేటాను కొట్టేసాడు.. ఇది మంచిదేనా? దీంతో ఎవరికీ అభ్యంతరాలేవీ లేవా? అంటూ సైడ్ పాయింట్ ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ హైలైట్ చేసారు.
ఇదిలా ఉంటే, అసలు 50లక్షల మంది డేటాను అతడు ఎలా దొంగిలించాడు? అంటే?.. ఇక్కడ కూడా ప్రజల ఉదారతనే అతడు ఎన్ క్యాష్ చేసుకున్నాడు. ఐబొమ్మ సైట్ కి వెళ్లగానే, అందులో రిజిస్టర్ అవ్వడానకి టెర్మ్స్ అండ్ కండీషన్స్ బటన్ క్లిక్ చేయగానే `ఐ అగ్రీ` అంటూ మనకు మనమే మొత్తం డేటాను అవతలి వ్యక్తికి చేరవేసేందుకు అంగీకరిస్తున్నాం. అలా మొత్తం యాభై లక్షల మంది నుంచి అతడు డేటాను కొట్టేసాడని పోలీసులు చెబుతున్నారు. నిజానికి ఇది కేవలం ఐబొమ్మ యాప్ లో మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే ప్రతి యాప్ ఇదే బాపతు. వ్యక్తిగత డేటాను ఉపయోగించుకునేందుకు ఈ యాప్ లు మన నుంచి అనుమతి కోరడం, దానికి అందరూ ఓకే కొట్టేయడం ఆ సమయంలో దానివల్ల ఎదురయ్యే ప్రమాదాలను తెలుసుకోలేకపోవడం ఒక నిరంతర క్రతువుగా మారింది. ఆ పాపం చేసింది ఐబొమ్మ రవి కాదు నేనే! అని అంగీకరించాల్సిన దుస్థితి ప్రతి ఐబొమ్మ మెంబర్ కి దాపురించింది.
ప్రజల ఉదారత, ఉదాసీనత, మంచితనం, అనాలోచిత వ్యక్తిత్వం ఇలా ఎన్ని కోణాల్లో చూసినా ఈ మొత్తం తప్పిదాలకు మన డేటాను ఎదుటివారికి ఆయాచితంగా ఇచ్చేయడమే కారణమని గ్రహించాలి. ఎవరి డేటాను వారు సురక్షితంగా ఉంచుకునేందుకు ఎలాంటి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని గ్రహించాలి. ఇటీవలి కాలంలో జనం గుంపుగా ఉన్న చోటికి పది మంది యువతీ యువకులు బ్యాంకుల ట్యాగులు మెడలో వేసుకుని వచ్చి మీ ఫోన్ నంబర్, ఆధార్, పాన్ కార్డ్ డేటా ఇస్తారా? అంటూ యథేచ్ఛగా అడుగుతున్నారు. ఆ వ్యక్తుల జాబ్ ఐడి కార్డ్ కూడా చూడకుండా వ్యక్తిగత డేటాను సమర్పించుకునే వాళ్లే ఎక్కువమంది. ఇలాంటి సందర్భాలలో తార్కికంగా ఆలోచించలేరా? ప్రతి రోజూ ఈ కేటుగాళ్లు మన డేటాను తీసుకుని దేశ విదేశాల్లోని ప్రమాదకర క్రిమినల్స్ కి అమ్మేస్తున్నారనే నిజం మనం ఎప్పటికీ తెలుసుకోలేమా?