ఐబొమ్మ రవి.. రిస్కులో స్నేహితులు
ఐబొమ్మ రవి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. ఇన్నాళ్లు కేవలం పైరసీ, వెబ్ సైట్ నిర్వహణ అనుకుంటే.. ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్టు ఆర్థిక వ్యవహారాల గుట్టు రట్టవుతోంది.;
ఐబొమ్మ రవి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. ఇన్నాళ్లు కేవలం పైరసీ, వెబ్ సైట్ నిర్వహణ అనుకుంటే.. ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్టు ఆర్థిక వ్యవహారాల గుట్టు రట్టవుతోంది. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ద్వారా రవి సంపాదించిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయి? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? అనే ప్రశ్నలకు ఇప్పుడు షాకింగ్ ఆన్సర్స్ దొరుకుతున్నాయి.
గత ఐదు రోజులుగా రవిని పోలీసులు కస్టడీలో ఉంచుకుని గుట్టును లాగుతున్నారు. పైకి అమాయకంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం పెద్ద క్రైమ్ నెట్‌వర్క్ నడిపాడని అర్థమవుతోంది. విచారణలో రవి నోరు విప్పకపోయినా, టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రం అసలు కథను చెబుతోంది. రవి తన సోలో పర్ఫార్మెన్స్ తో పాటు, తన దగ్గరి మిత్రులను కూడా ఈ క్రైమ్ లో భాగం చేశాడని తెలుస్తోంది.
రవి తన పైరసీ సామ్రాజ్యం ద్వారా సంపాదించిన అక్రమ డబ్బును తన స్నేహితుల ఖాతాల్లోకి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బుతో విదేశీ టూర్లు ఎంజాయ్ చేయడమే కాకుండా, ఆంధ్రా, తెలంగాణలో భారీగా ఆస్తులు, స్థలాలు కొనుగోలు చేసినట్లు రవి స్వయంగా అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు రవి ఫ్రెండ్స్ లిస్ట్ ను పోలీసులు ప్రిపేర్ చేస్తున్నారు.
ఇక అరెస్ట్ టైంలో రవి ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. పోలీసులు ఇంటికి రాగానే డోర్ తీయకుండా కాసేపు కాలయాపన చేసి, ఈలోపు తన ల్యాప్‌టాప్‌లోని కీలక డేటాను డిలీట్ చేసి బాత్రూంలో దాచేశాడట. ఇప్పుడు సర్వర్ వివరాలు అడిగితే "మర్చిపోయాను" అంటూ సినిమా డైలాగులు చెబుతున్నాడు. అయితే ఐటీ ఎక్స్ పర్ట్స్ ఆ డిలీట్ అయిన డేటాను వెలికితీసే పనిలో ఉన్నారు.
విదేశీ బ్యాంకు ఖాతాల్లో కూడా భారీగా డిపాజిట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో రవి వ్యక్తిగత విషయాలు చెబుతున్నాడు తప్ప, ఆపరేషన్స్ గురించి మాత్రం నోరు మెదపడం లేదు. నేటితో కస్టడీ ముగియనుండటంతో అధికారులు అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో రవి స్నేహితుల వివరాలు సేకరించి, ఆస్తుల జాతరపై కూపీ లాగుతున్నారు.
రవి చేసిన పనికి ఇప్పుడు అతని స్నేహితులు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని రవి సన్నిహితులపై పోలీసులు నిఘా పెట్టారు. అక్రమ సంపాదనను ఎవరెవరికి పంపించాడు, ఎక్కడెక్కడ దాచాడు అనే ఫైనాన్షియల్ ట్రైల్ దొరికితే.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐబొమ్మ కథ ఇప్పట్లో అయిపోయేలా లేదు.