IBOMMA: క్రైమ్ థ్రిల్లర్ కు సరిపోయే కంటెంట్.. ఐబొమ్మ రవిపై సినిమా తీస్తారా?

'ఐబొమ్మ' రవి అరెస్ట్.. ఈ పేరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి, ఓటీటీలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఒకే ఒక్కడు చివరికి పోలీసులకు దొరికాడు.;

Update: 2025-11-18 10:18 GMT

'ఐబొమ్మ' రవి అరెస్ట్.. ఈ పేరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి, ఓటీటీలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఒకే ఒక్కడు చివరికి పోలీసులకు దొరికాడు. అయితే, ఈ అరెస్ట్ వెనుక ఉన్న డ్రామా, ట్విస్టులు, సైబర్ నేరాల చిట్టా చూస్తుంటే, ఇది ఏ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ర్కిప్ట్‌కూ తీసిపోదనిపిస్తోంది. వందల కోట్ల సంపాదన, టెక్నాలజీతో మాయ, చివరికి ఊహించని దారిలో అరెస్ట్.. ఇవన్నీ చూసి, ఈ కథను ఎవరు ముందు సినిమాగా ప్రకటిస్తారా అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

IBOMMA RAVI

ఒక సినిమాకు కావాల్సిన ఫస్ట్ ఎలిమెంట్.. ఒక బలమైన 'విలన్' లేదా 'యాంటీ హీరో'. రవి పాత్రకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రాజమౌళి సైతం ప్రెస్ మీట్లో ఇది సినిమా తరహాలో ఉందని ఎలివేషన్ ఇచ్చారు. దమ్ముంటే పోలీసులు పట్టుకోవాలని అప్పట్లో రవి ఛాలెంజ్ విసరడం.. ఆ తరువాత అంతే చాలెంజ్ తో పోలీసులు కూడా హీరోల తరహాలో పట్టుకోవడం మరో హైలెట్.

పోలీసుల లెక్క ప్రకారమే ఇతను "మాస్టర్ మైండ్". బీఎస్సీ కంప్యూటర్స్ చదివినా, టెక్నాలజీలో మాత్రం దిట్ట. ఓటీటీల డీఆర్‌ఎమ్ టెక్నాలజీని హ్యాక్ చేయడం, 'మూవీరూల్జ్' నుంచి కంటెంట్ తీసుకుని హెచ్‌డీగా మార్చడం, ఏకంగా 65 మిర్రర్ సైట్లను రన్ చేస్తూ పోలీసులకే సవాల్ విసిరాడు.

ఈ కథలో డ్రామా చిన్నదేం కాదు. పోలీసులు చెప్పినట్లే, రవి దాదాపు 20 కోట్లు సంపాదించాడు. ఈ డబ్బుతో 2022లోనే 80 లక్షలు పెట్టి కరేబియన్ పౌరసత్వం కొన్నాడు. అక్కడే విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అంతేకాదు, నాని 'హిట్ 3' సినిమాను థియేటర్ రిలీజ్‌కు 18 గంటల ముందే ఒరిజినల్ క్వాలిటీతో లీక్ చేసి, ప్రొడక్షన్ హౌస్‌లనే షేక్ చేశాడు. ఇది సినిమాకు కావాల్సిన పర్ఫెక్ట్ 'కాన్‌ఫ్లిక్ట్ పాయింట్'.

ఇంత తెలివైనోడు, ఫ్రాన్స్, కరేబియన్ దీవుల్లో తిరుగుతున్నవాడు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఎలా దొరికాడు? ఇక్కడే అసలుసిసలైన 'సినిమాటిక్ ట్విస్ట్' ఉంది. పోలీసుల వెర్షన్ ప్రకారం, పక్కా టెక్నికల్ ఆధారాలతో, నెలల తరబడి ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నామన్నారు. కానీ, బయట వినిపిస్తున్న మరో కథ ప్రకారం, రవిని పట్టుకుంది పోలీసులు కాదు, అతని భార్యేనట.

విడాకుల గొడవల కారణంగా భార్యే అతన్ని ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రప్పించి, పోలీసులకు సమాచారం ఇచ్చిందని బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు రవి తండ్రి మాటలు కూడా బలం చేకూరుస్తున్నాయి. తన కొడుకుతో 15 ఏళ్లుగా మాటల్లేవని, కోడలు ఫోన్ చేసి గొడవల గురించి చెప్పినా తను జోక్యం చేసుకోలేదని, వాడు చేసింది "పనికిమాలిన పని" అని తండ్రే అనడం ఈ కథలో ఎమోషనల్ డ్రామాను పీక్స్‌కు తీసుకెళ్తుంది.

ఒక జీనియస్, టెక్నాలజీని తప్పుగా వాడటం, ఇండస్ట్రీని వణికించడం, పోలీసులకు సవాల్ విసరడం, చివరికి ఒక ఫ్యామిలీ డ్రామాతో దొరికిపోవడం.. ఒక క్రైమ్ స్టోరీకి ఇంతకంటే ఏం కావాలి? అందుకే నెటిజన్లు "ఆర్జీవీ బిజీగా ఉన్నాడు, లేకపోతే ఈపాటికి టైటిల్ అనౌన్స్ చేసేవాడు" అని కామెంట్ చేస్తున్నారు. నిజంగానే, ఈ స్టోరీ లైన్ రామ్ గోపాల్ వర్మ స్టైల్‌కు కరెక్ట్‌గా సూట్ అవుతుంది.

కారణాలు ఏవైతేనేం, ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. పోలీసులు ఇప్పుడు ఈడీ, సీబీఐకి కూడా లేఖలు రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎన్నో అంతర్జాతీయ లింకులు బయటపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా, 'ఐబొమ్మ' కథ మాత్రం భవిష్యత్తులో ఒక సినిమాగా వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతకుమించిన ట్విస్టులు ఈ రియల్ లైఫ్ స్టోరీలో ఉన్నాయి.

Tags:    

Similar News