ఛ‌లో హాలీవుడ్: హృతిక్ రోష‌న్ బాట‌లో మ‌హేష్‌- అల్లు అర్జున్ - ప్ర‌భాస్?

బాలీవుడ్ స్టార్లు అంతర్జాతీయ సినీయవనికపై తమదైన‌ ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-06-11 18:39 GMT

బాలీవుడ్ స్టార్లు అంతర్జాతీయ సినీయవనికపై తమదైన‌ ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్కార్ విన్నింగ్ చిత్రాలైన ది రెవెనెంట్, స్పాట్‌లైట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించిన హాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ `అనోనిమస్ కంటెంట్` తో హృతిక్ అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయి గుర్తింపు, సరైన హాలీవుడ్ ప్రాజెక్ట్‌లను ఎంచుకునేందుకు వీలుగా ఈ ప్రఖ్యాత సంస్థ ద్వారానే అత‌డు గ్లోబల్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ స్ట్రాటజీ హృతిక్‌కు వెస్ట్రన్ మార్కెట్‌లో ఒక బలమైన పునాదిని -అత్యుత్తమ అవకాశాలను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

హాలీవుడ్‌లో హృతిక్ రోషన్ కనుక తన గ్రీక్ గాడ్ ఇమేజ్‌తో అడుగుపెట్టి తనేంటో నిరూపించుకుంటే భవిష్యత్తులో మన టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఇదే బాటను అనుసరించే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను ఏలుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేష్ బాబు హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనుకుంటే హృతిక్ తరహా స్ట్రాటజీని అనుసరించడానికి ఆస్కారం లేక‌పోలేద‌ని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్ స్టార్లు పాన్ వ‌ర‌ల్డ్ లో రాణించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న నేప‌థ్యంలో అంతర్జాతీయ టాలెంట్ ఏజెన్సీలతో టై-అప్ అవ్వడం ద్వారా గ్లోబల్ లెవెల్‌లో సరైన కథనాలను ఎంచుకునే వీలుంటుంది కాబట్టి మన తెలుగు స్టార్లకు కూడా ఈ వ్యూహం చాలా ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

ప్రస్తుతం తెలుగు సినిమా కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్‌లో జెండా పాతేస్తోంది. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి భారీ అడ్వెంచర్ చిత్రం `వార‌ణాసి`తో సూపర్ స్టార్ మహేష్ బాబును హాలీవుడ్ రేంజ్‌లోనే విదేశీ మార్కెట్లకు పరిచయం చేయబోతున్నారు. అంతర్జాతీయంగా మహేష్ బాబుకు ఈ చిత్రం ద్వారా లభించే ఫేమ్ అంతా ఇంతా కాదు. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక హాలీవుడ్ నుండి మహేష్ బాబుకు పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తే క‌చ్చితంగా గ్లోబల్ స్క్రీన్‌పై మెరవడానికి ఆసక్తి చూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి ఇప్పటికే ఒక ప్రముఖ అంతర్జాతీయ టాలెంట్ ఏజెన్సీతో సైన్ చేయడం కూడా ఈ గ్లోబల్ కనెక్ట్‌కు మరింత బలాన్ని ఇస్తోంది.

నిజానికి భారతీయ నటీనటులు హాలీవుడ్‌లో సక్సెస్ సాధించడానికి ప్రియాంకా చోప్రా ఒక పెద్ద రోల్ మోడల్‌గా నిలిచారు. `క్వాంటికో` సిరీస్‌తో అమెరికన్ టెలివిజన్‌ను ఏలిన ప్రియాంక‌.. బేవాచ్, ది బ్లఫ్, హెడ్స్ ఆఫ్ స్టేట్ వంటి హాలీవుడ్ చిత్రాలతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. విశేషం ఏంటంటే.. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రియాంకా చోప్రా మళ్లీ భారతీయ వెండితెరపైకి రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ చిత్రంతోనే రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రియాంకతో పాటు ఆలియా భట్ `హార్ట్ ఆఫ్ స్టోన్` ద్వారా హాలీవుడ్ డెబ్యూ ఇవ్వగా, రణవీర్ సింగ్, సోనమ్ కపూర్, విద్యుత్ జామ్వాల్ వంటి స్టార్లు కూడా పెద్ద హాలీవుడ్ ఏజెన్సీల ప్రాతినిధ్యం వహిస్తూ తమ మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం హృతిక్ రోషన్ తన కెరీర్‌లో ఒకవైపు `క్రిష్ 4` తో బిజీగా ఉంటూనే... మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం `స్టార్మ్` అనే హై-స్టేక్స్ థ్రిల్లర్ ద్వారా నిర్మాతగా కూడా మారుతున్నారు. ఇంతటి పకడ్బందీ కెరీర్ ప్లానింగ్‌తో పాటు హాలీవుడ్ ఏజెన్సీ `అనోనిమస్ కంటెంట్`తో ఆయన చేతులు కలపడం భారతీయ స్టార్లకు ఒక కొత్త రూట్ మ్యాప్‌ను చూపిస్తోంది. టాలీవుడ్ స్టార్లు ఇప్పటికే తమ కంటెంట్‌తో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో హృతిక్ అనుసరిస్తున్న ఈ అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీని మన హీరోలు కూడా అందిపుచ్చుకుంటే.. మునుముందు రోజుల్లో తెలుగు స్టార్లు హాలీవుడ్ వెండితెరపై సైతం రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News