బిగ్ ప్లాన్ తో హోంబలే.. ఇకపై ఓవర్సీస్ లో కూడా..
భారీ చిత్రాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది.;
భారీ చిత్రాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రొడక్షన్, నేషనల్ వైడ్ గా డిస్ట్రిబ్యూషన్ కు మాత్రమే పరిమితమైన ఆ సంస్థ, ఇకపై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇండియన్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనుంది!
అయితే 2012లో నిర్మాతలు విజయ్ కిరగందూర్, చలువ గౌడ హోంబలే ఫిల్మ్స్ ను స్టార్ట్ చేశారు. మొదట్లో కన్నడ సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆ సంస్థ.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించింది. ముఖ్యంగా కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు అందుకోవడంతో హోంబలే రేంజ్ మారిపోయింది.
అదే సమయంలో కంటెంట్ బేస్డ్ మూవీ కాంతార, భారీ యాక్షన్ ఫిల్మ్ సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ఆ విజయాలతో హోంబలే ఫిల్మ్స్ దక్షిణాది చిత్రాలను పాన్ ఇండియా రేంజ్ లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా నిలబెట్టింది. అయితే ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది.
నిజానికి ఓవర్సీస్ లో భారతీయ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, సరైన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల చాలాసార్లు పూర్తి స్థాయి వసూళ్లు రాకపోతున్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ స్వయంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, పశ్చిమాసియా దేశాల్లో సినిమాలను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే "సినిమా సరిహద్దులు లేని మాధ్యమం. భారత్ నుంచి ప్రపంచానికి మన కథలను చేరవేయాలన్నదే మా లక్ష్యం" అని సంస్థ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది హోంబలే ఫిల్మ్స్. ఆ అనౌన్స్మెంట్ అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లో ఆసక్తి పెంచింది. ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ దేశంలో పలు చిత్రాలను పంపిణీ చేసి విజయాలు సాధించింది. ఇదే అనుభవంతో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం హోంబలే సంస్థ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సలార్ : పార్ట్ 2 (శౌర్యాంగ్ పర్వం), NTR 31 వంటి భారీ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ సినిమాల ఓవర్సీస్ విడుదల బాధ్యతలను కూడా హోంబలే ఫిల్మ్స్ చేపట్టనుంది. ఏదేమైనా నిర్మాణ సంస్థగా ప్రారంభమైన హోంబలే ఫిల్మ్స్.. ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా అడుగుపెట్టడంతో గ్లోబల్ స్థాయిలో తన రేంజ్ ను పెంచుకుంటుందనే చెప్పాలి.