మోస్ట్ అవైటెడ్ 'హిరణ్యకశ్యప'.. గుణశేఖర్ మొత్తానికి వదిలేశారా?
టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హిరణ్యకశ్యప మూవీ ఇక వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హిరణ్యకశ్యప మూవీ ఇక వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా ఆ ప్రాజెక్టుపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, దర్శకుడు గుణశేఖర్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ తో ఫుల్ క్లారిటీ వచ్చింది. భారీ బడ్జెట్, కరోనా ఎఫెక్ట్, నిర్మాణ సంస్థల పరిస్థితుల కారణంగా ఆ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆయన వెల్లడించారు.
టాలీవుడ్ లో విజువల్ గ్రాండియర్ చిత్రాలకు పేరుగాంచిన గుణశేఖర్, రానా దగ్గుబాటి లీడ్ రోల్ లో హిరణ్యకశ్యపను తెరకెక్కించాలని చాలా కాలం క్రితమే నిర్ణయించారు. పురాణాల్లో అత్యంత పవర్ ఫుల్ రోల్స్ లో ఒకటైన హిరణ్యకశ్యపుడి స్టోరీ మోడ్రన్ టెక్నాలజీతో ఇంటర్నేషనల్ లెవెల్ లో రూపొందించాలని ప్లాన్ రెడీ చేశారు. ఆ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఏడు సంవత్సరాల టైమ్ స్పెండ్ చేసినట్లు గుణశేఖర్ తెలిపారు.
రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఆ సినిమా కోసం మూడు నుంచి నాలుగేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు చేసినట్లు చెప్పారు. పాత్రల డిజైన్లు, వరల్డ్ ప్లాన్, విజువల్ కాన్సెప్ట్స్ వంటి అంశాలపై ప్రత్యేకంగా పని చేశామని వెల్లడించారు. అయితే సినిమాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించాలంటే సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వచ్చిందన్నారు.
మొదట ఆ ప్రాజెక్టుకు ఫాక్స్ స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపాయని గుణశేఖర్ తెలిపారు. కానీ కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఆ తర్వాత ఫాక్స్ స్టార్ ను డిస్నీ కొనుగోలు చేయడంతో కొత్త యాజమాన్యం ఆ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపలేదన్నారు. అంత భారీ పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదని వారు భావించారని వివరించారు.
ఇటీవల హిరణ్యకశ్యప సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరగ్గా.. దానిపై కూడా గుణశేఖర్ స్పందించారు. ఈ విషయంపై తానే స్వయంగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు చెప్పారు. అప్పుడు త్రివిక్రమ్.. తాను ఆ ప్రాజెక్ట్ లో రచన పరంగా మాత్రమే భాగమయ్యానని, దర్శకత్వం వహించే ఆలోచన లేదని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టారు.
హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ఆగిపోవడంపై గుణశేఖర్ కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని, ఆ సమయంలో తాను ఆలోచించిన కొన్ని కాన్సెప్టులు ఇతర సినిమాల్లో కనిపించాయని అన్నారు. పురాణ కథలకు స్పెషల్ రైట్స్ ఉండవని, అందువల్ల ఎవరైనా ఆ కథలను తమదైన శైలిలో తెరకెక్కించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తాను గతంలో ఊహించినట్లుగానే నరసింహ స్వామి స్టోరీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందని ఆ సినిమా విజయంతో మరోసారి ప్రూవ్ అయిందన్నారు. అయితే హిరణ్యకశ్యప వదిలేసినప్పటికీ, ఆ ఆలోచనల ఆధారంగా కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లు గుణశేఖర్ తెలిపారు. ప్రస్తుతం వర్క్ జరుగుతోందని చెప్పారు. దీంతో హిరణ్యకశ్యప కాకపోయినా, గుణశేఖర్ నుంచి మరో భారీ కాన్సెప్ట్ మూవీ వచ్చే అవకాశం కచ్చితంగా ఉందన్నమాట.