మార్పు మొదలు... నిర్మాతలకు పెద్ద ఊరట

సినిమా ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన వారు నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాత అనేవాడు లేకుంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ అనేదే ఉండదు.;

Update: 2025-09-17 12:30 GMT

సినిమా ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన వారు నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాత అనేవాడు లేకుంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ అనేదే ఉండదు. హీరోలు ఒకరు కాకుంటే మరొకరు ఉంటారు. కానీ నిర్మాత మాత్రం కచ్చితంగా ఉండాలి. దర్శకుల కంటే ముఖ్యంగా నిర్మాతలకు ప్రధాన స్థానం ఇండస్ట్రీలో ఇవ్వాలి. కానీ ఇండస్ట్రీలో నిర్మాతకు సముచిత న్యాయం, గౌరవం దక్కడం లేదు. నిర్మాతలు కేవలం డబ్బు ఇచ్చే మిషన్‌ మాదిరిగా మారి పోయాడు. పైగా ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవడం మామూలు అయింది. ముఖ్యంగా హీరోలు, దర్శకులు తమ పారితోషికం కాకుండా తమ పరివారం అంటే డ్రైవర్‌, వంట వాడు, మేకప్ ఆర్టిస్ట్‌, మేనేజర్‌, హెల్పర్స్‌, బాడీ గార్డ్స్ ఇలా ఎంతో మందికి నిర్మాత చేత డబ్బులు ఇప్పిస్తున్నారు. హీరోలు తమ వ్యక్తిగత సిబ్బందికి నిర్మాతతో జీతం ఇప్పించడంపై ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌..

ఇటీవల బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... స్టార్‌ హీరోలకు నిర్మాతలు పారితోషికం ఇవ్వడం సరే కానీ, వారి స్టాఫ్‌ కి కూడా జీతం ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. హీరోలు వారి స్టార్‌డం అనుసారంగా పారితోషికం అందుకోవచ్చు. కానీ వారి స్టాఫ్ కి ఎందుకు జీతాలు నిర్మాత ఇవ్వాలంటూ ప్రశ్నించడంతో ఇండస్ట్రీ మొత్తం చర్చనీయాంశం అయింది. స్టార్ల ఆధిపత్యం కొనసాగడం మంచిదే, వారి వల్లే సినిమాలకు ప్రేక్షకులు వస్తున్నారు. అంత మాత్రాన వారు ఏం చెబితే అదే అన్నట్లుగా సాగాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అమీర్‌ ఖాన్‌ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది. కనుక మార్పు అంతటా రావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

హర్ష వర్ధన్ రాణే సోషల్‌ మీడియాలో..

అమీర్ ఖాన్‌ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకుని, ఇండస్ట్రీలో మార్పు అవసరం అని భావించి నటుడు హర్షవర్ధన్ రాణే స్పందించాడు. తన స్టాఫ్ ఖర్చులను తానే భరిస్తాను అంటూ ముందుకు వచ్చి మరీ ప్రకటించాడు. హీరోల, హీరోయిన్స్‌ స్టాఫ్‌ ఖర్చులను తగ్గించడం కాకుండా మొత్తం లేకుండా చూడటం వల్ల నిర్మాత ఖచ్చితంగా పెద్ద రిలాక్స్ ఫీల్‌ అవుతాడు అని ఆయన కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియా ద్వారా హర్ష వర్ధన్ రాణే ఈ విషయాన్ని గురించి ప్రకటించాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయమై లోతుగా చర్చ జరుగుతున్న సమయంలో ఈయన నుంచి వచ్చిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హర్ష వర్ధన్ రాణే నిర్ణయాన్ని చాలా మంది సమర్ధిస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్స్ అంతా కూడా ముందు ముందు ఇదే నిర్ణయాన్ని తీసుకోవాలని సగటు సినీ ప్రేమికుడు కోరుకుంటున్నాడు.

సినిమా నిర్మాతలకు పెద్ద ఊరట

సినిమాకు ఏది అవసరం అవుతుందో అది మాత్రమే నిర్మాత ఖర్చు చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే సినిమా బతుకుతుంది, నిర్మాత బతుకుతాడు. అనవసర ఖర్చులను నిర్మాత భరించడం ద్వారా బడ్జెట్‌ దాదాపుగా 25 శాతం ఎక్కువ అవుతుంది. తద్వారా సినిమా విఫలం అయితే నిర్మాత చాలా పెద్ద నష్టం చవిచూడాల్సి వస్తుంది. అందుకే స్టార్స్ డ్రైవర్స్‌, పర్సనల్‌ అసిస్టెంట్స్ జీతాలను నిర్మాతలు భరించకూడదు అంటూ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. ఇప్పుడు అమీర్‌ ఖాన్‌ ఈ పాయింట్‌ లేవనెత్తడంతో చర్చనీయాంశం అవుతుంది. దేశం మొత్తం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక నిర్మాతలు అన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది కొత్త నిర్మాతలు వస్తుంటే, పాత నిర్మాతలు కనుమరుగు అవుతున్నారు. వారు ఆర్థికంగా చితికి పోవడం వల్లే కనుమరుగు అవుతున్నారు. ఇలాంటి చిన్న నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నిర్మాతలకు పెద్ద ఊరట లభిస్తుంది అనేది విశ్లేషకుల మాట.

Tags:    

Similar News