TSలో వీర‌మ‌ల్లు టికెట్ పెంపు వెన‌క శ‌క్తి?

ఆ ఘ‌ట‌న తెలంగాణ‌లో పూన‌కాలు పుట్టించింది. ఘ‌ట‌న అనంత‌రం తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆవేశపూరిత ప్రసంగం సినీప‌రిశ్ర‌మ‌ను భ‌య‌పెట్టింది.;

Update: 2025-07-23 03:42 GMT

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పెద్ద హీరో సినిమా విడుద‌ల‌వుతోంది అంటే, అభిమానుల్లో హంగామా ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం. థియేట‌ర్ల వ‌ద్ద తొక్కిస‌లాట‌లు కూడా గ‌తంలో చూసాం. అయితే ఫ్యాన్స్ రెచ్చిపోతే ఎలా ఉంటుందో పుష్ప 2- సంధ్య‌ థియేట‌ర్ ట్రాజెడీ వెల్ల‌డించింది.

2024 డిసెంబర్‌లో సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్ తొక్కిసలాటగా మార‌డంతో ఒక మహిళ మృతి చెందడ‌మే గాక‌, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. ఆ ఘ‌ట‌న తెలంగాణ‌లో పూన‌కాలు పుట్టించింది. ఘ‌ట‌న అనంత‌రం తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆవేశపూరిత ప్రసంగం సినీప‌రిశ్ర‌మ‌ను భ‌య‌పెట్టింది.

అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు విష‌యంలో రేవంత్ స‌హ‌కారం అందించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. సినీప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న నేనున్నాను! అంటూ టికెట్ పెంపునకు కూడా ఆమోదం తెల‌ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సినిమాల ప్రివ్యూల పేరుతో దోపిడీకి, జ‌నాల‌కు ఇబ్బందులు తెచ్చే ప‌నుల‌కు తాను స‌హ‌క‌రించ‌న‌ని నాడు రేవంత్ అన్నారు. ప్రజా భద్రతను కాపాడటానికి బెనిఫిట్ , ప్రీమియర్ షోలు లేకుండా చేస్తానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు. అయితే వీర‌మ‌ల్లు విష‌యంలో ఈ రూల్ బ్రేక్ అయింది. ప్రస్తుత అనుమతుల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఖరిని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. వీర‌మ‌ల్లు టికెట్ పెంపున‌కు రేవంత్ అనుమ‌తులు ఇవ్వ‌గానే ఒక వ‌ర్గం వివాదాగ్నిని రాజేసింది కూడా.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఆదేశం ప్రకారం.. వీర‌మ‌ల్లు సినిమా ప్రీమియర్ షోల‌కు టిక్కెట్ల ధర రూ. 600. జూలై 24 నుండి 27 వరకు మల్టీప్లెక్స్ టిక్కెట్లను అదనంగా రూ. 200 వ‌ర‌కూ పెంచుకునే వీలు క‌ల్పించారు. సింగిల్ స్క్రీన్ టిక్కెట్లను అదనంగా రూ. 150కి విక్రయించవచ్చనేది వెసులుబాటు. జూలై 28 - ఆగస్టు 2 మధ్య అనుమతించబడిన పెంపు మల్టీప్లెక్స్‌లలో రూ. 150 - సింగిల్ స్క్రీన్‌లలో రూ. 106 వరకు ఉంటుంది.

అయితే తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు నిర్మాత ఏఎం రత్నం అనుమతి పొందడంలో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డికి ఘనత ఇచ్చారు. ఒక కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ- ఇటీవల తెలంగాణలో జరిగిన (అల్లు అర్జున్) సంఘటన తర్వాత మాకు టిక్కెట్ల పెంపు కానీ, ప్రీమియర్లకు కానీ అవ‌కాశం లభించలేదు. కానీ ఇక్కడ ఉన్న రోహిన్ రెడ్డికి ధన్యవాదాలు..మాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి లభించింది అని అన్నారు. వీర‌మ‌ల్లు టికెట్ పెంపు వెన‌క ఉన్న రోహ‌న్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు. అయితే పుష్ప 2 ప్ర‌చారంలో సంథ్య థియేట‌ర్ ట్రాజెడీ త‌ర్వాత అలాంటి హైప్, హంగామా లేకుండా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీమ్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోందని స‌మాచారం.

Tags:    

Similar News