SBIతో పైరసీ.. అక్కడ ఎలా పెట్టావురా?
పైరసీని అరికట్టడానికి పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్ని అడ్డుకట్టలు వేస్తున్నా, నేరగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.;
పైరసీని అరికట్టడానికి పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్ని అడ్డుకట్టలు వేస్తున్నా, నేరగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తో ఈ కథ ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలోనే, ఇంటర్నెట్ లో మరో షాకింగ్ ట్రెండ్ బయటపడింది. అదేంటంటే.. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ వెబ్ సైట్ల ముసుగులో సినిమాలు చూపించడం. నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇది నిజం.
లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో "ఎస్బీఐ టర్మ్ ఇన్షురెన్స్" అనే వెబ్ సైట్ లోకి వెళ్లి, ఒక "బప్పం" అనే సైట్ నుంచి కోడ్ లేదా లింక్ ని పేస్ట్ చేస్తే చాలు, లేటెస్ట్ సినిమాలు ప్లే అవుతున్నాయని చూపిస్తున్నారు. "టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్ అండ్ రివైవల్ గైడ్" అనే పేజీలోకి వెళ్లి, అక్కడ ఒక బాక్స్ లో సినిమా ఐడీని పేస్ట్ చేసి 'వాచ్' అని కొట్టగానే, ఇన్సూరెన్స్ వివరాలకు బదులుగా ప్రభాస్ 'సలార్' సినిమా ప్లే అవ్వడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ ఎలా పెట్టావురా అనే మీమ్ కూడా వైరల్ అవుతోంది.
అయితే, ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో చూపించినట్లుగా కొందరికి నిజంగానే సినిమాలు ప్లే అవుతుండగా, మరికొందరికి మాత్రం ఆ పేజీ ఓపెన్ కావడం లేదట. ఇది హ్యాకర్లు క్రియేట్ చేసిన ఫేక్ ఇన్సూరెన్స్ వెబ్ సైటా? లేక నిజమైన సైట్ లోనే బగ్ ని వాడుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ "బప్పం" అనే సైట్ నుంచి లింక్ కాపీ చేసి, ఇక్కడ పేస్ట్ చేసే టెక్నిక్ మాత్రం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు ఐబొమ్మ ప్లస్, ఐబొమ్మ వన్ అంటూ పుట్టుకొస్తున్న కొత్త సైట్లు కూడా ఇదే దారిలో ఉన్నాయి. వీటి మీద క్లిక్ చేస్తే నేరుగా 'మూవీ రూల్జ్' కు రీడైరెక్ట్ అవుతున్నాయి. అంటే ఒక దొంగ దొరికితే, వెనుక ఉన్న గజదొంగలు మాత్రం ఇంకా తెలివిగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. పోలీసులు రవిని అరెస్ట్ చేసినా, అతని శిష్యులో లేక వేరే గ్యాంగ్ లో.. ఇలా ఇన్సూరెన్స్ పోర్టల్స్, ఎడ్యుకేషనల్ సైట్ల పేర్లతో పైరసీని కంటిన్యూ చేస్తున్నారు.
ఏది ఏమైనా, ఇలాంటి లింక్స్ ఓపెన్ చేయడం ఎంతవరకు సురక్షితం అనేది పెద్ద ప్రశ్న. ఇన్సూరెన్స్ సైట్ అనుకుని క్లిక్ చేస్తే, మన బ్యాంక్ వివరాలు, పర్సనల్ డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంది. ఫ్రీగా సినిమా చూడాలనే ఆశతో ఇలాంటి అనధికారిక లింక్స్ జోలికి వెళ్తే, చివరకు లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.