టాలీవుడ్ కి మ‌రో ట్ర‌బుల్ షూటర్ దిగుతున్నాడా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర` విషయంలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.;

Update: 2026-04-29 06:26 GMT

టాలీవుడ్‌లో ఏదైనా సినిమాకు సంగీత పరంగా చిక్కులు ఎదురైనా లేదా అనుకోని పరిస్థితుల్లో అదనపు బలం అవ‌స‌రం అనుకుంటే? అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఎస్.ఎస్. తమన్. మరొక సంగీత దర్శకుడు సగం చేసిన పనిని పూర్తి చేయాలన్నా ? కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు చేపట్టాలన్నా? తమన్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని పరిశ్రమ ట్రబుల్ షూటర్ అని పిలుచుకుంటుంది. తాజాగా తమన్ సరసన అదే స్థాయిలో బాధ్యతలు భుజాన వేసుకునేందుకు మరో యువ సంగీత దర్శకుడు గౌర హరి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర` విషయంలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టుకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కీరవాణి ఇతర అంతర్జాతీయ ప్రాజెక్టులు - ముందస్తు కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటం తో `విశ్వంభర` నేపథ్య సంగీత బాధ్యతలను గౌర హరికి అప్పగించాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం. ఇది ఖరారైతే, టాలీవుడ్‌లో తమన్ తర్వాత ఒకే సినిమాలో మరో సంగీత దర్శకుడితో కలిసి పనిచేసే ట్రబుల్ షూటర్గా గౌర హరి నిలుస్తాడు.

ఇప్పటికే గౌర హరి `హను-మాన్`, `మిరాయ్` వంటి విజువల్ వండర్‌కు బిజిఎమ్‌తో ప్రాణం పోసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగ‌తి తెలిసిందే. ఫాంటసీ - అడ్వెంచర్ సినిమాల మూడ్‌ను పట్టుకోవడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. `విశ్వంభర` వంటి సోషియో ఫాంటసీ చిత్రానికి కావాల్సిన భారీ సౌండింగ్, గూస్‌బంప్స్ తెప్పించే స్కోర్‌ను అందించగలరనే నమ్మకంతోనే మేకర్స్ గౌరీ వైపు మొగ్గు చూపుతున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది. మెగాస్టార్ సినిమా అంటే ఉండే అంచనాలు, అందులోనూ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సాగే కథకు గౌర హరి మ్యూజిక్ పెద్ద అసెట్ అవుతుందని భావిస్తున్నారు.

నిజానికి ఒక అగ్ర సంగీత దర్శకుడు పనిచేస్తున్న ప్రాజెక్టులోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ రావడం అనేది ఇమేజ్ పరంగా కొంత ఇబ్బందికరంగా అనిపించొచ్చు. కానీ తమన్ మాదిరిగానే గౌర హరి కూడా ఎటువంటి భేషజాలు లేకుండా పనికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు క‌నిపిస్తోందిత‌. సినిమా అవుట్‌పుట్ బాగుండాలి. దర్శకుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే తపన గౌరీలో కనిపిస్తోంది. అందుకే మెగాస్టార్ వంటి దిగ్గజ హీరో సినిమాకు పనిచేసే అవకాశం రావడం కెరీర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావించే అవ‌కాశం ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. విశ్వంభ‌ర మేక‌ర్స్ గానీ, గౌరీ గానీ త‌న ఎంట్రీపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇదే నిజ‌మైతే? గౌర హరి కెరీర్‌లోనే అతిపెద్ద మలుపుగా మారనుంది. `విశ్వంభర` వంటి మెగా ప్రాజెక్ట్ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది.

Tags:    

Similar News