మూవీ రివ్యూ : గోదారి గట్టుపైన
షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించి.. ‘మేం ఫేమస్’ సినిమాతో హీరోగా-దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు.;
‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ
నటీనటులు: సుమంత్ ప్రభాస్- నిధి ప్రతాప్- జగపతిబాబు- సుదర్శన్- లైలా- దేవి ప్రసాద్- రాజ్ కుమార్ కసిరెడ్డి- హర్షవర్ధన్- రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం: నాగవంశీ
ఛాయాగ్రహణం: సాయి సంతోష్
నిర్మాత: అభినవ్ రావు
రచన-దర్శకత్వం: సుభాష్ చంద్ర
షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించి.. ‘మేం ఫేమస్’ సినిమాతో హీరోగా-దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను కథానాయకుడిగా తన లాగే షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన సుభాష్ చంద్ర ‘గోదారి గట్టుపైన’ చిత్రాన్ని రూపొందించాడు. ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. ఈ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రాజు (సుమంత్ ప్రభాస్) గోదావరి ప్రాంతంలోని ఒక పల్లెటూరి నుంచి టౌనుకి ఆటో నడుపుకునే కుర్రాడు. అతడి చెల్లెలు క్లాస్ మేట్ అయిన మాయ (నిధి ప్రతాప్)తో అనుకోకుండా ప్రేమలో పడతాడు రాజు. ఆమె కూడా అతణ్ని ఇష్టపడుతుంది. ఐతే ఇద్దరి మతాలు వేరు కావడం.. దీనికి తోడు మాయను మంచి ఉద్యోగం చేసే కుర్రాడికి ఇవ్వాలన్న తండ్రి కోరిక వల్ల వీరి ప్రేమకు సమస్యలు వస్తాయి. రాజు.. అయిష్టంగానే మాయకు దూరం కావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తర్వాత మాయకు మరో వ్యక్తితో పెళ్లి కూడా కుదురుతుంది. మరి ఆమె ఆ పెళ్లి చేసుకుందా.. రాజు ఆమెను వదులుకున్నాడా.. రాజు అంటే అస్సలు ఇష్టం లేని మాయ తండ్రి చివరికి ఏం చేశాడు.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ చూస్తేనే ఇదొక సగటు టీనేజీ ప్రేమకథ అనే విషయం అర్థమైపోతుంది. కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి టీనేజీ ప్రేమకథల్లో హీరో హీరోయిన్లు కలవడానికి సాధారణంగా కులం-మతం లాంటి అంశాలు లేదంటే.. ఆస్తి పాస్తుల్లో అంతరం లాంటివి అడ్డు గోడల్లా ఉంటాయి. వాటిని బద్దలు కొట్టి హీరో హీరోయిన్లు ఎలా ఒక్కటవుతారన్న నేపథ్యంలో ఇలాంటి ప్రేమకథలు నడుస్తుంటాయి. ‘గోదారి గట్టుపైన’ కూడా అందుకు భిన్నమేమీ కాదు. కూతురిని అమితంగా ఇష్టపడే తండ్రి.. ఆమెను తమ కంటే ఉన్నత స్థాయి కుటుంబంలో ఇవ్వాలని ఆశిస్తాడు. కథానాయికేమో హీరో గుణం చూసి ఇష్టపడుతుంది. వీరి పెళ్లికి ఇష్టపడని తండ్రి.. మిగతా విషయాల కంటే ఆ గుణమే గొప్పదని అర్థం చేసుకోవడం.. ఆ ఇద్దరినీ ఒక్కటి చేయడం.. ఈ నేపథ్యంలో బాగా అలవాటైన కథలాగే నడుస్తుంది ‘గోదారి గట్టుపైన’. కథ పరంగా ఏ కొత్తదనం కనిపించదు. ఇందులో ఆశ్చర్యపరిచే అంశాలు కూడా ఏమీ లేవు. కాకపోతే కొత్తగా లేకపోయినా మంచి ఫీలింగ్ ఇచ్చే తండ్రి-కూతురు ఎమోషన్.. ప్లెజెంట్ గా అనిపించే కొన్ని సన్నివేశాలు.. సుదర్శన్ పంచిన వినోదం ‘గోదారి గట్టుపైన’ను కాస్త ఎంగేజింగ్ గా మార్చాయి. కథాకథనాలు రొటీన్ అనిపించినా.. టైంపాస్ వినోదాన్ని ఇవ్వడం ద్వారా జస్ట్ ఓకే అనిపిస్తుంది.
ప్రేమకథల్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ కొత్తగా అయినా అనిపించాలి. లేదా బలంగా అయినా ఉండాలి. హీరో హీరోయిన్ల మధ్య అపార్థాలు తలెత్తే విషయమైనా.. లేదంటే కుటుంబం నుంచి అడ్డంకి ఎదురైనా.. అది ప్రభావవంతంగా అనిపిస్తేనే ప్రేక్షకుడిలో ఎమోషన్ వస్తుంది. ‘గోదారి గట్టుపైన’లో దర్శకుడు సుభాష్ చంద్ర ప్రేమకథ దగ్గర్నుంచి అన్ని విషయాలనూ చాలా తేలిగ్గా నడిపించేశాడు. హీరోను హీరోయిన్ జస్ట్ చెంపదెబ్బ కొడితే ప్రేమలో పడిపోతాడు. అబ్బాయిలు ప్రేమలో పడే విధం ఇదే కదా.. తెలుగు సినిమాల్లో ఇంతే కదా అని సర్దుకుపోతే.. హీరోయిన్ సైతం అచ్చం అలాగే ప్రేమలో పడడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అదే తరహాలో ఉంటాయి. ఇదేదో నిబ్బానిబ్బి స్టోరీలా ఉందే అనే ఫీల్ కలుగుతుంది. ఐతే మధ్య మధ్యలో సుదర్శన్ పంచే వినోదం వల్ల తొలి గంటలో అలా అలా టైంపాస్ అయిపోతుంది.
ఐతే ప్రేమకథ మలుపు తిరిగే చోట ఏదో ఒక బలమైన పాయింట్ ఉంటుందని ఆశిస్తే.. ప్రేమించడానికి బలమైన కారణం లేనట్లే విడిపోవడంలోనూ పెద్ద పాయింటేమీ కనిపించదు. హీరోయిన్ క్యారెక్టర్లో ఒక నిలకడ అంటూ లేకుండా చిత్ర విచిత్రంగా సాగే ప్రవర్తన కొంచెం విసుగెత్తిస్తుంది. కాన్ఫ్లిక్ట్ పాయింటుని మరీ సింపుల్ గా తేల్చేయడంతో ద్వితీయార్ధంలో కథనం అంత ఆకట్టుకోదు. ప్రి క్లైమాక్స్ ముందు వరకు ఫిల్లింగ్ సీన్లతో నడిపించేశాడు దర్శకుడు. గ్రాఫ్ బాగా డౌన్ అవుతున్న సమయంలో సుదర్శన్ కామెడీ వల్ల కాస్త ప్రేక్షకులు ఉపశమనం పొందుతారు. అతను ఆ మాత్రం రిలీఫ్ ఇవ్వకపోతే ‘గోదారి గట్టుపైన’ను భరించడం చాలా కష్టమయ్యేది. ఐతే కథ పరంగా ప్రి క్లైమాక్స్ నుంచి సినిమా పుంజుకుంటుంది. కొత్త సన్నివేశాలు లేకపోయినా.. ఎమోషన్ వర్కవుట్ అయింది. హీరో పాత్రను హైలైట్ చేసే.. హీరోయిన్ తండ్రిలో పరివర్తన తీసుకొచ్చే సన్నివేశాలను దర్శకుడు నీట్ గా ప్రెజెంట్ చేశాడు. తండ్రి-కూతురు బంధం నేపథ్యంలో గుండెలు పిండేయడం లాంటిదేమీ చేయకుండా.. సరదాగానే వారి మధ్య ఎమోషన్ ప్రేక్షకుల గుండెలకు తాకేలా చేశాడు దర్శకుడు. ఆస్తిపాస్తుల కంటే గుణం గొప్పది అనే విషయాన్ని సింపుల్ సీన్లతోనే బాగా చూపించాడు. పతాక సన్నివేశాలు ‘గోదారి గట్టుపైన’ మీద పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ‘గోదారి గట్టుపైన’ ఒక రొటీన్ లవ్ స్టోరీనే అయినా.. అక్కడక్కడా కామెడీ, చివర్లో ఎమోషన్ వర్కవుట్ కావడం వల్ల పర్వాలేదనిపిస్తుంది.
నటీనటులు:
సుమంత్ ప్రభాస్ కొత్త కుర్రాడే కానీ తనలో మంచి ఈజ్ ఉంది. ఈతరం యువతకు నచ్చేలా సాగుతుంది తన నటన. తొలి చిత్రంలో తెలంగాణ యాసతో ఆకట్టుకున్న అతను ఈసారి గోదారి యాసతోనూ మెప్పించాడు. ఇప్పటి ప్రేమ కథల్లో కుర్రాళ్ళ పాత్రలు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి కానీ.. ఇందులో హీరో క్యారెక్టర్ని రాముడు మంచి బాలుడు తరహాలో ప్రెజెంట్ చేశారు. సుమంత్ కూడా అందుకు తగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ నిధి ప్రతాప్ గొప్ప అందగత్తెలా అనిపించదు కానీ పాత్రకు తగ్గట్టు బాగా కుదిరింది. చాలా సహజంగా నటించింది. హీరోతో దాగుడుమూతలు ఆడే క్రమంలో ఆమె హావభావాలు భలే అనిపిస్తాయి. రిచ్ ఫాదర్ పాత్రల్లో జగపతిబాబును చూసి చూసి విసుగెట్టిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా రిలీఫ్. కూతురిని అమితంగా ప్రేమించే.. చాలా ప్రాక్టికల్ గా ఉండే తండ్రి పాత్రలో ఆయన మెప్పించాడు. జగపతి ఈ చిన్న సినిమాకు కాస్త వెయిట్ తీసుకువచ్చాడు. దేవి ప్రసాద్.. రాజీవ్ కనకాల చిన్న పాత్రల్లోనే ప్రభావం చూపించారు. జగపతికి జోడిగా నటించిన నిన్నటితరం కథానాయిక లైలా పెద్దగా ఇంపాక్ట్ వెయ్యలేకపోయింది. ఆర్టిస్టులు అందరిలో మార్కులు ఎక్కువ అందుకునేది మాత్రం సుదర్శనే. రెహమాన్ పాత్రలో అతను అదరగొట్టేశాడు. నవ్వులు పంచే బాధ్యత తనే తీసుకున్నాడు.
సాంకేతిక వర్గం:
ఇలాంటి రూరల్ లవ్ స్టోరీలకు వీనుల విందైన సంగీతం అవసరం. సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాల్సింది పాటలే. ఐతే నాగవంశీ పాటలు సినిమాలో బాగానే నడిచిపోయాయి కానీ.. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే స్థాయిలో లేవు. తన నేపథ్య సంగీతం బానే సాగింది. ద్వితీయార్థంలో వచ్చే కీలక సన్నివేశాల్లో స్కోర్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాల్సింది. సాయి సంతోష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. గోదారి పల్లెటూర్లను.. ప్రేమ సన్నివేశాలను బాగా చూపించాడు. పాటల చిత్రీకరణ బావుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కం డైరెక్టర్ సుభాష్ చంద్ర.. ఒక సగటు ప్రేమకథను తీసుకుని... యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించాలని చూశాడు. సన్నివేశాలను ప్లెజంట్ గా తీశాడు.. క్లీన్ ఫ్యామిలీ మూవీలా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు కానీ.. కొత్తగా ఏమీ చూపించలేదు. ఇటు ప్రేమ సన్నివేశాలు కానీ.. అటు కాన్ఫ్లిక్ట్ కానీ బలంగా లేకపోవడంతో సినిమా మరీ తేలిగ్గా అనిపిస్తుంది. ఐతే కొన్ని కామెడీ సీన్లు.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ వరకు అతను బాగా డీల్ చేశాడు.
చివరగా: గోదారి గట్టుపైన.. కూసింత కాలక్షేపం
రేటింగ్ - 2.5/5