రిస్క్ తోనే నయా హిస్టరీ.. అల్లు బాస్ కొత్త ప్లాన్!
ఇప్పుడు అదే కోవలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మరో రిస్క్ తో కూడిన నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ లో పెద్ద విజయాలు సాధించిన చాలా సినిమాల వెనుక ఒక పెద్ద రిస్క్ ఉంటుంది. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్న సమయంలో.. ఎవరూ ఊహించని కథలు, కొత్త టెక్నాలజీ, విభిన్న ఆలోచనలతో ముందుకు వచ్చిన నిర్మాతలే ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ లకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే కోవలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మరో రిస్క్ తో కూడిన నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అల్లు అరవింద్ కెరీర్ ను అబ్జర్వ్ చేస్తే.. మార్కెట్ ఎలా మారుతుందో ముందే అంచనా వేసి అడుగులు వేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొత్త దర్శకులను ప్రోత్సహించడం, భారీ విజన్ ఉన్న కథలకు అవకాశం ఇవ్వడం, చిన్న సినిమాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రేక్షకుల టేస్ట్ ముందుగానే అర్థం చేసుకోవడం ఆయన బలంగా చెప్పుకుంటారు. అందుకే గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే చాలా ప్రాజెక్టులు ఎప్పుడూ కొత్త చర్చకు దారి తీస్తుంటాయి.
ప్రస్తుతం భారతీయ సినిమా మార్కెట్ లో మైథాలజీ, ఇతిహాసాలు, భారతీయ సంస్కృతికి సంబంధించిన కథలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇదే సమయంలో యానిమేషన్ రంగం కూడా క్రమంగా కొత్త దిశగా అడుగులు వేస్తోంది. చిన్నారులకే పరిమితమన్న అభిప్రాయం నుంచి బయటపడి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథల కోసం సినీ పరిశ్రమ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఇలాంటి ప్రాజెక్టుల్లో రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. యానిమేషన్ అంటే భారీ పెట్టుబడి, ఎక్కువ నిర్మాణ సమయం, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం అవసరం. కథ బలంగా లేకపోయినా, విజువల్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టమే. అందుకే ఇలాంటి ప్రయోగాలకు చాలామంది నిర్మాతలు వెనకడుగు వేస్తుంటారు. కానీ అల్లు అరవింద్ మాత్రం కొత్త దారులు వెతకడంలో వెనుకాడరనే పేరు సంపాదించుకున్నారు.
మార్కెట్ లో ట్రెండ్ ఏంటన్నదానికంటే.. రేపటి ట్రెండ్ ఎలా ఉండబోతుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అదే ఆలోచనతో మరోసారి కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా.. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గీతా ఆర్ట్స్ కాళీమాత కథాంశంతో భారీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించే దిశగా అడుగులు వేస్తోందట.
స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందనే ప్రచారం సాగుతోంది. గతంలో కాళీమాత కథలతో పెద్ద కమర్షియల్ విజయాలు లేకపోయినా.. అత్యాధునిక యానిమేషన్, ప్రపంచస్థాయి విజువల్స్, బలమైన ఎమోషన్ తో ఆ కథను కొత్తగా చూపించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ప్రచారం నిజమై, ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లి.. రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తే.. అది కేవలం మరో సినిమా విజయమే కాదు. రిస్క్ తోనే నయా హిస్టరీ సృష్టించాలన్న అల్లు బాస్ కొత్త ప్లాన్ సక్సెస్ అయినట్లే అని ఇప్పుడు అభిప్రాయం వ్యక్తమవుతోంది.