గౌతమ్, వివేక్.. టాలెంట్ ఉన్నా ఎందుకిలా?
టాలీవుడ్ లో కొత్త తరహా కథలు చెప్పే దర్శకులను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరింస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు.
టాలీవుడ్ లో కొత్త తరహా కథలు చెప్పే దర్శకులను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరింస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. ఒక హిట్ వచ్చినా వెంటనే మరో సినిమా సెట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. కథ స్ట్రాంగ్ గా ఉండాలి.. స్టార్ హీరోలు నమ్మకం పెట్టుకోవాలి.. మార్కెట్ లెక్కలు కలవాలి. ప్రస్తుతం దర్శకులు గౌతమ్ తిన్ననూరి, వివేక్ ఆత్రేయ పరిస్థితి చూస్తే ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
గౌతమ్ తిన్ననూరి తన భావోద్వేగ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తెరకెక్కించిన జెర్సీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయారు. తండ్రీకొడుకుల ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించిన ఆ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
జెర్సీ విజయంతో గౌతమ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. అయినప్పటికీ టాలీవుడ్ లో ఆయనపై క్రేజ్ తగ్గలేదు. భారీ స్థాయిలో రూపొందిన కింగ్ డమ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా తీవ్ర నిరాశ కలిగించింది. సినిమా ఫలితం తర్వాత గౌతమ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ పై ప్రకటన రాకపోవడం చర్చనీయాంశమైంది.
మధ్యలో టీనేజ్ బ్యాక్ డ్రాప్ లో మ్యాజిక్ అనే మ్యూజికల్ డ్రామా తెరకెక్కిస్తున్నారని ప్రకటన వచ్చింది. కొంత షూటింగ్ కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు అయోమయంలో ఉన్నారు. మంచి కథ సిద్ధమైనా, దాన్ని మార్కెట్ కు సరిపోయేలా మలచడం.. హీరోలతో సెట్ చేయడం ఇప్పుడు సవాల్ గా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక వివేక్ ఆత్రేయ విషయానికి వస్తే.. ఆయన తనదైన స్క్రీన్ ప్లే, నేచురల్ కామెడీ, కొత్త తరహా కథలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించారు. మెంటల్ మదితో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. బ్రోచేవారెవరురాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత వివేక్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అంటే సుందరానికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించకపోయినా, క్లాస్ ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన సరిపోదా శనివారంతో ఆయన కమర్షియల్ సక్సెస్ కూడా అందుకున్నారు. యాక్షన్, ఎమోషన్, వినోదాన్ని మేళవించిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ నెక్స్ట్ సినిమా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం ఆసక్తి రేపుతోంది. ఈ మధ్య బాలకృష్ణతో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఏదేమైనా గౌతమ్ తిన్ననూరి, వివేక్ ఆత్రేయ ఇద్దరూ టాలెంట్ ఉన్న దర్శకులే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా హిట్ కావడం మాత్రమే సరిపోవడం లేదు. మార్కెట్ అంచనాలు, స్టార్ హీరోల ఇమేజ్, పాన్ ఇండియా లెక్కలు అన్నీ కలిసి రావాలి. అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు దర్శకులు కూడా మరింత స్ట్రాంగ్ కథలతో హీరోలను మెప్పించే ప్రయత్నంలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.