సోషల్ మీడియా రచ్చపై గరికపాటి సీరియస్.. ఆ ఆరోపణలకు చెక్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం జరిగినా, అది క్షణాల్లో పెద్ద వివాదంగా మారిపోతోంది.;
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం జరిగినా, అది క్షణాల్లో పెద్ద వివాదంగా మారిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు, సంబంధం లేని వ్యక్తులను అందులోకి లాగడం ఒక ట్రెండ్ గా మారింది. వ్యూస్ కోసం, లైకుల కోసం ఎంతకైనా తెగించే కొందరు కంటెంట్ క్రియేటర్లు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారిని కూడా వదలడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. దీనివల్ల అసలు విషయం పక్కకు వెళ్లి, అనవసరమైన చర్చలు తెరపైకి వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో జరుగుతున్న రచ్చ గురించి అందరికి తెలిసిందే. ఒక యూట్యూబర్, సినీ నటుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలోకి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి పాత వీడియోలను లాగారు. సందర్భం వేరైనా, ఆ వీడియో క్లిప్స్ ను ప్రస్తుత గొడవకు లింక్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్ చేశారు. దీనిపై గరికపాటి వారు ఎలా స్పందిస్తారో అని అందరూ ఎదురుచూశారు.
ఎట్టకేలకు ఈ వ్యవహారంపై గరికపాటి నరసింహారావు గారి అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పష్టత వచ్చింది. జరుగుతున్న ప్రచారంపై వారి సాంకేతిక బృందం ఒక పవర్ ఫుల్ నోట్ రిలీజ్ చేసింది. "గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి, వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానెళ్లు లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా, ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువుగారి ఫోటోలు, మాటలను ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటిగా మారిందని, ఇవి పూర్తిగా అర్థరహితమైన చర్యలని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. గతంలో కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇక అభిమానులకు కూడా ఒక ముఖ్యమైన సూచన చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటి రెండు సార్లు సరిచూసుకోవాలని కోరారు. గరికపాటి వారి అధికారిక మాధ్యమాల్లో మాత్రమే వారి ప్రసంగాలు, వ్యాఖ్యలు వెలువడతాయని, మిగతా వాటితో వారికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఫైనల్ గా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి గరికపాటి గారు తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. తన మౌనాన్ని అలుసుగా తీసుకుని ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్స్ పెడితే ఇకపై ఊరుకునేది లేదని లీగల్ గానే తేల్చుకుంటామని చెప్పకనే చెప్పారు.