ఫిష్ వెంకట్ ఎంత పారితోషికం తీసుకునేవాడో తెలుసా..?
కామెడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఫిష్ వెంకట్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెల్సిందే.;
కామెడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఫిష్ వెంకట్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా ఫిష్ వెంకట్‌కి చికిత్స చేయించలేక చివరకు ఇలా జరిగిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. వారి నుంచి సాయం, వీరి నుంచి సాయం.. లక్షల రూపాయలు ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ఏ ఒక్కరి నుంచి కనీసం సహాయం అందలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న ఫిష్ వెంకట్ గతంలో ఎంత సంపాదించారు, ఏం చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నటీనటుల పారితోషికం అనేది ఈ మధ్య కాలంలో భారీగా పెరిగింది. పది, పదిహేను ఏళ్ల క్రితం నటీ నటుల పారితోషికం చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా సైడ్ క్యారెక్టర్‌లు వేసే వారికి రోజు వారి పారితోషికం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఉన్నట్లుగా యూనియన్స్ ఎక్కువగా లేవు, అంతే కాకుండా పెద్ద మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసే వారు కాదు. ఇప్పుడు మేకింగ్ పెరగడంతో పారితోషికాలు ఎక్కువగా ఇస్తున్నారు. చిన్న పాత్ర చేసిన కమెడియన్స్ సైతం లక్షల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు సైతం వారికి ఉన్న డిమాండ్ మేరకు అడిగిన మొత్తంను ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. కానీ ఫిష్ వెంకట్ ఫామ్‌లో ఉన్న సమయంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
ఫిష్ వెంకట్ దాదాపుగా 100 సినిమాలు చేశాడు. ఆయన పాత్రల వల్ల హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, సినిమాలకు ఆయన కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. నటుడు జయప్రకాష్ రెడ్డితో కలిసి ఫిష్ వెంకట్ చేసిన కామెడీ సీన్స్ కి మంచి స్పందన వచ్చేది. మొదట్లో విలన్‌గా నటించినప్పటికీ కామెడీ యాంగిల్ కారణంగా కామెడీ విలన్‌గా ఎక్కువ సినిమాలు చేశాడు. విలన్ గ్రూప్‌లో ఎక్కువగా ఫిష్ వెంకట్ కనిపిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించేవాడు. ఒకానొక సమయంలో వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో ఖచ్చితంగా ఫిష్ వెంకట్ ఉండేవాడు. అలాంటి సమయంలో ఫిష్ వెంకట్ రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల పారితోషికం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కెరీర్ ఆరంభంలో వందల రూపాయల పారితోషికం తీసుకుని సినిమాలు చేసిన ఫిష్ వెంకట్ 30 నుంచి 40 సినిమాల తర్వాత వేల రూపాయలు పారితోషికం తీసుకోవడం మొదలు పెట్టాడని, అప్పుడప్పుడే డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకున్న సమయంలో షుగర్ కారణంగా కాలుకు తీవ్ర గాయం అయ్యి సినిమాలు చేయలేక పోయాడు. తిరిగి సినిమాల్లో నటించాలని అనుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం సెట్ కాలేదు. చాలా సినిమాలకు అయిదు నుంచి పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనేవాడు.
అప్పుడు ఆయన తీసుకున్న పారితోషికం ఎక్కువే అయినా అనారోగ్య పరిస్థితులు, ఇతర మెయింటెన్స్ కారణంగా ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిందట. దాంతో ఆర్థిక ఇబ్బందులు మొదలు అయ్యాయి. అందుకే ఇప్పుడు నటులు చాలా ముందు చూపుతో వచ్చిన మొత్తంలో ఎక్కువ సేవింగ్స్ కి వినియోగిస్తున్నారట. ఫిష్ వెంకట్ పరిస్థితి చూసిన వారు ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.