టాప్ స్టోరి: కమర్షియల్ సినిమా నవనాయికలు హీరోలను కొట్టేలా!
మన కమర్షియల్ సినిమాల్లో దశాబ్దాలుగా కథలు, కథనాలు ఎక్కువగా హీరోసామ్యంతోనే సాగుతున్నాయి.
మన కమర్షియల్ సినిమాల్లో దశాబ్దాలుగా కథలు, కథనాలు ఎక్కువగా హీరోసామ్యం చుట్టూనే రన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో `యాంగ్రీ యంగ్ మ్యాన్` శైలిని దాటి `అల్ట్రా-అగ్రెసివ్` లేదా `గ్రే షేడ్స్` కలిగిన హీరో పాత్రల ట్రెండ్ నడుస్తోంది. హీరో పాత్రలు ఇంత ఊరమాస్‌గా, దూకుడుగా ఉన్నప్పుడు కథానాయిక (హీరోయిన్) పాత్రను కేవలం పాటలకో.. గ్లామర్‌కో పరిమితం చేస్తే సినిమా ఒకే కోణంలో సాగి ప్రేక్షకుడికి రొటీన్‌గా అనిపిస్తుంది. అయితే కొందరు ప్రతిభావంతులైన దర్శకులు హీరో ఎంత అగ్రెసివ్‌గా ఉన్నా.. హీరోయిన్ పాత్రకు బలమైన కథా ప్రాధాన్యతను.. ఎమోషనల్ డెప్త్ ను జోడించి సినిమాలను క్లాసిక్స్‌గా మార్చారు.
దర్శకుడు సుకుమార్ తన చిత్రాలలో హీరోలను అత్యంత మొరటుగా చూపిస్తూనే హీరోయిన్ పాత్రల ద్వారా వారిలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరిస్తారు. `రంగస్థలం` చిత్రంలో చెవుడు ఉన్న చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎంత మొండివాడో రామలక్ష్మి (సమంత) పాత్ర కూడా అంతే స్వచ్ఛంగా, ధైర్యంగా ఉండి కథా గమనంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే `పుష్ప`లో `తగ్గేదే లే` అంటూ గంధపు చెక్కల స్మగ్లర్‌గా మారిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) అహంకారాన్ని కరిగించేలా శ్రీవల్లి (రష్మిక మందన్న) పాత్రను తీర్చిదిద్దారు. ఎవరికీ లొంగని హీరో శ్రీవల్లి గౌరవం కోసం, ఆమె ప్రేమ కోసం తపించేలా చేయడం ద్వారా ఆ అగ్రెసివ్ క్యారెక్టర్‌కు ఒక మానవీయ కోణాన్ని సుకుమార్ జోడించారు.
మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సృష్టించే హీరోలు హైపర్-అగ్రెసివ్‌గా, ఉద్రేకపూరితంగా ఉంటారనే విమర్శ ఉన్నా.. అతడి సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా డిగ్నిఫైడ్‌గా, హీరోను నిలదీసేలా ఉంటాయి. `అర్జున్ రెడ్డి`లో అర్జున్ ఎంత కోపిష్టి, ఆవేశపరుడో... ప్రీతి (షాలినీ పాండే) అంత నిశ్శబ్దంగా, స్థిరంగా ఉంటూనే కథను మలుపు తిప్పుతుంది. ఇక `యానిమల్` చిత్రంలో రణబీర్ కపూర్ పాత్ర క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ముఖం మీదే అతడి తప్పులను ఎండగట్టే ధైర్యం ఉన్న పాత్రగా గీతాంజలి (రష్మిక) కనిపిస్తుంది. ఈ చిత్రాలలో హీరోల అగ్రెసివ్‌నెస్‌ను హీరోయిన్లు తమ నటనతో.. భావోద్వేగాలతో బ్యాలెన్స్ చేయడం వల్లే ఆ పాత్రలకు అంతటి గుర్తింపు లభించింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ `స్పిరిట్` చిత్రంలో ట్రిప్తి దిమ్రీ పాత్రను అంతకుమించిన ఎమోషనల్ టచ్ తో నటనకు ఆస్కారం కల్పించేలా తీర్చిదిద్దారని సమాచారం.
నిజానికి 90ల కాలంలోనే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ ఓరియెంటేషన్‌ను మార్చిన ఘనత రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీలకు దక్కుతుంది. ఆర్జీవీ సృష్టించిన `రంగీలా`లో మిలి (ఊర్మిళ) పాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. ముఠా గొడవలు, యాక్షన్ సినిమాలు వస్తున్న కాలంలో ఒక మధ్యతరగతి అమ్మాయి సినీ కలలు, ఆమె అంతర్గత సంఘర్షణ చుట్టూ ఈ కమర్షియల్ హిట్ సినిమాని నడిపించాడు ఆర్జీవీ. అదేవిధంగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన `గులాబీ`, `నిన్నే పెళ్లాడుతా` చిత్రాలలో హీరోయిన్లు కేవలం అందంగా ఉండటమే కాకుండా.. చాలా చురుగ్గా సొంత ఆలోచనలు కలిగిన స్వతంత్ర వ్యక్తులుగా కనిపిస్తారు. `నిన్నే పెళ్లాడుతా`లో మహాలక్ష్మి (టబు) పాత్ర అమాయకంగా కనిపిస్తూనే కుటుంబ బంధాలను ముడిపెట్టే డ్రైవింగ్ ఫోర్స్‌గా మారుతుంది. గీతా గోవిందం చిత్రంలో విజయ్ ని డామినేట్ చేసే పాత్రలో రష్మిక మందన్న నటించిన తీరుకు పడిపోని ఆడియెన్ లేడు.
వాణిజ్య సినిమాల్లో హీరోయిన్ పాత్రలను కేవలం గ్లామర్ హంగులకే పరిమితం చేయకుండా అంతకుమించిన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సినిమాల నాణ్యత ప్రేక్షకాదరణ మారుతుందనడంలో సందేహం లేదు. హీరో పాత్ర ఎంత అగ్రెసివ్‌గా ఉంటే.. దానికి సమాంతరంగా హీరోయిన్ పాత్రలో అంతటి భావోద్వేగ బలం ఉన్నప్పుడు ఇద్దరి మధ్య వచ్చే ఘర్షణ సినిమా డ్రామాను పీక్స్‌కు తీసుకెళ్తుంది. ఒక కత్తికి ఒర ఎంత ముఖ్యమో.. అగ్రెసివ్ హీరో పాత్రకు హీరోయిన్ పాత్ర అంతటి సమతుల్యతను ఇస్తుంది. అప్పుడే ఆ కమర్షియల్ సినిమా కేవలం `మాస్ మసాలా`లా కాకుండా.... కాలంతో సంబంధం లేకుండా నిలవగలిగే ఒక గొప్ప సినిమాటిక్ వండర్‌గా రూపాంతరం చెందుతుంది. మణిరత్నం, ఆర్జీవీ సహా అంతకుముందు ఉన్న చాలా మంది సీనియర్ దర్శకులు తమ సినిమాల్లో నాయికల పాత్రలకు హీరోలకు సమానంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చారు గనుకనే అవన్నీ సినిమా హిస్టరీలో క్లాసిక్స్ గా ఎప్పటికీ నిలిచి ఉన్నాయి.