రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ.. మృత్యు కౌగిలిలోకి వెళ్లి వెనక్కి వచ్చిన నటి!
పాపులర్ వెబ్ సిరీస్ `గేమ్ ఆఫ్ థ్రోన్స్` ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నటి ఎమిలియా క్లార్క్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి షాకింగ్ విషయాలను చెప్పారు.
పాపులర్ వెబ్ సిరీస్ `గేమ్ ఆఫ్ థ్రోన్స్` ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నటి ఎమిలియా క్లార్క్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి షాకింగ్ విషయాలను చెప్పారు. లండన్‌లో జరిగిన `వెరైటీస్ పవర్ ఆఫ్ ఉమెన్` ఈవెంట్‌లో ఎమిలియా అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. తన 20వ ఏట ఎదురైన రెండు బ్రెయిన్ హెమరేజ్‌లు (మెదడులో రక్తస్రావం) తన జీవితాన్ని, నటనపై తనకున్న నమ్మకాన్ని ఎలా దెబ్బతీశాయో వివరించారు. ఈ ప్రాణాంతక అనారోగ్య సమస్య తన నటన సామర్థ్యాన్నే పూర్తిగా నాశనం చేస్తుందని ఆ సమయంలో తాను ఎంతగానో భయపడ్డానని ఎమిలియా క్లార్క్(39) ఈ వేదికపై వెల్లడించారు.
ఎమిలియా క్లార్క్ తన 22వ ఏట అంటే 2011లో మొదటిసారి బ్రెయిన్ హెమరేజ్ బారిన పడ్డారు. ఆ అత్యంత క్లిష్టమైన సమయంలోనే ధైర్యంగా `గేమ్ ఆఫ్ థ్రోన్స్` సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత 24వ ఏట బ్రాడ్‌వే నాటక రంగ ప్రవేశం ముగిసిన అనంతరం రెండోసారి మెదడులో రక్తస్రావం జరిగింది. నేను మృత్యువును జయించి ఇక్కడే ఉన్నానంటే ఏదో తప్పు చేశానని.. మృత్యువు నన్ను ఎలాగైనా పట్టుకోవడానికి తిరిగి వస్తుందని చాలా సంవత్సరాల పాటు ప్రతిరోజూ భయపడేదాన్ని! అని ఎమిలియా ఆనాటి మానసిక వేదనను గుర్తుచేసుకున్నారు.
రెండుసార్లు తీవ్రమైన బ్రెయిన్ ట్రామాలకు గురైనా శస్త్రచికిత్సల తర్వాత కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఆమె మళ్లీ నడవడం, మాట్లాడటం, తన డైలాగులను గుర్తుపెట్టుకుని కెమెరా ముందుకు రావడం చేయడం విశేషం. ఈ ప్రమాదకర గాయాల నుండి కోలుకున్న తర్వాత తనలాగే మెదడులో రక్తస్రావం జరిగి బ్రతికి బయటపడిన ఇతర బాధితులకు పునరావాసం కల్పించడం కోసం ఈ నటి 2019లో `సేమ్ యు` అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. తాను ఈ సంస్థను స్థాపించినప్పుడు ముఖ్యంగా యువత నుండి అద్భుతమైన స్పందన లభించిందని.. ప్రస్తుతం వేలాది మంది బాధితులు తమ కమ్యూనిటీలో భాగమయ్యారని ఆమె పేర్కొన్నారు.
మొదటిసారి బ్రెయిన్ హెమరేజ్ జరిగి 15 ఏళ్లు గడిచిన తర్వాత ఆ సమయం ఎంత కఠినమైనదో ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకోగలుగుతున్నాను. బ్రెయిన్ ఇంజూరీ తర్వాత కోలుకునే ప్రయాణం ఎలాంటి సాయం లేకుండా ఒక పెద్ద లోయ అంచు నుండి కిందకు పడిపోతున్నంత భయానకంగా ఉంటుంది! అని ఎమిలియా క్లార్క్ వివరించారు. ఇటువంటి తీవ్రమైన శారీరక, మానసిక సవాళ్లను అధిగమిస్తూనే `గేమ్ ఆఫ్ థ్రోన్స్` సిరీస్ ద్వారా అంతర్జాతీయంగా ఘనమైన ఖ్యాతిని ఘడించడమే కాకుండా.. ఏకంగా నాలుగు ఎమ్మీ అవార్డుల నామినేషన్లను కూడా దక్కించుకున్నారు.
ఈ గ్లోబల్ స్టార్ కేవలం టెలివిజన్ రంగానికే పరిమితం కాకుండా 2016లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం `మీ బిఫోర్ యూ`.. 2015 నాటి బ్లాక్‌బస్టర్ సీక్వెల్ `టెర్మినేటర్ జెనిసిస్` వంటి భారీ చిత్రాలలో నటించారు. ఓవైపు ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. వాటన్నింటినీ జయించి ఈ ప్రతిభావంతురాలైన నటి సాధించిన ఈ విజయాలు.. ప్రస్తుతం ఎదుగుతున్న ఎందరో నూతన నటీనటులకు.. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.