దురంధర్ ఫ్రాంఛైజీకి ఎండ్ అనేదే లేదా?
ముఖ్యంగా భారతదేశంతో నిరంతరం డబుల్ గేమ్ ఆడే అమెరికా .. ఇటీవల పాకిస్తాన్ తో కలిసి ఎలాంటి కుట్రలకు పాల్పడుతోందో కూడా దురంధర్ కొనసాగింపు భాగంలో చూపిస్తే ఇంకా బావుంటుందేమో!;
రణ్‌వీర్ సింగ్ నటించిన `దురంధర్` సంచలన విజయం సాధించి 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గల్ఫ్ దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో 750కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి దర్శకరచయిత ఆదిత్యాధర్ ఎంపిక చేసుకున్న కథాంశం ప్రధాన కారణం. గూఢచర్యం- దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా కథాంశంతోనే రక్తి కట్టించాడు. శత్రుదేశం పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన ఒక భారతీయ గూఢచారి అక్కడ ఎలాంటి ఘారాల్ని ఎదుర్కొన్నాడు? శత్రువు కన్నుగప్పి ఎలాంటి విధ్వంశం సృష్టించాడు? అన్నదే ఈ సినిమా. ఇందులో ఇండియా- పాకిస్తాన్ చారిత్రక రాజకీయాలను అద్భుతంగా చూపించారు. ఇకపై వేసవి కానుకగా విడుదల కానున్న రెండో భాగంలో మరిన్ని ఆసక్తికర విషయాలను ఆదిత్యాధర్ చూపించబోతున్నాడు.
అయితే రెండో భాగంతో అతడు ముగింపు ఇవ్వడం సరైనదేనా? అంటే కానేకాదని కొందరు విశ్లేషిస్తున్నారు. దురంధర్ ఒక యథార్థ కథ ఆధారంగా రూపొందించిన సినిమానే అయినా కానీ, దీనిలోకి జియో పొలిటికల్ అంశాలను జొప్పించి సీక్వెల్ కథలను పొడిగించడానికి ఆస్కారం ఉందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. దురంధరుడు కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా చొచ్చుకుపోగలడు. అక్కడ స్పైయింగ్ చేయగలడు. భారతదేశ ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే లేదా భారతదేశ సమగ్రతను దెబ్బ తీసే కుట్రదారులను అంతమొందించడంలో, ప్రపంచ యుద్ధాలకు కారణం అయ్యే ఉన్మాదులను మట్టుబెట్టడంలోను అతడి తర్వాతే. అతడు ఏ రకమైన ఆపరేషన్ అయినా చేపట్టగలడు.
ముఖ్యంగా భారతదేశంతో నిరంతరం డబుల్ గేమ్ ఆడే అమెరికా .. ఇటీవల పాకిస్తాన్ తో కలిసి ఎలాంటి కుట్రలకు పాల్పడుతోందో కూడా దురంధర్ కొనసాగింపు భాగంలో చూపిస్తే ఇంకా బావుంటుందేమో! భారత రాజకీయ చాణక్యుడు అజిత్ దోవల్ పాత్ర ముగిసినా కానీ, ఆయన వారసులు కూడా ఆపరేషన్లను కొనసాగించగలరు. భారతదేశ స్థిరత్వానికి భంగం కలిగించే, దేశ సమగ్రతను దెబ్బ తీసే కుట్రలు కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కాదు. మరో దాయాది దేశం చైనాలో, కుట్రలు కుయుక్తుల అగ్ర రాజ్యం అమెరికాలో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు మరో దురంధర్ పుట్టుకు రావాలని కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
నిజానికి హాలీవుడ్ లో అయితే మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఫ్రాంఛైజీ చిత్రాల్లో ప్రపంచ స్థాయి గూఢచర్యాన్ని చూపిస్తారు. ప్రపంచానికి ఏదో ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అందరినీ కాపాడేందుకు కథానాయకుడు బయల్దేరాడని చూపిస్తారు. ఇప్పుడు దురంధర్ కూడా ప్రపంచాన్ని కాపాడేందుకు, ప్రపంచ విపత్తు నుంచి భారతదేశాన్ని కాపాడేందుకు ఏం చేస్తాడన్నది మునుముందు చూపించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జియో పాలిటిక్స్, యుద్ధాల నిరతిని పరిశీలిస్తే, ఇంకా ఇలాంటి గూఢచర్య కథలను దర్శకరచయితలు సృజించగలరు. అదంతా కేవలం క్రియేటివ్ రైటర్ల జిమ్మిక్, వారి పరిజ్ఞానాన్ని బట్టి ఏదైనా పాజిబులే.
దురంధర్ భారతదేశంలో బాగా ఆడితే 800కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డాయాస్పోరాలో ఆడితే 1200 కోట్లు తేగలడు. అలా కాకుండా ప్రపంచ దేశాల సమస్యలకు పరిష్కారం చూపించే గూఢచారిగా హాలీవుడ్ తరహా కథాంశాలతో దూసుకెలితే... అలాంటి సినిమాకి వేల కోట్లు ఖాయం. అవతార్ రేంజులో కనీసం ఒక బిలియన్ డాలర్లు వసూలు చేసే సినిమాలు ఇండియన్ స్క్రీన్ నుంచి పుట్టుకు రావాల్సి ఉంది.