'పుష్ప 2' రేంజులో 'దురంధర్ 2'?
దురంధర్ ఊపు చూస్తుంటే ఈ సినిమా చాలా రికార్డులు కొట్టేస్తుందని అంచనా వేస్తున్నారు.;
దురంధర్ ఊపు చూస్తుంటే ఈ సినిమా చాలా రికార్డులు కొట్టేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా చాలా వేగంగా 500 కోట్ల క్లబ్ లో చేరే వీలుంది. ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ అందుకుని స్థిరంగా వసూళ్లను సాధిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదలైన రెండో శుక్రవారం `పుష్ప 2` (27.5కోట్లు) రికార్డును బ్రేక్ చేయడం విశేషం. రెండో శుక్రవారం నాడు 34 కోట్ల వసూళ్లతో పాత రికార్డులను దురంధర్ సవరించింది. ఈ వసూళ్ల దూకుడు చూస్తుంటే వేగంగా 500కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా టూటైర్ సిటీల్లోను దురంధర్ బాగానే వసూలు చేస్తోందని ట్రేడ్ చెబుతోంది.
నిజానికి ఈ సినిమా ఇంత పెద్ద రేంజుకు చేరుతుందని దర్శకుడు ఆదిత్య ధర్ కానీ, రణ్ వీర్ కానీ ఊహించలేదు. కానీ దురంధర్ కంటెంట్ తో హృదయాలను గెలుచుకుంది. దేశభక్తి, తీవ్రవాదం అనే ఎలిమెంట్స్ ప్రజలకు బాగా కనెక్టయ్యాయి. పైగా ఇది సరైన టైమింగ్ తో వచ్చిన సినిమా. కారణం ఏదైనా ఇప్పుడు దురంధర్ సీక్వెల్ పై అంచనాలు పదింతలు పెరిగాయి. దానికి తగ్గట్టే ఇప్పుడు `దురంధర్ 2` కాన్వాస్ స్కేల్ అన్నీ మారిపోతున్నాయని తెలిసింది.
నిజానికి `దురంధర్` సీక్వెల్ ని మార్చి 2026లో విడుదల చేస్తామని ఎండ్ కార్డ్స్ లో నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు దురంధర్ గ్రాండ్ సక్సెస్ అనూహ్యంగా ప్రతిదీ మార్చేసింది. ఇంకా పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంది. మారిన స్కేల్ ని బట్టి సీక్వెల్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. దర్శకుడు ఆదిత్య ధర్ పై ఇప్పుడు మరింత అదనపు బాధ్యత పెరిగింది.
ఇంతకుముందు పుష్ప గ్రాండ్ సక్సెస్ తర్వాత సుకుమార్ అమాంతం సీక్వెల్ స్పాన్ ని పెంచేసాడు. యాక్షన్ కంటెంట్ కోసం భారీ మొత్తాన్ని నిర్మాతలతో పెట్టుబడిగా పెట్టించాడు. చిత్రీకరణ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. కాన్వాస్ ప్రతిదీ మార్చేసాడు. అతడి ప్రయత్నం గ్రాండ్ సక్సెసైంది. కానీ ఇప్పుడు దురంధర్ సీక్వెల్ కోసం అలాంటి ప్రయత్నం చేస్తారా? అన్న చర్చా సాగుతోంది. మొదటి భాగం కంటే రెండో భాగం రేంజ్ పెద్ద స్థాయిలో ఉండాలి. దానికోసం సమయం డబ్బు అదనంగా కావాలి. అందుకే ఈ సినిమాని మార్చిలో కాకుండా ఆగస్టులో విడుదల చేస్తే బావుంటుదని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సీక్వెల్ కి సంబంధించిన కొంత భాగం తెరకెక్కింది. పెండింగ్ చిత్రీకరణలు ఇంకా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్ట్ 2 కోసం కంటెంట్ పరంగా, స్పాన్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలిసింది.
దురంధర్ ఫెయిలై ఉంటే కథ వేరేగా ఉండేది. కానీ ఇది ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది గనుక, దర్శకనిర్మాతలు చాలా ఎక్కువ దూరం ఆలోచించాల్సి వస్తోంది. సీక్వెల్ కోసం బడ్జెట్ స్కేల్ కూడా అమాంతం మారిపోనుందని కూడా గుసగుస వినిపిస్తోంది.