కార్లు, హడావుడి కే అక్కడ ఎక్కువ విలువ..!

మలయాళం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలను చేస్తున్న దుల్కర్ సల్మాన్ తనకు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఎదురైనా చేదు అనుభవం గురించి ఇటీవల ఒక చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.;

Update: 2025-12-02 07:51 GMT

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో దుల్కర్ హిందీ సినిమాల్లో నటించడం జరిగింది, ఆ సమయంలో ఎదుర్కొన్న అనుభవం నేపథ్యంలో దుల్కర్ ఈ వ్యాఖ్యలు చేయటం జరిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్ గురించి గతంలో కొందరు సౌత్ స్టార్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకి వస్తున్నాయి. ఉత్తరాదిన కేవలం వ్యక్తి పూజ జరుగుతుంది అని ఆరోపించేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దుల్కర్ చేసిన వ్యాఖ్యలు అదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి అనే మాట వాస్తవం. బాలీవుడ్ మొదటి నుంచి కూడా ఆడంబరాలకు పెట్టింది పేరు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవు అయినప్పటికీ బాలీవుడ్లో అదే ఆడంబరాల పరిస్థితి కొనసాగుతోంది అనేది దుల్కర్ సల్మాన్ మాటలను బట్టి మరోసారి నిరూపితం అయ్యింది. బాలీవుడ్ ప్రతిభ కంటే ఆడంబరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని, అందుకే అక్కడ సినిమాలు ఈ మధ్యకాలంలో సరిగా ఆడడం లేదు అనేది ప్రేక్షకుల అభిప్రాయం. బాలీవుడ్ వర్గాల వారు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు.

మలయాళ స్టార్ నటుడు...

మలయాళం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలను చేస్తున్న దుల్కర్ సల్మాన్ తనకు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఎదురైనా చేదు అనుభవం గురించి ఇటీవల ఒక చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్లో హడావుడి ఎక్కువ ఉంటుందని, అక్కడ కంటెంట్ ఉన్న వారి కంటే.. కాస్త పలుకుబడి ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. నెపోటిజం ఇప్పటికే బాలీవుడ్ లో ప్రముఖంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అక్కడ సినిమాల మేకింగ్ విషయంలో విమర్శలు ఎదురవుతున్నాయి, అయినప్పటికీ నటీనటులు దర్శకులు ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రతిభ ఫై దృష్టి పెట్టకుండా కేవలం తమను తాము స్టార్స్ గా చూపించుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఎక్కువగా పబ్లిసిటీకి బాలీవుడ్ వారు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. బాలీవుడ్ లో ఉన్న ఈ పబ్లిసిటీ పిచ్చి కారణంగా సౌత్ నుంచి వెళ్లిన వారు అక్కడ ఎక్కువ గుర్తింపు దక్కించుకోలేకపోతున్నారు.

బాలీవుడ్ గురించి దుల్కర్ సల్మాన్...

దుల్కర్ సల్మాన్ ఒక హిందీ సినిమా లో నటించిన సమయంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి మాట్లాడుతూ... సెట్స్ లో నేను ఎక్కువగా ఒక స్టార్ని అని నిరూపించుకోవాల్సి వచ్చేది. నా వెంట ఇద్దరు ముగ్గురు ఎప్పుడు హడావుడి చేసేందుకు ఉండాల్సి వచ్చేది. అలా హడావుడి చేయకుంటే నన్ను ఎవరు పట్టించుకునేవారు కాదు, కనీసం నన్ను మానిటర్ దగ్గర నిలబడి చూసేందుకు కూడా అవకాశం ఇచ్చే వాళ్ళు కాదు. ఖరీదైన కారులో సెట్ కి రాకపోతే ఎవరు కనీస మర్యాద ఇచ్చేవారు కాదు. అందుకే బాలీవుడ్ సినిమాలు నటించేటప్పుడు మెయింటెన్స్ ఎక్కువగా చేయాల్సి వచ్చేదని దుల్కర్ సల్మాన్ చెప్పకనే చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ సినిమాలను ఎక్కువ చేయకపోవడానికి కారణం ఇదేనా అంటే ఆయన నేరుగా సమాధానం ఇవ్వనప్పటికీ ఇదే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ నుండి ఎంతోమంది ఇతర భాషల సినిమాలకు వలస వెళ్తున్నప్పటికీ అక్కడి వారి పద్ధతి మారడం లేదు అనేది కొందరి విమర్శ. తాజాగా దుల్కర్ సల్మాన్ మాత్రమే కాకుండా మరికొందరు సౌత్ హీరో హీరోయిన్స్ కూడా అదే విధంగా వ్యాఖ్యలు చేశారు.

కాంత సినిమాతో దుల్కర్...

మలయాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంతా సింపుల్గా ఉంటుందని, షూటింగ్ కి ఒంటరిగా వెళ్లే వాళ్ళం.. పక్కన ఎవరూ ఉండరు. చిన్నచిన్న గ్రామాలకు వెళ్లి షూటింగ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా ఒక స్టార్ కి సౌత్ ఇండియన్స్ ఇచ్చే గౌరవ మర్యాదలు బాగుంటాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ అనిపించుకోవడానికి హడావుడి చేయాల్సి ఉంటుంది, ఖరీదైన కార్లను చూపించాల్సి ఉంటుందని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈయన నటించిన కాంత సినిమాకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ సినిమాలో ఈయన పోషించిన పాత్ర విషయంలో మొదట కొంత నెగిటివిటీ వచ్చినప్పటికీ, సినిమా రన్ మొదలైన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాడు. ఈ మధ్యకాలంలో దుల్కర్ సల్మాన్ ప్రతి సినిమాతో మినిమం సక్సెస్ సొంతం చేసుకుంటున్నాడు. దాంతో ఆయన తమ సినిమాలో నటించాలని పలువురు నిర్మాతలు కోరుకుంటున్నారు అంతేకాకుండా పెద్ద దర్శకులు సైతం ఆయనతో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News