దుల్కర్ సినిమా.. ప్రమోషన్స్ లేకపోవడం వెనుక అసలు కారణమేంటి?
కానీ సైలెంట్‌గా చిన్న సినిమా స్థాయిలో విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉందని దుల్కర్ సల్మాన్‌ను అభిమానించే తెలుగు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
'మహానటి' టైమ్ నుంచి తెలుగు ప్రేక్షకులు దుల్కర్ సల్మాన్‌ను తెలుగు హీరోగానే భావిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దుల్కర్ సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. దుల్కర్ నటించిన డైరెక్ట్ తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా మలయాళ, తమిళ సినిమాలు సైతం తెలుగులో మంచి వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే దుల్కర్ నటించిన ఏ భాష సినిమానైనా తెలుగులో విడుదల చేయడానికి పోటీ ఉంటుంది. తాజాగా దుల్కర్ ఐయామ్ గేమ్ అనే సినిమాలో నటించాడు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగులో పెద్ద ఎత్తున విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ సైలెంట్‌గా చిన్న సినిమా స్థాయిలో విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉందని దుల్కర్ సల్మాన్‌ను అభిమానించే తెలుగు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఐయామ్ గేమ్...
నహాస్ హిధాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించిన 'ఐయామ్ గేమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు అంటే సెప్టెంబర్ 3న విడుదల కాబోతుంది. ఇతర రాష్ట్రాల పరిస్థితి గురించి పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒకటి వస్తుంది అనే హడావిడి కూడా కనిపించడం లేదు. కనీసం సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారు సైతం ఐయామ్ గేమ్ మూవీనా? హీరో ఎవరు? అని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. దుల్కర్ సల్మాన్‌కి ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని సినిమాను అన్ని రకాలుగా పబ్లిసిటీ చేసి ఉంటే తప్పకుండా మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యేవి అనడంలో సందేహం లేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మొదటి రెండు మూడు రోజులు దుల్కర్ అభిమానులు కలెక్షన్స్ కురిపించే వారు.. కానీ సినిమాకు మినిమం ప్రమోషన్ లేకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్ పెద్దగా జరగడం లేదు.
తెలుగులో ఐయామ్ గేమ్ మూవీ రిలీజ్...
ఐయామ్ గేమ్ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వారు విడుదల చేస్తున్నారు. సందీప్ గుణ్ణంతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగిందట. అయితే ఇప్పటి వరకు వీరు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు. దుల్కర్ సల్మాన్ తన గత డబ్బింగ్ చిత్రాల ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దుల్కర్ ఎక్కువ సమయం కేటాయించక పోవడానికి కారణం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దుల్కర్‌తో కాకున్నా కనీసం సోషల్ మీడియా క్యాంపెయిన్, ప్రెస్ మీట్ వంటివి కూడా జరగలేదు కదా అనే అనుమానాలు వస్తున్నాయి. దుల్కర్ వంటి మంచి క్రేజ్ ఉన్న హీరో సినిమాను పబ్లిసిటీ చేయక పోవడం అనేది పెద్ద తప్పు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో దుల్కర్ సల్మాన్ మూవీ...
దుల్కర్ సినిమాను అసలు అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో విడుదల చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. దాంతో కొందరు అన్నపూర్ణ స్టూడియోస్ అఫిషియల్ ఎక్స్ ఖాతాకి వెళ్లి చూస్తే అక్కడ అడపా దడపా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. తామే విడుదల చేస్తున్నాము అన్నట్లు అందులో పేర్కొన్నారు. పోస్టర్స్ పై కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోగో ఉంది. కనుక తెలుగు డబ్బింగ్ వర్షన్ ను విడుదల చేస్తున్నది అన్నపూర్ణ స్టూడియోస్ అని తెలుస్తుంది. కానీ పబ్లిసిటీ మాత్రం పెద్దగా చేయక పోవడానికి కారణం ఏమై ఉంటుంది అనేది తెలియడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి దుల్కర్ సల్మాన్ కి ఉన్న ఇమేజ్‌తో సంబంధం లేకుండా రేపు విడుదల కాబోతున్న ఐయామ్ గేమ్ సినిమా ఎలా ఉంటుంది, ఏ మేరకు వసూళ్లు నమోదు చేస్తుంది అనేది చూడాలి. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించడం విశేషం, జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు. దుల్కర్ స్టైలిష్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఆయన అభిమానులకు కచ్చితంగా ఒక మంచి సినిమాగా ఐయామ్ గేమ్ నిలుస్తుందని దర్శకుడు నహాస్ హిధాయత్ చెబుతున్నాడు.