డీఎస్పీ X తమన్.. నిజమేనా? ఎవరేమన్నారు?
అదే సమయంలో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది తమన్ ను ఉద్దేశించి పరోక్షంగా అన్నట్లుగా భావిస్తున్నారు.;
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ ప్రసాద్, తమన్ గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ తమకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకున్న వారిద్దరూ.. తమ వర్క్ తో అందరినీ మెప్పించారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
అయితే ఇప్పుడు దేవిశ్రీ, తమన్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ కోల్డ్ వార్డ్ జరుగుతున్నట్లు కొందరు నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు సంగీత దర్శకుల్లో ఎవరూ ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోనప్పటికీ, ఇటీవల ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
ముఖ్యంగా ఆ చర్చ.. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ తో స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్.. ఉస్తాద్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న డీఎస్పీ గురించి మట్లాడారు. దేవిశ్రీ ప్రసాద్ పనితీరుపై ఆయన మంచి ప్రశంసలు కురిపించారు.
సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేస్తే పాటల్లో సాహిత్యం, లయ, బీట్, గాత్రం స్పష్టంగా వినిపిస్తాయని అన్నారు. ఏదేమైనా పాట కంప్లీట్ సోల్ ను అంకితభావంతో అందించడం ఇప్పటి జనరేషన్ లో దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో హరీష్ శంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అదే సమయంలో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది తమన్ ను ఉద్దేశించి పరోక్షంగా అన్నట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా తమన్.. అఖండ 2 తాండవం మూవీకి వర్క్ చేసి విషయం తెలిసిందే. ఆ సినిమాకు గాను ఆయన పనితీరుకు మంచి మార్కులే పడ్డాయి. కానీ కొందరు సౌండ్ ఎక్కువైందని అన్నారు.
అందుకే హరీష్ శంకర్ అలా అని ఉంటారని కొందరు ఫిక్స్ అయ్యారు. అయితే అఖండ 2 ప్రమోషన్స్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు విజయాన్ని ఎలా చూస్తున్నారనే దాని గురించి తమన్ మాట్లాడారు. ఇండస్ట్రీలో ఇతరుల పనిని అభినందించే సంస్కృతి దాదాపు కనుమరుగైపోయిందని అన్నారు. ఇతర పరిశ్రమలతో పోలుస్తూ కూడా మాట్లాడారు.
"నన్ను ఏదైనా ప్రాజెక్ట్ కోసం సంప్రదించినప్పుడు, మరో సంగీత దర్శకుడు నిర్మాత వద్దకు వెళ్లి, అదే సినిమాను చాలా తక్కువ డబ్బుకు చేస్తానని ఆఫర్ ఇస్తున్నారు. ఇతర పరిశ్రమల్లో ఐక్యత బలంగా ఉంది. అలాంటి మద్దతు వ్యవస్థ తెలుగు ఇండస్ట్రీలో లేదు" అని అన్నారు. దీంతో మొన్న తమన్ వ్యాఖ్యలు.. ఇప్పుడు హరీష్ శంకర్ కామెంట్స్ ను చూసుకుంటే ఏదో జరుగుతున్నట్లు ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందులో నిజమెంతో వారికే తెలియాలి.