ఆ ఒక్క డ్రోన్.. దేవుడి మీద జక్కన్న అప్సెట్!
'వారణాసి' టైటిల్ రివీల్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా మొదలైందో, మధ్యలో అంత టెన్షన్ నడిచింది.;
'వారణాసి' టైటిల్ రివీల్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా మొదలైందో, మధ్యలో అంత టెన్షన్ నడిచింది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాన్సెప్ట్ ట్రైలర్‌ను ఆ భారీ స్క్రీన్‌పై ప్లే చేస్తున్న సమయంలో, ఊహించని సాంకేతిక లోపం తలెత్తింది. వీడియో పదే పదే ఆగిపోవడంతో రాజమౌళి ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది. లక్షలాది అభిమానులు, దేశవిదేశాల మీడియా ముందు ఇలా జరగడంతో జక్కన్న తీవ్రంగా నిరాశ చెందారు.
అదే సమయంలో తాను దేవుడును నమ్మను కానీ నాన్న గారు, సతీమణి నమ్మే హనుమాన్ కూడా తమకు అండగా నిలబడలేకపోయారని అంటూ కాస్త అప్సెట్ అయ్యారు. ఇక, ఈ గందరగోళానికి కారణం టెక్నికల్ టీమ్ నిర్లక్ష్యం కాదు. విచిత్రంగా, ఈ మొత్తం సమస్యకు కారణం ఒకే ఒక్క 'డ్రోన్'. అసలు టెక్నికల్ గ్లిచ్‌కు, డ్రోన్‌కు సంబంధం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, దీని వెనుక అసలు కథను, తన ఆవేదనను రాజమౌళే స్వయంగా వేదికపై వివరించాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే, ఈవెంట్‌కు ముందు రోజు రాత్రి 2 గంటల సమయంలో, జక్కన్న టీమ్ ఫైనల్ రిహార్సల్ కోసం ట్రైలర్‌ను టెస్ట్ ప్లే చేసింది. ముందు జాగ్రత్తగా పెద్ద పెద్ద క్రేన్ లతో భారీ క్లాత్ లతో నలువైపులా కవర్ చేసి మరీ ఆ టేస్ట్ చేయాలని అనుకున్నారు. అయితే అలా వీడియో ప్లే అయిన కొద్ది క్షణాలకే, ఒక డ్రోన్ ఆ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ వీడియోను రికార్డ్ చేయడం టీమ్ గమనించింది. ఇది ఎవరో పైరసీ చేయడానికి చేసిన పనే అని రాజమౌళికి అర్థమైంది.
వెంటనే అప్రమత్తమైన జక్కన్న, ట్రైలర్ లీక్ అయితే ఈవెంట్ చూసే అభిమానుల అనుభూతి మొత్తం దెబ్బతింటుందని భావించారు. అందుకే, ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, "వెంటనే టెస్ట్ ప్లే ఆపేయండి" అని ఆదేశించారు. అప్పటికే ఆ డ్రోన్ కొన్ని సెకన్ల విజువల్స్‌ను చిత్రీకరించేసింది. ఆ రాత్రి లీక్ భయంతో ఆపేసిన ఆ ఫైనల్ టెస్టింగ్ జరగకపోవడం వల్లే, అసలు ఈవెంట్ సమయంలో ఈ సాంకేతిక లోపాలు తలెత్తాయని రాజమౌళి వివరించారు.
లీకేజీని ఆపబోతే, చివరికి లైవ్ ఈవెంట్‌లో ఇలా టెక్నికల్‌గా ఫెయిల్ అవ్వాల్సి రావడం ఆయనను మరింత బాధ పెట్టింది. ఆ సమయంలో రాజమౌళి తీవ్ర అసహనానికి లోనయ్యారు. మరోవైపు హోస్టింగ్ చేసిన సుమ, ఆశిష్ కాంబినేషన్ కూడా అంతగా సెట్ కాలేదు. ఆశిష్ అయితే చివరికి చేతులెత్తేయగా సుమ ఒంటరి పోరాటం చేసింది.