దృశ్యం ఫ్రాంచైజీ ప్లానేంటి? మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందా?
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించిన దృశ్యం ఫ్రాంచైజీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.;
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించిన దృశ్యం ఫ్రాంచైజీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన రెండు పార్టుల తర్వాత.. ఇప్పుడు దృశ్యం 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఆసక్తి మరింత పెరిగింది. అదే సమయంలో ఆ ఫ్రాంచైజీ ఇక్కడితో ముగుస్తుందా? లేక ఇంకా కొనసాగుతుందా? మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ డైరెక్టర్ వద్ద ఉందా? అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న దృశ్యం 3 ఈసారి మరింత డార్క్, ఇంటెన్స్ మోడ్‌లో ఉండబోతుందనే ట్రైలర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. గత రెండు భాగాల్లో పోలీసుల దర్యాప్తు చుట్టూ కథ తిరిగితే.. ఈసారి మీడియా ఇన్వెస్టిగేషన్ కథలో కీలక అంశంగా మారింది. వరుణ్ ప్రభాకర్ కేసు వెనుక నిజాలు వెలికితీయడానికి ఇద్దరు యంగ్ జర్నలిస్టులు రంగంలోకి దిగినట్లు చూపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
జార్జ్ కుట్టి కుటుంబంపై మళ్లీ అనుమానాలు మొదలవుతుండగా.. మీడియా విచారణతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారినట్లు ట్రైలర్ లో హైలైట్ చేశారు. కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్ కుట్టి మరోసారి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. ప్రతి సీన్ ను ఉత్కంఠభరితంగా కట్ చేయడంతో ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా మే 21న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ డబ్బింగ్ వెర్షన్లు కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న దృశ్యం 3ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆ సినిమాపై ఆసక్తి తక్కువేమీ కాదు. వెంకటేష్, మీనా కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం, ‘దృశ్యం 2కు మంచి ఆదరణ లభించింది. అయితే మూడో భాగం విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. వెంకటేష్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో తెలుగు రీమేక్ ఆలస్యమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ముందుగా మలయాళ వెర్షన్ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇప్పుడు అసలు చర్చ అంతా దృశ్యం ఫ్రాంచైజీ భవిష్యత్తుపైనే నడుస్తోంది. మొదటి భాగం థియేటర్లలో సంచలనం సృష్టించగా.. రెండో భాగం ఓటీటీలో విడుదలై కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇప్పుడు మూడో భాగాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఆ నిర్ణయం వర్కౌట్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.
అయితే దృశ్యం 3తో కథ ముగుస్తుందా? అన్న ప్రశ్నకు మాత్రం ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. దర్శకుడు జీతూ జోసెఫ్ ఇప్పటివరకు ఆ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కానీ మోహన్ లాల్ మాత్రం ఇది చివరి భాగమని ఇప్పుడే అనుకోవద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో బట్టి ఫ్రాంచైజీ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
అయితే ఫ్రాంచైజీని కొనసాగించాలంటే కేవలం ట్విస్టులు మాత్రమే కాదు.. అదే స్థాయి ఎమోషన్, కథలో బలం కూడా అవసరం. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇంకా అవసరం. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టు మరింత ఉత్కంఠ రేపే స్టోరీ రాసుకుంటే క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు దృశ్యం సినిమాలకు అదే పెద్ద బలంగా నిలిచింది. మరి మూడో పార్ట్ తర్వాత మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి లేక ఇప్పటికే తీసుకున్నారేమో అన్నది తెలియాల్సి ఉంది.