వెంకీ మామ ఆశలు వదులుకోవాల్సిందేనా?
ఇదే ఇప్పుడు 'దృశ్యం3' తెలుగు రీమేక్‌కు అడ్డంకిగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.;
ఓటీటీల ప్రభావం మొదలైన దగ్గరి నుంచి ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో రీమేక్‌లు చేయాల్సిన అవసరం లేకుండా పోతోంది. అంతే కాకుండా పాన్ ఇండియా సినిమాల పరంపర మొదలైన దగ్గరి నుంచి ఒకే సినిమాని ఒక్కో భాషలో ఒక్కో హీరో చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏ భాషలో సినిమా విడుదలై హిట్ అనిపించుకున్నా సరే దేశం నలుమూలల్లో ఉన్న ప్రేక్షకులకి తెలిసిపోతోంది. ఇదే ఇప్పుడు 'దృశ్యం3' తెలుగు రీమేక్‌కు అడ్డంకిగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం'. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సంచలన విజాయన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్‌గా మరో సినిమాని చేశారు. అది కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ రెండు సినిమాలని తెలుగులో విక్టరీ వెంకటేష్ వెంకీ మామతో రీమేక్ చేయడం అవి కూడా సూపర్ హిట్ కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. 'దృశ్యం 2' వరకు పాన్ ఇండియా సినిమాల సంస్కృతి పెద్దగా లేదు. కానీ ఇప్పుడు పరిస్థితిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
దీనికి రీసెంట్‌గా విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్' మూవీనే నిదర్శనంగా నిలుస్తోంది. డిసెంబర్ 5న ఈ మూవీని కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. ఇతర భాషల్లో డబ్ చేయలేదు. అయినా సరే ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్‌ని కొనసాగిస్తోంది. భాషతో ప్రాబ్లం లేకపోవడంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ సినిమాని రికార్డు స్థాయిలో ఆదరిస్తున్నారు. ఈ మార్పే వెంకీ మామ 'దృశ్యం 3'కి ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
అంతే కాకుండా మోహన్ లాల్ చేసిన తుడరుమ్, హృదయపూర్వం వంటి సినిమాలు తెలుగులోనూ విడుదల కావడం, మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో `దృశ్యం 3` తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేసే అవకాశాలు చాలా తక్కువనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మలయాళంలో 'దృశ్యం 3' షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్న వేళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఏప్రిల్ ఫస్ట్‌వీక్‌లో సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో హిందీలోనూ 'దృశ్యం 3' షూటింగ్ జరుగుతోంది. దీన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయినా ఇంత వరకు తెలుగు రీమేక్‌కు సంబంధించిన ప్రకటన బయటికి రాకపోవడంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. 'ఆదర్శకుటుంబం హౌస్ నం.47' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఇది పూర్తయ్యే నాటికి మోహన్ లాల్ 'దృశ్యం 3' థియేటర్లలోకి వచ్చేస్తుంది. ప్రేక్షకులకు కథేంటో తెలిసిపోతుంది. దీంతో ఆ తరువాత వెంకటేష్ చేసినా ఫలితం ఉండదు. దానికంటే మోహన్ లాల్ మూవీనే తెలుగులోనూ రిలీజ్ చేస్తే బాగుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. మలయాళ మేకర్స్ కూడా ఇదే ఆలోచిస్తున్నారా? ఆ కారణంగానే తెలుగు రీమేక్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయడం లేదా? అనే సందేహం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.