రణ్ వీర్ (X) హృతిక్ రోషన్.. ఎవరు బెస్ట్ డాన్?
డాన్ 3 ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. రణ్ వీర్ ఎగ్జిట్ అయ్యాక ప్రతిదీ చర్చకు వస్తోంది.;
డాన్ 3 ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. రణ్ వీర్ ఎగ్జిట్ అయ్యాక ప్రతిదీ చర్చకు వస్తోంది. ఇప్పుడు కథానాయకుడి పాత్ర కోసం నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఎవరిని ఎంపిక చేసాడు? అన్నది సస్పెన్స్ గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ ఆవేదన ప్రధానంగా చర్చకు వస్తోంది. తనతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైన తర్వాత కూడా హృతిక్ రోషన్ తో ఫర్హాన్ అక్తర్ మంతనాలు సాగించడం సరైనదేనా? అని అతడు ప్రశ్నించాడు. పైగా తనకు దురంధర్ సినిమాతో సక్సెస్ వచ్చాకే, ఫర్హాన్ మనసు మార్చుకుని తనను కలిసాడని కూడా రణ్ వీర్ సింగ్ వివరణ ఇచ్చారు. అయితే అర్థాంతరంగా డాన్ 3 నుంచి వైదొలిగాడు గనుక ప్రీప్రొడక్షన్ కి చాలా ఖర్చయిందని, రణ్ వీర్ కోట్లు చెల్లించాలని ఫర్హాన్ ఆరోపిస్తున్నాడు.
ఇక ఆ ఇద్దరి గొడవ ఎలా ఉన్నా కానీ... ఇప్పుడు డాన్ ఫ్రాంఛైజీ అభిమానుల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకుముందు షారూఖ్ స్థానంలో రణ్ వీర్ ని ఎంపిక చేసినప్పుడు చాలా మంది అభిమానులు ఆ పాత్రకు అతడి స్థాయి సరిపోదని అన్నారు. రణ్ వీర్ సరైన ఎంపిక కాదని షారూఖ్ ఫ్యాన్స్ దర్శకనిర్మాత ఫర్హాన్ పై సీరియస్ అయ్యారు కూడా. అయినా అతడి మొండి పట్టుదలతో రణ్ వీర్ ని ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అతడు హృతిక్ రోషన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని రణ్ వీర్ చెబుతున్నాడు.
ఈ సమయంలో అసలు డాన్ పాత్రలో ఎవరు బెస్ట్ అన్న చర్చ మొదలైంది. రణవీర్ సింగ్ వర్సెస్ హృతిక్ రోషన్ వార్ లో గ్యాంగ్‌స్టర్ పాత్రకు ఎవరు బెస్ట్? అన్నది తేలాల్సి ఉంది. అయితే ఆ ఇద్దరి బలాబలాలను విశ్లేషిస్తే, రణవీర్ సింగ్ ఎనర్జీకి మారుపేరు. ఖిల్జీ (పద్మావత్) వంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను రణవీర్ అద్భుతంగా పండించగలడు. అయితే డాన్ పాత్రకు కావాల్సిన `క్లాసీ అండ్ కోల్డ్` నేచర్ కంటే రణవీర్ ఆహార్యం కొంచెం లౌడ్‌గా ఉంటుందనేది కొందరి అభిప్రాయం.
హృతిక్ రోషన్ అయితే డాన్ పాత్రకు సరిగ్గా సరిపోతాడు. అతడిలో ఉండే గ్రీక్ గాడ్ లుక్స్, `విక్రమ్ వేద`లో చూపించిన మాస్ గ్యాంగ్‌స్టర్ షేడ్స్ డాన్ 3 కి పెద్ద ప్లస్ అవుతాయి. అతడు ధూమ్ 2లో నెగెటివ్ షేడ్ పాత్రలో అదరగొట్టాడు. అందువల్ల అమితాబ్, షారుఖ్ తర్వాత ఆ స్థాయి స్టైలిష్ స్వాగ్.. ఎలివేషన్ ఒక్క హృతిక్ దగ్గరే ఉంది.
ఫర్హాన్ అక్తర్ హృతిక్‌ని ఫైనల్ చేశారా?
అయితే ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోయినా, రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాక ఫర్హాన్ అక్తర్ మొదటి ఛాయిస్ `హృతిక్ రోషన్` అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య లక్ష్య, జిందగీ నా మిలేగి దుబారా వంటి మంచి సినిమాల ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ వచ్చాకే హృతిక్ సంతకం చేసే అవకాశం ఉంది.
మరోవైపు హృతిక్ నటించి దర్శకత్వం వహించాల్సిన `క్రిష్ 4` భారీ విజువల్ ఎఫెక్ట్స్ , బడ్జెట్ కారణాల వల్ల ఆలస్యమవుతోంది. రాకేశ్ రోషన్ ఈ ప్రాజెక్ట్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ 4 ఆలస్యం కావడం హృతిక్‌కు ఒక రకంగా కలిసొచ్చింది. ఖాళీగా ఉండకుండా ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే `డాన్ 3` బెస్ట్ ఆప్షన్ కానుంది. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉంది.
గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఉన్న స్టైల్, గ్రేస్ పరంగా చూస్తే హృతిక్ రోషన్ `డాన్ 3`కి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. రణవీర్ తప్పుకోవడం ఒక రకంగా హృతిక్ ఫ్యాన్స్‌కు తీపి కబురే! ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫర్హాన్ అక్తర్ ఇచ్చే అధికారిక అప్‌డేట్ ఏమిటో వేచి చూడాలి.