డీఎన్ఏ: థియేటర్స్ లోకి వచ్చిన నెక్స్ట్ డే ఓటీటీలో.. టాక్ ఏంటీ?
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలను ఆదరిస్తారు. కథలో ఎక్కడైనా చిన్న ట్విస్ట్ వచ్చినా థ్రిల్ ఫీలవుతారు.;
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలను ఆదరిస్తారు. కథలో ఎక్కడైనా చిన్న ట్విస్ట్ వచ్చినా థ్రిల్ ఫీలవుతారు. తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో విడుదలైన "డీఎన్ఏ" అనే క్రైమ్ థ్రిల్లర్ కూడా అలాంటి ఆసక్తినే కలిగిస్తోంది. తమిళంలో నెల రోజుల క్రితం వచ్చిన ఈ చిత్రం తెలుగులో థియేటర్లలో ఒకరోజు ముందే విడుదలై మరుసటి రోజే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమాలో కథ విషయానికొస్తే, హీరో ఆనంద్ (అధర్వ) తన లవ్ ఫెయిల్యూర్ కారణంగా మద్యానికి అలవాటుపడతాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అతని కుటుంబ సభ్యులు దివ్య (నిమిషా సజయన్) అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. దివ్యకు కూడా ఒక మానసిక సమస్య ఉంటుంది. పెళ్లైన కొంతకాలానికి వీరికి బాబు పుడతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
ఆనంద్, దివ్యకు పుట్టిన బిడ్డ ఆసుపత్రిలో అదృశ్యమవుతుంది. తర్వాత తిరిగి తీసుకొచ్చిన బిడ్డ తనది కాదని దివ్య చెబుతుంది. మొదట అందరూ ఆమెను నమ్మకపోయినా, ఆనంద్ అనుమానంతో డీఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. అక్కడ అసలు విషయం బయటపడుతుంది. తన బిడ్డ ఎక్కడుంది, ఎవరు తీసుకెళ్లారు అనే విషయంపై పోలీసులతో కలిసి ఆనంద్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది.
ప్రేక్షకుల అభిప్రాయం విషయానికొస్తే, సినిమా చాలా ఉత్కంఠగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఆనంద్ పోలీసులతో సమాంతరంగా విచారణ చేయడం, అనుకోని క్లూస్ దొరకడం, ప్రతీ ట్విస్ట్ ప్రేక్షకులను స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తుంది. అంతేకాదు, పిల్లల అక్రమ రవాణా, మూఢ నమ్మకాల గురించి డైరెక్టర్ చూపించిన సీన్లు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.
నటీనటుల నటన గురించి ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అధర్వ తన సహజ నటనతో సినిమా మొత్తాన్ని ఎమోషనల్‌గా నడిపించాడు. దివ్యగా నిమిషా ఎమోషన్స్ కూడా బాగా పండాయి. అలాగే, ఎస్సై చిన్నస్వామిగా బాలాజీ శక్తివేల్, కీలకమైన సన్నివేశాల్లో తనదైన మార్క్ చూపించారు. సాంకేతికంగా సినిమా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమాను మరింత ఉత్కంఠగా మార్చాయి.
అయితే సినిమాలో కొన్ని పాటలు కథకు అడ్డు తగిలినట్లు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చివరి వరకూ ఉత్కంఠగా నడిచిన కథలో పాటలు కొంతమేరకు స్పీడ్ బ్రేకర్స్‌లా అనిపించాయి. అలాగే, ఎస్సై పాత్రకు సరైన ముగింపు లేకపోవడం, ఆనంద్ స్నేహితుడి పాత్ర చివర్లో కనబడకపోవడం లాంటి చిన్న లోపాలు తప్ప సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగానే సాగిందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి "డీఎన్ఏ" అనే ఈ సినిమా ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. థియేటర్లలో విడుదలైన వెంటనే ఓటీటీలోకి రావడంతో చాలా మంది డిజిటల్ వేదికపైనే సినిమా చూస్తున్నారు. ఒక థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.