మ్యూజిక్ డైరెక్ట‌ర్లు మార్చ‌ని టాప్ -4 డైరెక్ట‌ర్లు!

మ్యూజిక్ ప‌రంగా కొత్త‌గా ట్రై చేద్దామ‌న్న‌ది కొంద‌రి మేక‌ర్స్ ఆలోచ‌నైతే? కంప‌ర్ట్ జోన్ లోనే ఉండాల‌న్న‌ది మ‌రికొంత మంది ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌.;

Update: 2025-04-27 02:45 GMT

మ్యూజిక్ ప‌రంగా కొత్త‌గా ట్రై చేద్దామ‌న్న‌ది కొంద‌రి మేక‌ర్స్ ఆలోచ‌నైతే? కంప‌ర్ట్ జోన్ లోనే ఉండాల‌న్న‌ది మ‌రికొంత మంది ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌. అందులో రాజ‌మౌళి, సుకుమార్, మ‌ణిర‌త్నం, శంక‌ర్ లాంటి వారు ముందువ‌రుసలో ఉంటారు. ప్ర‌ముఖంగా రాజ‌మౌళి, సుకుమార్ అయితే ఈ విష‌యంలో పోటాపోటీగా క‌నిపిస్తారు. రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కూ 11 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వాట‌న్నింటికి సంగీతం అందించి కీర‌వాణి మాత్ర‌మే.

ప్ర‌స్తుతం ఎస్ ఎస్ ఎంబీ 29 ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమాకు కూడా కీర‌వాణీనే సంగీతం అందిస్తు న్నారు. మ్యూజిక్ విష‌యంలో రాజ‌మౌళి కీర‌వాణిని న‌మ్మినంత‌గా ఇండియాలో ఇంకే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ని న‌మ్మ‌రు. ఆ కాంబినేష‌న్ కూడా అలా సెట్ అయింది. దీంతో ఆకాశం భూమీ వేరైనా రాజ‌మౌళి- కీర‌వాణి మాత్రం వేరు కారు. ఇలాంటి కాంబినేష‌నే సుకుమార్- దేవి శ్రీ ప్ర‌సాద్. సుకుమార్ ఇప్ప‌టి వ‌ర‌కూ తొమ్మిది సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

వాట‌న్నింటికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. సుకుమార్ కూడా దేవిని న‌మ్మిన‌ట్లు ప్ర‌పంచంలో ఇంకే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ని న‌మ్మ‌డు. `పుష్ప` ప్రాంచైజీతో ఈ కాంబినేష‌న్ పాన్ ఇండియాలోనూ ఫేమ‌స్ అయింది. త‌దుప‌రి ఆర్సీ 17వ చిత్రానికి కూడా దేవి శ్రీనే సంగీతం అందిస్తున్నారు. అలాగే కోలీవుడ్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం కూడా ఎక్కువ‌గా ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కుల్నే రిపీట్ చేస్తుంటారు. ఇళ‌య‌రాజా, ఏ.ఆర్ రెహ‌మాన్ తోనే ఆయ‌న ఎక్కువ సినిమాల‌కు క‌లిసి ప‌నిచేసారు.

మ‌ణిర‌త్నం కంటెంట్ ని బ‌ట్టి వాళ్లిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌ర్ని ఎంపిక చేసుకుంటారు. ఇళ‌యరాజా ఈ మ‌ధ్య యాక్టివ్ గా లేవ‌క‌పోడంతో రెహ‌మాన్ ప్ర‌ధాన ఎంపిక‌గా మారారు. అలాగే మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఒకే ఒక్క‌డు రెహ‌మాన్. ఇప్ప‌టి వ‌ర‌కూ శంక‌ర్ 15 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వాటిలో రెండు చిత్రాలు మిన‌హా వాటికి రెహ‌మాన్ బాణీలు స‌మ‌కూర్చారు. `గేమ్ ఛేంజ‌ర్` కి థ‌మ‌న్, `అప‌రిచితుడు`కి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు.

Tags:    

Similar News