ప్రొడ్యూసర్స్ గా మారిన డైరెక్టర్స్!
ఇప్పటికే ఎంతోమంది దర్శకులు నిర్మాతలుగా మారి సక్సెస్ అవుతుంటే.. ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.;
సినిమా ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్ లో ప్రతి ఒక్కరు ఒకే విభాగంలో సెటిల్ కాకుండా.. రెండు, మూడు విభాగాలలో సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ సినిమాలలో అభిమానులను మెప్పిస్తూనే.. మరొకవైపు సింగర్స్ గా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా, డైరెక్టర్ లుగా, నిర్మాతలుగా చలామణి అవుతూ సత్తా చాటుతున్నారు. ఇకపోతే అందుకు తామేమి అతీతం కాదు అంటున్నారు దర్శకులు కూడా.. ఒకవైపు తమ అద్భుతమైన కథలను తెరపై చూపించడంలో సక్సెస్ అవ్వడమే కాదు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు కూడా.. అంతేకాదు కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వారికంటూ ఒక గుర్తింపును అందిస్తున్నారు.
ఇప్పటికే ఎంతోమంది దర్శకులు నిర్మాతలుగా మారి సక్సెస్ అవుతుంటే.. ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఎవరో కాదు వెంకీ కుడుముల. వినోదాత్మకమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన వెంకీ కుడుముల ఇప్పుడు "వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్" అనే బ్యానర్ ను స్థాపించి, ఇప్పుడు కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మహేష్ ఉప్పల అనే కొత్త దర్శకుడితో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో మలయాళ నటి అనస్వర రాజన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి టైటిల్ ని రేపు వెల్లడించనున్నట్లు సమాచారం. తన అద్భుతమైన డైరెక్షన్ విలువలతో దర్శకత్వంలో కొత్త ఒరవడి చూసిన ఈయన.. ఇప్పుడు నిర్మాణ రంగంలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
ఇక ఈయనతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీలోకి నిర్మాతలుగా అడుగు పెట్టారు తమిళ దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనగరాజ్. ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన వీరు.. ఇప్పుడు నిర్మాతలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నారు. వీరు కూడా తమ సొంత ప్రొడక్షన్ బ్యానర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే తమ మొదటి సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించనున్నారు. ఇకపోతే ఇలా ఉన్నట్టుండి వీరంతా నిర్మాతలుగా మారడానికి కారణం కొత్త కథలను, కొత్త దర్శకులను అలాగే నటీనటును ప్రోత్సహించాలని నిర్మాతలుగా అడుగుపెడుతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఇతరుల నిర్మాణంలో పనిచేసేటప్పుడు దర్శకులకు కొన్ని పరిమితులు ఉంటాయి. నిర్మాతగా మారడం ద్వారా వారు తమ సినిమాలలో పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను పొందడానికి వీలుంటుంది. అంతేకాదు తమ విజన్ ప్రకారం కథలను రూపొందించడానికి రాజీ పడే పరిస్థితి కూడా ఉండదు. ముఖ్యంగా ఎటువంటి ప్రయోగాలైన చేయడానికి వీలుంటుంది. ఈ క్రమంలోనే దర్శకులు ఇప్పుడు నిర్మాతలుగా మారుతున్నారని సమాచారం.
ఇప్పటికే నిర్మాతలుగా మారిన దర్శకులు ఎవరు విషయానికి వస్తే.. సుకుమార్ "సుకుమార్ రైటింగ్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. అలాగే త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ ను నిర్మించి ఈ బ్యానర్ ద్వారా తన భార్య సాయి సౌజన్య చేత చిత్రాలను నిర్మింపచేస్తున్నారు. అలాగే పూరీ జగన్నాథ్ పూరీకనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి, ఛార్మీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కొరటాల శివ, కళ్యాణ్ కృష్ణ కురసాల, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, శేఖర్ కమ్ముల, అజయ్ భూపతి, మారుతి ఇలా చాలామంది దర్శకులు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు.