దిల్ రాజు 'సంక్రాంతి'.. ప్రభాస్, రవితేజను ఎందుకు వదిలేసినట్లు?

అయితే డబ్బింగ్ వెర్షన్ మూవీలు జన నాయకుడు, పరాశక్తితోపాటు ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, రవితేజ యాక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు.;

Update: 2026-01-04 19:30 GMT

సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్‌ కు పండుగ. పెద్ద హీరోల నుంచి మీడియం రేంజ్ కథానాయకుల వరకు నటించిన సినిమాల విడుదల, భారీ ఓపెనింగ్స్ సాధించడం, థియేటర్ల వద్ద సందడి వాతావరణం ఏర్పడడం.. ఇవన్నీ ఈ సీజన్‌ కు ప్రత్యేకత. ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలువురు హీరోలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈసారి టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ తమ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. కోలీవుడ్ నుంచి విజయ్ దళపతి, శివకార్తికేయన్ సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్న నిర్ణయాలు హాట్ టాపిక్‌ గా మారాయి.

చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ లీడ్ రోల్ కనిపించనున్న నారీ నారీ నడుమ మురారి చిత్రాల పంపిణీ హక్కులను ఇప్పటికే దిల్ రాజు సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి రానున్న ఐదు తెలుగు స్ట్రయిట్ మూవీల్లో మూడింటిని రిలీజ్ చేస్తున్నారు.

అయితే డబ్బింగ్ వెర్షన్ మూవీలు జన నాయకుడు, పరాశక్తితోపాటు ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, రవితేజ యాక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ముఖ్యంగా రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తిపై తీసుకున్న నిర్ణయాల వెనుక కారణాలేంటన్నదానిపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

ఈసారి సంక్రాంతి పోటీ చాలా ఎక్కువగా ఉండటంతో బిజినెస్ రిస్క్‌ ను దిల్ రాజు గట్టిగా అంచనా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకే సీజన్‌ లో ఎక్కువ భారీ సినిమాలు విడుదలైతే, థియేటర్ల కేటాయింపు, షేర్ రికవరీ, ప్రేక్షకుల డివైడ్ అవ్వడం వంటి అంశాలు డిస్ట్రిబ్యూటర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

అందుకే కంటెంట్‌ పై ఎక్కువ నమ్మకం ఉన్న, ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే సినిమాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. డీల్స్ అనుకున్న రేట్లకు కుదరలేదన్న మాట కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో భారీ అడ్వాన్స్‌ లు, రికవరీ ప్రెజర్ ఉండటంతో ఆర్థికంగా లెక్కలు సరిపోలకపోయి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కోలీవుడ్ హీరోల సినిమాల విషయంలోనూ తెలుగు మార్కెట్‌ లో ఆశించిన బిజినెస్ అంచనాలు రాకపోవడంతో దిల్ రాజు దూరంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి, ఈ సంక్రాంతికి ఏ సినిమాలు భారీ విజయం సాధిస్తాయో.. దిల్ రాజు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు సరైనవో అన్నది మూవీలన్నీ విడుదలైన తర్వాతే తేలనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News