టాప్ స్టోరి: తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌ప్పు దారి ప‌ట్టించారు!

ఏది ఏమైనా దురంధ‌ర్ 2 విష‌యంలో ఆర్జీవీ అంచ‌నా త‌ప్ప‌లేదు. అత‌డి అంచ‌నా ప్ర‌కారం.. ఈ సినిమా 1000 కోట్ల క్ల‌బ్ ను అందుకుని 2000 కోట్ల క్ల‌బ్ లో కూడా చేరుతుంద‌ని ట్రేడ్ ఇప్ప‌టికే చెబుతోంది.;

Update: 2026-03-26 04:30 GMT

దురంధ‌ర్, దురంధ‌ర్ 2 స‌క్సెస్ త‌ర్వాత భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లో ర‌క‌ర‌కాల డిబేట్లు ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. దురంధ‌ర్ చిత్రంతో 1400కోట్లు అందుకుని.. దురంధ‌ర్- 2 తో 2000 కోట్లు అందుకోబోతున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఆదిత్యాధ‌ర్ ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ చాలా విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

అయితే ఆదిత్యాధ‌ర్ `దురంధ‌ర్` తీయ‌క ముందే ద‌శాబ్ధాల క్రితం ఆర్జీవీ `స‌త్య` తీసిన విష‌యాన్ని మ‌రువ‌కూడ‌దు. శివ‌, స‌త్య, క్ష‌ణ‌క్ష‌ణం ఇవ‌న్నీ దురంధ‌ర్ త‌ర‌హా క‌ల్ట్ క్లాసిక్ లే. ఇప్ప‌టిలా అప్పుడు శ్రుతిమించిన హింస‌, ఘోర ర‌క్త‌పాతం లేదు కానీ ఆర్జీవీ టేక‌ప్ చేసిన చాలా క‌థ‌లు ఇంచుమించు మాఫియా, గూండాయిజం చుట్టూనే తిరిగాయి. అందుకే ఆర్జీవీ దురంధ‌ర్ సినిమా చూసిన త‌ర్వాత త‌న సినిమా స‌త్య‌లోని క‌ల్ట్‌కు ఎక్స్ టెన్ష‌న్ అని ఫీలయ్యారు. ఆదిత్యాధ‌ర్ ని త‌న శిష్యుడి లాంటి వాడ‌ని కూడా భావించాడు. అత‌డిపై బోలెడంత అవిభాజ్య‌మైన ప్రేమ‌ను కురిపించారు. అంతేకాదు.. తెలుగు సినిమా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూస ఫార్ములాల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని, అందుకే దురంధ‌ర్ 2 ఎవ‌రూ ఊహించ‌న‌న్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుంద‌ని వ‌ర్మ అంచ‌నా వేసారు. ఈ సినిమా 2000 కోట్ల క్ల‌బ్ లో చేరుతుంద‌ని చెప్పిన మొద‌టి మొన‌గాడు ఆర్జీవీ. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ని మించి తెలుగు టెరిట‌రీలో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది అంటే దీని అర్థం క‌ల్ట్ ని మెచ్చుకున్న‌ట్టు రొటీన్ మూస క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఇక అంగీక‌రించ‌ర‌ని రుజువు అయిన‌ట్టు. ఒక‌ప్ప‌టిలా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా.. మ‌హేష్ సినిమా అనే రూల్స్ ఏవీ లేవు. స్టార్ల‌కు ఫ్యాన్ బేస్ ఉండొచ్చు.. అభిమాన బ‌లం ఎంతైనా ఉండొచ్చు.. కానీ అది బాక్సాఫీస్ వ‌ద్ద పాన్ ఇండియా స‌క్సెస్‌ని ఇవ్వ‌లేదు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ప్పుడు మాత్ర‌మే పాన్ ఇండియాలో దూసుకెళ్ల‌డం సాధ్య‌మ‌ని నిరూప‌ణ అవుతోంది.

ఏది ఏమైనా దురంధ‌ర్ 2 విష‌యంలో ఆర్జీవీ అంచ‌నా త‌ప్ప‌లేదు. అత‌డి అంచ‌నా ప్ర‌కారం.. ఈ సినిమా 1000 కోట్ల క్ల‌బ్ ను అందుకుని 2000 కోట్ల క్ల‌బ్ లో కూడా చేరుతుంద‌ని ట్రేడ్ ఇప్ప‌టికే చెబుతోంది. ఈ స‌మ‌యంలో ఆర్జీవీ కోణంలో విశ్లేషిస్తే టాలీవుడ్ కి దాదాపు మూడున్న‌ర‌ ద‌శాబ్ధాల క్రిత‌మే ఆర్జీవీ ఒక దిక్సూచిలాగా ప‌ని చేసారు. ఆయన ఒక ప్ర‌త్యేక‌మైన పాథ్ ని చూపించార‌ని విశ్లేషించాలి. ద‌శాబ్ధాల త‌ర్వాత కూడా ఇంపాక్ట్ చూపించే సినిమాల‌ను ఆయ‌న తెర‌కెక్కించార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. దురంధ‌ర్ త‌ర‌హాలోనే ఆర్జీవీ `స‌త్య‌`లో కూడా రియ‌లిజం, నేచురాలిటీ క‌నిపిస్తాయి. అయితే ఆర్జీవీకి దేశ‌భ‌క్తి త‌క్కువ కాబ‌ట్టి ఆ సినిమాలో దేశ‌భ‌క్తిని చేర్చ‌లేదు.

ఆర్జీవీ ప్ర‌కారం.. విశ్లేషిస్తే, 80లు, 90ల‌లో రైజ్ అయిన చాలా మంది ద‌ర్శ‌కులు తెలుగు ప్రేక్ష‌కుల్ని పూర్తిగా త‌ప్పు దారి ప‌ట్టించారు అంటే అతిశ‌యోక్తి కాదు. సినిమా అంటే రియ‌లిజం, నేచురాలిటీ అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి, అన‌వ‌స‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని చేర్చి, రియాలిటీతో సంబంధం లేకుండా సినిమాల‌ను తెర‌కెక్కించారు. రాఘ‌వేంద్ర‌రావు, బి.గోపాల్ మొద‌లు పూరి జ‌గ‌న్నాథ్, వివివినాయ‌క్, శ్రీ‌నువైట్ల వ‌ర‌కూ వీరంతా చేసింది ఇదే. సినిమాని సినిమాలో పాత్ర‌ల్ని నేచురాలిటీకి దూరంగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల వైపు న‌డిపించ‌డంలో వీరంతా విజ‌యం సాధించ‌డం వ‌ల్ల‌నే ఆర్జీవీ తెర‌మ‌రుగున ప‌డిపోయాడు. అత‌డొక క్లాసిక్.. మాస్ట‌ర్ పీస్ అని మాత్రం గుర్తింపు తెచ్చుకున్నా రేసులో మాత్రం వెన‌క‌బ‌డిపోయాడు. ప్ర‌జ‌లు ఘాటైన నాటైన‌ మ‌సాలాకు అల‌వాటు ప‌డ‌టం వ‌ల్ల‌నే వారు అందులోనే ఎక్కువ డోస్ కోరుకున్నారు త‌ప్ప రియాలిటీకి, స‌త్యానికి, వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న సినిమాల‌ను చూడాల‌ని ప్ర‌జ‌లు ఏనాడూ కోరుకోలేదు. ముఖ్యంగా తెలుగు ప్ర‌జ‌ల్ని ద‌శాబ్ధాల పాటు పైన చెప్పుకున్న చాలా మంది క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కులు త‌ప్పుదారి ప‌ట్టిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికీ బోయ‌పాటి, హ‌రీష్ శంక‌ర్ లాంటి డైరెక్ట‌ర్లు కూడా త‌ప్పు దారి ప‌ట్టించ‌డానికే ఇష్ట‌పూర్వ‌కంగా ప‌ని చేస్తున్నార‌ని కూడా ప్ర‌జ‌లు అంచ‌నా వేస్తున్నారు.

దీని ప‌ర్య‌వ‌సానాన్ని ఏ కోణంలో చూడాలి? అంటే.... ఆర్జీవీ ఫాలోవ‌ర్స్ లో శివ‌నాగ‌శ్వ‌ర‌రావు స‌హా స‌హ‌జ‌సిద్ధ‌మైన పాత్ర‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే ప‌లువురు ద‌ర్శ‌కులు పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా హంగుల న‌డుమ రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌తి సినిమా డాక్యుమెంట‌రీ అనే ముద్ర‌ను వేయించుకుంది. ఇవ‌న్నీ అవార్డుల‌కు ప‌నికొస్తాయి కానీ జ‌నాద‌ర‌ణ‌కు ప‌నికి రావు! అని నిరూపించ‌డం విచార‌క‌రం. అయితే ఇప్పుడు అదే రియాలిటీ, వాస్త‌విక‌త ఉన్న సినిమాల‌కు ప‌ట్టంగ‌ట్టే రోజులు ఇప్పుడు స్ప‌ష్ఠంగా క‌నిపిస్తున్నాయి. దురంధ‌ర్ ఫ్రాంఛైజీలో ర‌క్త‌పాతం, హింస వ‌దిలేస్తే చాలా స‌న్నివేశాలు రియ‌ల్ గా జ‌రుగుతున్నాయా? అనిపించేంత ప్ర‌భావ‌వంతంగా క‌నిపించాయి. అలా తీయ‌డంలో ఆదిత్యాధ‌ర్ స‌క్సెస‌య్యారు గ‌నుక‌నే ప్ర‌జ‌లు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అలా కాకుండా క‌థ ఎంపిక‌లో అలాగే హీరోయిజానికి ఎలివేష‌న్ ఇవ్వ‌డానికి ఆదిత్యాధ‌ర్ ప్ర‌య‌త్నించి ఉంటే క‌చ్ఛితంగా అత‌డు కూడా మ‌రో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా మిగిలిపోయి ఉండేవాడు!

Tags:    

Similar News