'ధురంధర్' గుణపాఠంతో అయినా కనువిప్పు కలుగుతుందా?
`ధురంధర్`ని పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు తెలుగు, తమిళ, ,మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసే వీలున్నా మేకర్స్ కేవలం హిందీలోనే విడుదల చేశారు.;
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న బాలీవుడ్ మూవీ 'ధురంధర్'. రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ అత్యంత డేరింగ్‌గా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టాక్ ఇఫ్ ది ఇండియాగా మారింది. డిసెంబర్ 5న ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా విడుదలై మౌత్ టాక్‌తో వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి పార్ట్ 2పై అంచనాల్ని స్కై హైకి చేర్చింది. కేవలం హిందీలో విడుదలై భారీ వసూళ్లని రాబట్టి సరికొత్త చర్చకు తెరతీసింది.
'ధురంధర్'ని పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు తెలుగు, తమిళ, ,మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసే వీలున్నా మేకర్స్ కేవలం హిందీలోనే విడుదల చేశారు. పాన్ ఇండియా లెక్కలు వేసుకోలేదు. కానీ ఆ స్థాయిలో సినిమా వసూళ్లని రాబడుతూ ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ మేకర్స్‌కి పెద్ద గుణపాఠం నేర్పుతోంది. మన దగ్గర భారీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతోందంటే మేకర్స్ టికెట్ రేట్లు పెంచేస్తుంటారు. ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారు.
అయితే 'ధురంధర్' టీమ్ ఇలాంటి జిమ్మిక్కులేవీ చెయ్యలేదు. భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కోసం టికెట్ రేట్లు పెంచాల్సిందే అని గత కొంత కాలంగా టాలీవుడ్ మేకర్స్ ప్రభుత్వాల వెంటపడుతూ ప్రేక్షకుల నడ్డివిరుస్తున్నాయి. ఈ విధానానికి ఒక విధంగా 'ధురంధర్' చెక్ పెట్టిందని చెప్పొచ్చు. భారీ బడ్జెట్‌తో సినిమాని నిర్మించినా టికెట్ ధరలు పెంచకుండా, పాన్ ఇండియా ట్రిక్కులు ప్లే చేయకుండా, ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయకుండా తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో రన్నవుతూ టాలీవుడ్ మేకర్స్‌కి పెద్ద గుణపాఠమే నేర్పుతోంది. ఇకపై టికెట్ జిమ్మిక్కులు అక్కర్లేదని స్పష్టం చేసింది.
మూడవ వారంలోనూ హైదరాబాద్‌లో హౌస్‌ఫుల్స్‌తో ప్రదర్శింపబడుతూ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆదరణ ఏ సినిమాకు దక్కలేదు. కంటెంట్ బలంగా ఉండి ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఎలాంటి భారీ పబ్లిసిటీ, మన వాళ్లు చేసే పబ్లిసిటీ స్టంట్‌లు లేకుండానే `ధురంధర్` కేవలం మౌత్ టాక్‌తో ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడటం విశేషం.
ఇది బాలీవుడ్ మేకర్స్ పబ్లిసిటీ వల్ల కాకుండా కేవలం కంటెంట్ స్ట్రాంగ్ ఉండటం, సినిమా చూసిన ఆడియన్స్ మౌత్ టాక్‌తో సినిమాని ప్రమోట్ చేయడంతోనే ఇది సాధ్యమైంది. ప్రేక్షకులు బలమైన కథని, నిజాయితీగా చేసిన ప్రయత్నానికి బ్రహ్మరథం పడతారని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. ఇదే తరహాలో అంతా కంటెంట్‌ని నమ్ముకుని నిజాయితీగా చేస్తే ఖచ్చింతగా ప్రేక్షకులు ఆదరిస్తారని 'ధురంధర్' నిరూపించింది. టికెట్ రేట్ల హైక్ కోసం పాకులాడే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, అండ్ స్టార్స్‌లో 'ధురంధర్' నేర్పిన గుణపాఠంతో ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందో చూడాలి.