ధురంధర్ 2 వర్సెస్ కాంతార: తెలుగు లెక్కలు ఎందుకు మారాయి?
బాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన 'ధురంధర్ 2' ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.;
బాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన 'ధురంధర్ 2' ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 11 రోజుల్లోనే 1300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుకుంది. అయితే ఇంతటి భారీ విజయం సాధించినా, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ద్వారా కేవలం 25 కోట్లు మాత్రమే రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో కన్నడ నుంచి వచ్చిన 'కాంతార' తెలుగులో 110 కోట్లకు పైగా వసూలు చేస్తే, ఈ హిందీ సినిమా ఎందుకు వెనకబడిందనేది ఇప్పుడు పాయింట్.
దీని గురించి బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మన దక్షిణాది సినిమాలను నార్త్ ఆడియన్స్ ఆదరించినట్లుగా, తెలుగు వారు హిందీ సినిమాలను ప్రోత్సహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వసూళ్లు తగ్గడానికి కారణం కేవలం భాషా భేదం మాత్రమే కాదు, దీని వెనుక చాలా ప్రాక్టికల్ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్ల దగ్గర ఉన్న పరిస్థితులను గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది.
నిజానికి 'కాంతార' సినిమా తెలుగులో చాలా ఎక్కువ స్క్రీన్లలో విడుదలయ్యింది. దానికి తోడు ఇక్కడి నేటివిటీకి తగ్గట్లుగా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు. కానీ 'ధురంధర్ 2' విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ లో దీనికి స్క్రీన్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. మెజారిటీ థియేటర్లలో హిందీ వెర్షన్‌నే ప్రదర్శించారు. హైదరాబాద్ వంటి నగరాల్లో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాను హిందీలోనే చూడటానికి ఎక్కువగా మొగ్గు చూపారు. దీనివల్ల డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్లు తక్కువగా కనిపిస్తున్నాయి.
మరో ప్రధానమైన అడ్డంకి ఈ సినిమా నిడివి. 'ధురంధర్ 2' దాదాపు 4 గంటల సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి వెనకడుగు వేశారు. అంత సమయం థియేటర్లో కూర్చోవడం కష్టమని భావించి చాలా మంది దూరంగా ఉండిపోయారు. ఇది కేవలం ఒక వర్గం ప్రేక్షకులను, అంటే యాక్షన్ డార్క్ కంటెంట్‌ను ఇష్టపడే యువతను మాత్రమే ఆకర్షించింది. అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ అప్పీల్ లేకపోవడం వల్ల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు.
సినిమా కంటెంట్ గురించి మాట్లాడితే, ఎక్కడా పెద్దగా నెగిటివ్ టాక్ అయితే రాలేదు. చూసిన వారంతా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. కానీ కాంతారలో ఉన్నట్లుగా ప్రతి సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఇందులో తక్కువగా ఉంది. బాలీవుడ్ మేకర్స్ కేవలం నంబర్లను చూసి విమర్శలు చేయడం కంటే, ఇక్కడి మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడం అవసరం. ఒక సినిమా 1300 కోట్లు వసూలు చేసిందంటే అది ఖచ్చితంగా గొప్ప విషయమే, కానీ ఒక ప్రాంతీయ మార్కెట్లో అది క్లిక్ అవ్వాలంటే అక్కడి ఆడియన్స్ పల్స్ ఇంకా ఎక్కువగా పట్టాలి. తెలుగులో కూడా ప్రమోషన్ డోస్ ఇంకాస్త పెంచితే సరిపోయేది.