డిస్చార్జ్ అయిన ధర్మేంద్ర.. చికిత్సకు సహకరిస్తున్న వ్యక్తిని చనిపోయాడు అంటూ ప్రచారం
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా.. సీనియర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ధర్మేంద్ర.. నేడు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుండి క్షేమంగా డిస్చార్జ్ అయ్యారు.;
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా.. సీనియర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ధర్మేంద్ర.. నేడు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుండి క్షేమంగా డిస్చార్జ్ అయ్యారు. ఆయన డిశ్చార్జ్ అయ్యారు అంటూ వార్తలు వెలువడడంతో అటు సెలబ్రిటీలు, అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇకపోతే ధర్మేంద్రను డిస్చార్జ్ చేసిన అనంతరం ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు ఆయన ఆరోగ్యం పై స్పందించారు.
విషయంలోకి వెళ్తే.. ముంబైలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేరిన ధర్మేంద్రకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సంధానీ మాట్లాడుతూ.. "ఈరోజు ఉదయం 7:30 గంటలకు ధర్మేంద్రను డిశ్చార్జ్ చేశాము. అయితే ఆయనకు ఇంటి వద్ద నుంచే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ధర్మేంద్రను డిశ్చార్జ్ చేసాము" అంటూ వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా మరొకవైపు ప్రముఖ నటుడు ధర్మేంద్ర అక్టోబర్ 31వ తేదీన రెగ్యులర్ చెకప్ లో భాగంగా హాస్పిటల్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ విషయం కాస్త వైరల్ అవ్వడంతో అప్పుడే అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైంది అంటూ కంగుపాటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్పందించి.. రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ కి వచ్చారు అని క్లారిటీ ఇచ్చారు. ఇంతలోనే నవంబర్ 10వ తేదీన మళ్లీ ఆయన హాస్పిటల్ లో చేరారు. పైగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు.. అందుకే హాస్పిటల్లో వెంటిలేటర్ కింద చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. అంతేకాదు నిన్న ఏకంగా ఆయన చనిపోయారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
ముఖ్యంగా ధర్మేంద్ర చనిపోయారు అంటూ నేషనల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో..అటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు పలు మీడియా ఛానల్స్ కూడా ఈ విషయాన్ని తెగ వైరల్ చేశారు. ఇక ఈ విషయం కాస్త కుటుంబ సభ్యులకు చేరడంతో ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ మీడియాపై మండిపడింది. మా నాన్న చనిపోలేదు బ్రతికే ఉన్నాడు.. చికిత్సకు సహకరిస్తున్న వ్యక్తిని చనిపోయాడు అంటూ ప్రచారం చేయడం చాలా బాధాకరం అంటూ ఆమె పోస్ట్ చేస్తూ తన బాధను వ్యక్తపరిచింది.
అంతేకాదు ధర్మేంద్ర రెండవ భార్య, ప్రముఖ సీనియర్ హీరోయిన్ హేమమాలిని కూడా ధర్మేంద్ర మరణం పై వస్తున్న వార్తలను ఖండించింది. బ్రతికి ఉన్న మనిషిని చనిపోయాడు అంటూ ప్రచారం చేయడం అగౌరవనీయం.. చికిత్సకు సహకరిస్తున్నారు. దయచేసి మా కుటుంబానికి గోభ్యతకు గౌరవం కల్పించండి. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక విషయాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తారు అంటూ మండిపడింది హేమమాలిని. మొత్తానికి అయితే ధర్మేంద్ర మరణించారు అంటూ వస్తున్న వార్తలకు నిన్నటితో క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు నేడు ఆయనను డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇంట్లోనే ధర్మేంద్రకు చికిత్స అందించనున్నట్లు సమాచారం. ఇకపోతే ధర్మేంద్ర వయసు ప్రస్తుతం 89 సంవత్సరాలు.