ధనుష్ 'కర' లెక్కలు.. అసలు కారణమేంటి?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.;
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా ధనుష్ సినిమాలకు సాధారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఆ చిత్రం చాలా వీక్ ఓపెనింగ్స్ నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నిజానికి మొదటి రోజు సుమారు రూ.6.20 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టిన ఆ సినిమా, రెండో రోజు కొద్దిగా మెరుగై రూ.6.95 కోట్లకు చేరింది. అయితే మూడో రోజు మళ్లీ డ్రాప్ అవుతూ రూ.5.20 కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తం మూడు రోజుల్లో ఇండియాలో గ్రాస్ రూ.21.22 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ లో రూ.7.65 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.28.87 కోట్లకు చేరాయి.
ఆ నెంబర్స్ చూస్తే సినిమా పూర్తిగా ఫ్లాప్ అనలేం కానీ, ధనుష్ రేంజ్ కు తగ్గ వసూళ్లు మాత్రం కావని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాపై కనీస స్థాయిలో కూడా బజ్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. విడుదలకు ముందు సరైన ప్రమోషన్లు లేకపోవడం, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ఈవెంట్స్ జరగకపోవడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.
ఇంకా ఒక ప్రధాన కారణం ట్రైలర్. సాధారణంగా ఒక సినిమాకు ట్రైలర్ ప్రధాన ఆయుధం. కానీ కర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథలో ఏముంది? సినిమా ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తిని కలిగించేలా లేకపోవడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు పెద్దగా ముందుకు రాలేదని అంటున్నారు. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఆ చిత్రం రైతుల సమస్యలపై ఆధారపడిన సామాజిక సందేశంతో కూడిన మాస్ డ్రామాగా తెరకెక్కింది.
కథ పరంగా మంచి స్టోరీ లైన్ ఉన్నప్పటికీ, ప్రెజెంటేషన్ లో లోపాలు కనిపించాయని టాక్ వినిపిస్తోంది. అలాగే హీరోయిన్ గా నటించిన మమితా బైజు తప్ప, ఇతర ముఖ్య పాత్రల్లో పెద్దగా గుర్తింపు ఉన్న నటులు లేకపోవడం మైనస్ గా మారింది. తమిళనాడులో ధనుష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ మంచి ఓపెనింగ్స్ రావాల్సి ఉన్నా, అక్కడ కూడా వసూళ్లు అనుకున్నట్లు లేకపోవడం గమనార్హం. ఇది స్టార్ ఇమేజ్ ఒక్కటే సరిపోదని, ప్రేక్షకులు కంటెంట్ నే ప్రాధాన్యంగా చూస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది.
ఈ రోజుల్లో స్టార్ డమ్ కంటే కంటెంట్ ముఖ్యమైంది. మంచి కథ, ఆకట్టుకునే కథనం ఉంటేనే సినిమా నిలబడుతుంది. ఓపెనింగ్స్ స్టార్ డమ్ ను చూపించవచ్చు. కానీ సక్సెస్ మాత్రం కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే కర మూవీకి వచ్చిన రిజల్ట్ ధనుష్ కెరీర్ లో ఒక వార్నింగ్ లా మారిందని చెప్పాలి. ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో కథల ఎంపిక, ప్రమోషన్ ప్లాన్స్ లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. ఇక ఆ సినిమా రాబోయే రోజుల్లో వసూళ్లు పెంచుకుంటుందా? లేక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి.