నిశ్శబ్దాన్ని ఛేదించిన సాహసం దీపికా పదుకొణే!
గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీల జీవితాలు బయటకు ఎంతో అందంగా కనిపించినా? అంతర్గతంగా వారు కూడా ఒత్తిళ్లను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటుంటారు.
గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీల జీవితాలు బయటకు ఎంతో అందంగా కనిపించినా? అంతర్గతంగా వారు కూడా ఒత్తిళ్లను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటుంటారు. మానసిక ఆరోగ్యం, ముఖ్యంగా డిప్రెషన్ వంటి విషయాల గురించి మాట్లాడటం పెద్ద అపరాధంగా చూసే రోజుల్లో తన వ్యక్తిగత పోరాటాన్ని బహిరంగంగా పంచుకుని సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు అగ్ర నటి దీపికా పదుకోణే- డాడ్ ప్రకాష్ పదుకోణే. ప్రకాష్ పదుకోణే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అగ్ర నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి విషయాన్ని బయట పెడితే కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆందోళన సహజంగానే ఉంటుంది.
కానీ తనలాగే లక్షలాది మంది ఈ సమస్యతో లోలోపల నలిగిపోతున్నారని.. తన కథ వారిలో ధైర్యాన్ని నింపుతుందని దీపికా బలంగా నమ్మింది. ఇతరులకు సహాయం చేయాలనే నిస్వార్థ సంకల్పమే దీపికను బహిరంగంగా మాట్లాడేలా చేసిందని ప్రకాష్ వెల్లడించారు. మొదట్లో దీపిక ప్రవర్తనలో మార్పులను గమ నించినప్పుడు తల్లి ఉజ్జల పదుకోణే వెంటనే స్పందించి వైద్య సహాయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారన్నారు. సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో సమస్యను దాచకుండా దానికి సరైన చికిత్స అందించడమే కాకుండా ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయానికి కుటుంబం కొండంత అండగా నిలిచిందన్నారు.
ఒక సెలబ్రిటీ కుటుంబం ఈ సమస్యను ఎంత పరిణతితో ఎదుర్కొందో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఈ మానసిక పోరాటం వ్యక్తిగత విజయంతోనే ముగిసిపోలేదు. తన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న దీపిక సమాజంలో శాశ్వత మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో `ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్` ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సులు నిర్వహించడం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సహాయం అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.
తద్వారా మానసిక సమస్యలను సాధారణ అనారోగ్యంగానే చూడాలనే చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. సినిమా రంగం వంటి అత్యంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో మనుగడ సాగించడానికి బలమైన కుటుంబ మద్దతు ఎంతైనా అవసరం. దీపికా పదుకోణే జీవితంలో మొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ అందించిన నిరంతర మద్దతు ఆమె మానసిక స్థిరత్వానికి ఎంతో తోడ్పడింది. ఒక వ్యక్తి మానసిక సమస్యల నుండి పూర్తిగా కోలుకోవడానికి కేవలం మందులు మాత్రమే సరిపోవని.. చుట్టూ ఉన్నవారి ప్రేమ, అవగాహన , ఆదరణ అత్యంత కీలకమని ఈ ప్రయాణం తెలియజేస్తుంది. దీపికా పదుకోణే చూపిన చొరవ వల్ల ఎంతో మంది సామాన్యులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా మానసిక సమస్యలను ధైర్యంగా ఒప్పుకుంటూ చికిత్స పొందుతున్నారు.